వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆహార కేంద్రంగా భారత్‌ను మార్చేందుకు ‘టీం ఆగ్రికల్చర్’గా పనిచేయాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు
రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం, రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి: కేంద్ర మంత్రి
కొత్త వాణిజ్య అవకాశాలతో అంతర్జాతీయ స్థాయికి భారత వ్యవసాయ ఉత్పత్తులు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
జాతీయ వ్యవసాయ సదస్సులో 10 రాష్ట్రాలకు పీఎం-ఆర్‌కేవీవై కింద రూ.1,200 కోట్లకు పైగా నిధుల మంజూరు
కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం.. దేశవ్యాప్తంగా ‘ఖేత్ బచావో అభియాన్’కు శ్రీకారం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
సుస్థిర వ్యవసాయ రంగానికి సహజ వ్యవసాయం, సమీకృత వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ కీలకం: కేంద్రమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 2:15PM by PIB Hyderabad
జాతీయ వ్యవసాయ సదస్సు-రబీ ప్రచారం 2026లో భాగంగా రెండో రోజు సమావేశానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో కేంద్రం, రాష్ట్రాలు పార్టీ రాజకీయాలకు అతీతంగా ‘టీమ్ అగ్రికల్చర్’ (వ్యవసాయ బృందం) స్ఫూర్తితో కలిసి పనిచేయాలని అన్నారు. దేశ ఆహార భద్రతను కాపాడడంతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచేందుకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. పార్టీలు ఏర్పడతాయి, రద్దవుతాయి. కానీ దేశం, రైతులు శాశ్వతం’’ అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని మెరుగుపరచడం, రైతుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆచరణాత్మక మార్గాలను కనుగొనడమే ఈ వేదిక ఉద్దేశమని, ఇది రాజకీయాలకు సంబంధించిన వేదిక కాదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి కీలక విధాన నిర్ణయం, అంతర్జాతీయ ఒప్పందంలోనూ రైతుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీ చౌహాన్ తెలిపారు. సదస్సులో ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (పీఎం-ఆర్‌కేవీవై కింద 10 రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు రూ.1,200 కోట్లకు పైగా నిధుల మంజూరు పత్రాలను శ్రీ చౌహాన్ అందజేశారు. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌదరి, వ్యవసాయ కార్యదర్శి శ్రీ అతీష్ చంద్ర, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్, కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వివిధ వ్యవసాయ సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.

పీఎం-ఆర్‌కేవీవై కింద 10 రాష్ట్రాలకు రూ.1,200 కోట్లకు పైగా నిధుల మంజూరు
పీఎం-ఆర్‌కేవీవై పథకం కింద 10 రాష్ట్రాలకు నిధుల మంజూరు పత్రాలను అందజేశారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు రూ.290 కోట్లు, హర్యానాకు రూ.198 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.181 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.154 కోట్లు, బిహార్‌కు రూ.114 కోట్లు, కర్ణాటకకు రూ.104 కోట్లు, మిజోరాంకు రూ.75 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.64 కోట్లు, జార్ఖండ్‌కు రూ.58 కోట్లు, పంజాబ్‌కు రూ.43 కోట్లు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం కేవలం విధానాలను రూపొందించడానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పథకాల అమలు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రారంభమయ్యేలా సకాలంలో నిధులు, అవసరమైన వనరులు అందేలా చర్యలు తీసుకుంటోందని శ్రీ చౌహాన్ తెలిపారు.

వ్యవసాయ వృద్ధి రేటు 4.5 శాతానికి పెరుగుదల
దేశ వ్యవసాయ రంగ పనితీరును శ్రీ చౌహాన్ ప్రస్తావిస్తూ.. 2015 నుంచి వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సగటు వార్షిక పెరుగుదల కూడా రెండింతలకు పైగా పెరిగిందని, గతంలో ఏడాదికి సుమారు 40 లక్షల టన్నులుగా ఉన్న ఈ పెరుగుదల ప్రస్తుతం 84 లక్షల టన్నులకు చేరిందని చెప్పారు. అలాగే కేవలం రెండేళ్ల వ్యవధిలో 2023-24 నుంచి 2025-26 మధ్య రబీ ఆహార ధాన్యాల ఉత్పత్తి 205 లక్షల టన్నుల మేర గణనీయమైన పెరుగుదల నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలు, శాస్త్రవేత్తలు, రైతుల సమష్టి కృషి వల్లే ఈ చారిత్రాత్మక వృద్ధి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో నెలవారీ వర్చువల్ సమీక్షలు

