సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఫైళ్ల నుంచి క్షేత్రస్థాయికి' సంక్షేమ పథకాలను చేర్చటంలో సమర్థవంతమైన వారధిగా హిందీ జర్నలిజం

అనువాదం మాత్రమే కాదు… ప్రభుత్వ పథకాల ఉద్దేశం, లక్ష్యాన్ని ప్రజలకు చేర్చాలి: సుధా శ్రీమాలి

వికసిత్ భారత్-2047 సంకల్పాన్ని ప్రజల భాగస్వామ్యంతో అనుసంధానించటంలో హిందీ, డిజిటల్ మీడియాది కీలక పాత్ర

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 6:18PM by PIB Hyderabad

ఏదైనా ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన తర్వాత అది అసలైన లబ్ధిదారునికి చేరినప్పుడే దాని ప్రభావం మొదలవుతుంది. ప్రభుత్వ పథకాల ప్రయాణాన్ని "ఫైళ్ల నుంచి క్షేత్రస్థాయికి" విజయవంతంగా చేర్చేందుకు... పథకంలోని క్లిష్టమైన భాషను సామాన్యుడికి అర్థమయ్యేలా సులభంగా మార్చటం, సరైన సందర్భంలో అందించటం కీలక వారధిగా ఉంటాయి. ఈ ప్రక్రియలో అత్యంత ప్రభావవంతమైన వారధిగా హిందీ జర్నలిజం ఉంటుంది. హిందీ మాసోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాసంలో నవభారత్ టైమ్స్ బిజినెస్ ఎడిటర్ సుధా శ్రీమాలి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 

 

కార్యక్రమ ప్రారంభంలో శ్రీమతి సుధా శ్రీమాలికి అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ సిద్ధార్థ్ బోడ్కే స్వాగతం పలికి, సత్కరించారు.

"వికసిత్ భారత్-2047 నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో హిందీ పాత్ర" అనే అంశంపై శ్రీమతి సుధా శ్రీమాలి మాట్లాడుతూ... ప్రభుత్వ సమాచారాన్ని హిందీలో అందించటం కేవలం పదాలను అనువదించే పని మాత్రమే కాదన్నారు. ఆ సమాచారం వెనుక ఉన్న ఉద్దేశం, స్ఫూర్తి, సందర్భాన్ని అర్థం చేసుకుని ప్రజల అవసరాలకు తగినట్లుగా దాన్ని అందించటమని చెప్పారు. సరైన సమాచారం సరళమైన, ఉపయోగకరమైన రూపంలో ప్రజలను చేరినప్పుడు, అది కేవలం సమాచారంగా మాత్రమే కాక, ప్రజల భాగస్వామ్యానికి కీలక శక్తిగా మారుతుందని పేర్కొన్నారు.

ఏదైనా పథకం ప్రకటించినప్పుడు సాధారణ పౌరుడి మదిలో కొన్ని ప్రశ్నలు మెదులుతాయని శ్రీమతి సుధా శ్రీమాలి పేర్కొన్నారు. అసలు ఆ పథకం ఏమిటి? దాని వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది? అర్హతా ప్రమాణాలు ఏమిటి? ఆ ప్రయోజనాలను ఎలా పొందవచ్చు? వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు నేరుగా, స్పష్టమైన సమాధానాలు ఇవ్వటమే జర్నలిజం బాధ్యత. వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వానిధి) పథకాన్ని ఉదాహరణగా చూపుతూ… ఆ పథకం ఎలా ఉపయోగపడుతుంది, దానిద్వారా ఎలా లబ్ధి పొందవచ్చని ఒక్కసారి చూడగానే పాఠకుడు అర్థం చేసుకునేలా వార్తల శీర్షిక, కథనం రాసే విధానం ఉండాలని ఆమె తెలిపారు.

