ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

‘వన్ నెట్‌వర్క్, స్మార్ట్ ట్రాఫిక్‌’ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్: రియల్-టైమ్ ట్రాఫిక్ నిర్వహణ వైపు అడుగులు వేస్తున్న ఢిల్లీ

ఢిల్లీలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ నిమిత్తం రూ. 1,789.52 కోట్ల వ్యయానికి ఆమోదం

ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సాఫీగా, సమర్థవంతంగా మార్చనున్న ఏఐ-ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, టెక్నాలజీ ఆధారిత నిబంధనల అమలు, రియల్-టైమ్ ట్రాఫిక్ సమాచారం.. మూడు దశల్లో దీని పరిధిలోకి రానున్న ఢిల్లీకి చెందిన 42 ట్రాఫిక్ కారిడార్లు

అంబులెన్స్‌ల రాకపోకలకు ప్రాధాన్యత కల్పించడానికి, రద్దీని- రోడ్డు ప్రమాదాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దోహదపడనున్న ఈ వ్యవస్థ

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 3:15PM by PIB Hyderabad

ఢిల్లీ పోలీసు వ్యవస్థలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఐటీఎంఎస్) అమలు చేసే ప్రాజెక్ట్‌కు పన్నులతో కలుపుకుని దాదాపు రూ. 1,789.52 కోట్ల వెచ్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను గుర్తించిన 42 ట్రాఫిక్ కారిడార్లలో చేపట్టనున్నారు. దీనిని 24 నెలల వ్యవధిలో మూడు దశల్లో అమలు చేస్తారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు నిర్వహణ, కార్యకలాపాలు కొనసాగుతాయి.

జాతీయ రాజధానిలో ట్రాఫిక్ నిర్వహణ, రవాణా మౌలిక సదుపాయాలు, పట్టణ చలనశీలతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఐటీఎంఎస్) ద్వారా ఇప్పుడు ఒక ప్రధాన సాంకేతిక ఆధారిత అడుగువేస్తున్నారు. రియల్-టైమ్ ట్రాఫిక్ డేటా, అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఆటోమేటెడ్ నిబంధనల అమలు, సమగ్ర కమాండ్-అండ్-కంట్రోల్ వ్యవస్థల ద్వారా ఢిల్లీ‌లో ఇప్పటికే ఉన్న రోడ్డు నెట్‌వర్క్‌ను మరింత స్మార్ట్‌గా నిర్వహించడానికి ఈ ప్రాజెక్ట్ వీలు కల్పిస్తుంది.

ఢిల్లీలో ప్రస్తుతం సుమారు 71 లక్షల నమోదిత వాహనాలు(ప్రస్తుతం నడుస్తున్నవి) ఉన్నాయి. రోడ్డు మౌలిక సదుపాయాల విస్తరణ కంటే వాహనాల వృద్ధి గణనీయంగా పెరిగింది. అయితే ట్రాఫిక్ నియంత్రణ ఇప్పటికీ ఎక్కువగా స్థిరమైన సిగ్నల్ సమయాలు, మాన్యువల్ జోక్యంపైనే ఆధారపడి ఉంది. రహదారిపై వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణ గతిశీలకంగా స్పందించేలా చేయడం ద్వారా అందుబాటులో ఉన్న రోడ్డు సామర్థ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి ఐటీఎంఎస్ ప్రయత్నిస్తుంది.

ప్రయోజనాలు:

  • స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, సాఫీగా సాగే ప్రయాణం: అడాప్టివ్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులకు తగినట్లుగా సిగ్నల్ సమయాలను ఎప్పటికప్పుడు మారుస్తాయి. ఇవి గుర్తించిన కారిడార్లలో సిగ్నల్స్‌ను సమన్వయం చేస్తాయి. దీనివల్ల అనవసరంగా ఆగిపోవటం, ఆలస్యమవటం తగ్గిపోతుంది.

  • అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు ప్రాధాన్యత: రద్దీగా ఉండే ప్రాంతాల్లో అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఈ వ్యవస్థ గ్రీన్ కారిడార్లు, ప్రాధాన్యతతో కూడిన రాకపోకలను సులభతరం చేస్తుంది.