సహకార సమాఖ్య విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త విధానాన్ని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. కేంద్రంలో ప్రతి వారం నిర్వహించే సమీక్షల తరహాలో ఇకపై రాష్ట్రాలతో ప్రతి నెలా క్రమం తప్పకుండా వర్చువల్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పురోగతిని నిరంతరం సమీక్షించడమే వీటి ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కేవీకేలు), ఏటీఎంఏ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), ప్రగతిశీల రైతులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు, భారత ప్రభుత్వ నోడల్ అధికారులు కలిసి పనిచేసేలా బలమైన రాష్ట్ర వ్యవసాయ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (డీడీఏ),ఏటీఎంఏ, కేవీకేలు, ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, బ్యాంకర్లు, రైతులతో నెలవారీ సమావేశాలు నిర్వహించనున్నారు.
వ్యవసాయ సీజన్లకు ముందస్తు సన్నాహాల కోసం వార్షిక క్యాలెండర్

వ్యవసాయ కార్యక్రమాలకు ముందుగానే సన్నద్ధం కావడానికి వ్యవసాయ శాఖల సమన్వయ సమావేశాల కోసం వార్షిక క్యాలెండర్‌ను కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ కోసం ప్రతి సంవత్సరం మే 10న జిల్లా స్థాయి సమావేశాలు, మే 17న రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. రబీ సీజన్ కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న జిల్లా స్థాయి సమావేశాలు, సెప్టెంబర్ 17న రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు రైతుల సమస్యలపై చర్చించేందుకు వ్యవసాయ మంత్రులు, అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, దేశవ్యాప్తంగా ఒకే రోజున ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ‘ఖేత్ బచావో అభియాన్’
నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరిస్తూ.. ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా ‘ఖేత్ బచావో అభియాన్’ నిర్వహించాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, సంబంధిత అన్ని వర్గాల ప్రతినిధులు పాల్గొంటారు. భూసార ఆరోగ్య కార్డుల ఆధారంగా నేల సారాన్ని, ప్రయోజనకరమైన కీటకాలను రక్షించేందుకు, ఎరువులను సమతుల్యంగా వినియోగించేలా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. వరి కోత అనంతరం తూర్పు భారత్‌లోని వరి మాగాణి ప్రాంతాల్లో ముఖ్యంగా జార్ఖండ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పప్పుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
నేలలో తేమ, నీటి లభ్యత, పంటల రక్షణపై రబీ సన్నాహాల్లో దృష్టి
ప్రస్తుత రబీ సీజన్‌కు సన్నాహాల్లో భాగంగా పంటల ఎంపిక, మెరుగైన విత్తనాలపై సిఫారసులు నేలలోని తేమ, నీటి లభ్యత ఆధారంగా ఉండాలని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. పంటలను వ్యాధులు, చీడపీడల నుంచి రక్షించేందుకు సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీలులు) అందేలా చర్యలు తీసుకోవాలని, పంటల బీమా పథకం కింద పారదర్శకంగా పంట కోత ప్రయోగాలు (సీసీఈలు) నిర్వహించాలని సూచించారు. శాఖల పథకాల అమలుపై రాష్ట్ర మంత్రులు స్వయంగా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
నకిలీ వ్యవసాయ ఉత్పత్తులపై కఠిన చర్యలు.. బలవంతపు ట్యాగింగ్‌కు ముగింపు
దేశంలో విత్తనాలు, ఎరువుల లభ్యత తగినంతగా ఉందని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. నకిలీ ఎరువులు, నాసిరకం విత్తనాలు, నాణ్యత లేని పురుగుమందులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. అలాగే బలవంతపు ట్యాగింగ్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరంగా, రైతులకు లాభదాయకంగా మార్చేందుకు సహజ వ్యవసాయం, సమీకృత వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణను మిషన్ మోడ్‌లో అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు.
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహం
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన, గిట్టుబాటు ధరలు పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం ఈ వ్యూహంలో భాగమని చెప్పారు. కందులు, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించిన చెల్లింపులు 48 గంటల్లో జరిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏల) ద్వారా ఏర్పడుతున్న కొత్త మార్కెట్ అవకాశాలను భారత్ వినియోగించుకుంటుందని చెప్పారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు ఈ అవకాశాలను ఉపయోగించుకుంటామని తెలిపారు. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు, ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన ‘‘ఆహార భాండాగారం’’గా ఎదగడానికి అవకాశం ఉంటుందని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2316541)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12