 

 

నేడు సమాచార ప్రపంచం వేగంగా మారుతోందని ఆమె అన్నారు. వార్తాపత్రికలతో పాటు, ఆడియో ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికలు... ప్రభుత్వ విధానాలు, పథకాల గురించిన సమాచారాన్ని గతంతో పోలిస్తే చాలా విస్తృతంగా వ్యాపింపజేసే సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయతను కాపాడుకోవటమే మీడియా ప్రధాన బాధ్యత. సరళమైన, వాస్తవ సమాచారం కమ్యూనికేషన్ లోపాన్ని పూడ్చగలదు. అదే సమయంలో వదంతులు, తప్పుదారి పట్టించే సమాచార ప్రచారాన్ని తగ్గిస్తుంది.

 

సమాచార బదిలీ… ప్రభుత్వానికి, అక్కడి నుంచి మీడియాకు, ఆపై ప్రజలకు చేరే ఒకే మార్గంగా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. మీడియా స్పందనను తిరిగి ప్రభుత్వానికి చేరవేయటంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పాత్ర కీలకమని చెప్పారు. జర్నలిస్టులు, మీడియా సంస్థల నుంచి సేకరించిన ప్రశ్నలు, ప్రతిస్పందనలు, క్షేత్రస్థాయి అభిప్రాయాల ద్వారా సమాచారంలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దవచ్చని తెలిపారు.

కృత్రిమ మేధ యుగంలో పాత్రికేయ వృత్తి పాత్ర గురించి ఆమె ప్రస్తావిస్తూ... ఏఐని కేవలం ఒక సవాలుగా చూడకుండా, జర్నలిస్టుల పనిని మరింత ప్రభావవంతంగా మార్చే సహాయక సాధనంగా స్వీకరించాలని పేర్కొన్నారు. సమాచార విశ్లేషణ, ప్రజెంటేషన్, విస్తృత పంపిణీలో సాంకేతికత సహాయపడుతుంది. కానీ సమాచార నిజాయితీని, విశ్వసనీయతను నిర్ధారించే బాధ్యత ఎప్పుడూ జర్నలిజంపైనే ఉంటుంది.

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా ఉండాలని... అయితే అది పథకాలను ప్రశంసించేలా కాకుండా అసలైన ఉద్దేశాన్ని, ప్రయోజనాలను సరళమైన భాషలో ప్రజలకు చేరవేసేలా ఉండాలని శ్రీమతి సుధా శ్రీమాలి పేర్కొన్నారు. హిందీ భాషపై విస్తృతమైన అవగాహన, పెరుగుతున్న డిజిటల్ మీడియా విస్తృతి ఈ విధానాన్ని మరింత ప్రభావవంతం చేస్తున్నాయి. ఈ దృక్పథంతో వికసిత్ భారత్-2047 సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో హిందీ జర్నలిజం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెస్ట్ జోన్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స శర్మ ప్రసంగిస్తూ.. "నేటి డిజిటల్ యుగంలో సమాచారం విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల డేటా, సమాచారాన్ని జర్నలిస్టుల కోసం సేకరించి అత్యంత సరళమైన రీతిలో అందించటమే మా నిరంతర ప్రయత్నం. జర్నలిస్టుల సౌలభ్యం కోసం ప్రెస్ రిలీజ్‌లతో పాటు పీఐబీ నేపథ్య వివరాలను మేం జతచేస్తాం. ఫోటోలకు వివరమైన క్యాప్షన్‌లను రాస్తాం. తద్వారా మారుమూల ప్రాంత జర్నలిస్టులు కూడా నేపథ్యాన్ని సులభంగా అర్థం చేసుకోగలరు. ఆ అంశంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు అదనంగా సోషల్ మీడియా లింక్‌లు, లైవ్-స్ట్రీమింగ్ లింక్‌లను కూడా ప్రెస్ రిలీజ్‌లతో పాటు పంచుకుంటాం" అని తెలిపారు.

ముంబైలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స శర్మ ఆధ్వర్యంలో జరిగిన 'హిందీ మాసోత్సవం' సందర్భంగా ఈ ప్రత్యేక ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోన్ వ్యాప్తంగా ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు, సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. శ్రీమతి సుధా శ్రీమాలికి భోపాల్‌లోని పీఐబీ డైరెక్టర్ శ్రీ మనీష్ గౌతమ్ కృతజ్ఞతలు తెలియజేసి, కార్యక్రమాన్ని ముగించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2316513) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Hindi_Cg , English , Urdu , Marathi , Manipuri , Tamil