  • రద్దీ, ప్రమాదాల విషయంలో వేగవంతమైన స్పందన: ట్రాఫిక్ రద్దీ, నెమ్మదిగా కదిలే వాహనాలు, రోడ్డు ప్రమాదాలను రియల్-టైమ్‌లో గుర్తించడం ద్వారా ఢిల్లీ పోలీసులు త్వరితగతిన మళ్లింపులు, కార్యాచరణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది.

  • ప్రయాణికులకు సకాలంలో సమాచారం: వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు.. రద్దీ, మళ్లింపులు, పార్కింగ్ లభ్యత, ట్రాఫిక్ పరిస్థితులపై సమాచారాన్ని అందిస్తాయి. ఈ సమాచారాన్ని నావిగేషన్ సర్వీస్ ప్రొవైడర్లతో కూడా పంచుకోవచ్చు. తద్వారా ప్రయాణికులు మెరుగైన ప్రయాణ ప్రణాళికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది.

  • మరింత నిలకడైన, సాంకేతిక ఆధారిత నిబంధనల అమలు: రెడ్-లైట్, స్టాప్-లైన్ ఉల్లంఘనలు, వేగంగా నడపడం, రాంగ్-వే డ్రైవింగ్, హెల్మెట్లు, సీట్ బెల్ట్‌లు ధరించకపోవడం, అక్రమ పార్కింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను ఆటోమేటెడ్ పద్ధతిలో గుర్తించడాన్ని ఈ వ్యవస్థ బలోపేతం చేస్తుంది. దొంగతనానికి గురైన, హాట్-లిస్ట్ చేసిన, బ్లాక్‌లిస్ట్ చేసిన వాహనాలను, పదే పదే నిబంధనలు ఉల్లంఘించేవారిని.. అలాగే హిట్-అండ్-రన్ సంఘటనలకు సంబంధించిన వాహనాలను గుర్తించడంలో ఏఐ-ఆధారిత విశ్లేషణలు కూడా సహాయపడతాయి.

నగర వ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ:

సురక్షితమైన డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ మౌలిక సదుపాయాల మద్దతుతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, సమాచార ప్రసారం ఒకే ఉమ్మడి వేదికపైకి వస్తాయి. భవిష్యత్తులో మరింత ఏకీకరణ, విస్తరణ సాధ్యమయ్యేలా ఈ వ్యవస్థ ఓపెన్ స్టాండర్డ్స్, ఏపీఐలను అనుసరిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి 1,092 అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు, 1,029 ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతాలు వస్తాయి. నిర్ణీత పరీక్షలు, ప్రారంభోత్సవం, ఆమోదం, పనితీరు ప్రమాణాల ఆధారంగా మునుపటి దశను అంచనా వేసిన తర్వాతే తదుపరి దశను చేపట్టేలా పనితీరు-ఆధారిత విధానంతో దీని అమలు ఉంటుంది. 

పోటీ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేసిన మాస్టర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ ద్వారా ఢిల్లీ పోలీసులు ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా సీ-డాక్ సాంకేతిక మద్దతును అందిస్తుంది. ఇందులో సాంకేతిక పరిశీలన, పర్యవేక్షణ, ధ్రువీకరణ, అమలు, నిర్వహణ దశల్లో ఆమోదం తెలపడం వంటివి ఉంటాయి.

ఢిల్లీలోని రోడ్డు, రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఈ ఐటీఎంఎస్ అదనపు బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే ఉన్న రోడ్డు నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన సాంకేతికత, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్‌ను ఇది అందిస్తుంది. ట్రాఫిక్ కదలికలు సాఫీగా సాగడానికి, రోడ్లు సురక్షితంగా ఉండడానికి, ప్రమాదాలకు త్వరితగతిన స్పందించడానికి, నిబంధనలు మరింత ప్రభావవంతంగా అమలవడానికి, పౌరులకు మరింత ఊహించదగిన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని భావిస్తున్నారు.

****


(రిలీజ్ ఐడి: 2317075) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Odia , Kannada , Malayalam