వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అమెరికాలో జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం: కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పయనం
· మిల్వాకీ.. షికాగో.. న్యూయార్క్‌లలో పెట్టుబడిదారులు... పరిశ్రమల అధినేతలు సహా అంకుర సంస్థల ప్రతినిధులతో చర్చించనున్న మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 6:19PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 5 దాకా అమెరికాలో పర్యటించడం కోసం ఇవాళ బయల్దేరారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) ఆహ్వానం మేరకు సెప్టెంబరు 30-అక్టోబరు 1 తేదీలలో విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో నిర్వహించే జీ20 కూటమి దేశాల వాణిజ్య మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు.
ఈ సమావేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రకంగా నియమాధారిత, సార్వత్రిక, సమ్మిళిత, పారదర్శక, సమాన, వివక్ష రహిత బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ దిశగా జీ20 సభ్య దేశాలతో భారత్ నిర్ణయాత్మక చర్చల్లో పాల్గొంటుంది. అలాగే, వర్ధమాన దేశాలకు తగుమేర విధానపరమైన వెసులుబాటు కూడా కల్పిస్తుంది. మరోవైపు ఇతర దేశాల వాణిజ్య మంత్రులతో శ్రీ గోయల్ ద్వైపాక్షిక చర్చల్లోనూ పాల్గొంటారు. రైతులు, మత్స్యకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు, ఇతర సంస్థలకు అవకాశాల విస్తరణపై ఈ సందర్భంగా దృష్టి సారిస్తారు.
భారత్-అమెరికా సమతుల, పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) పురోగమనం దిశగా నిరంతర కృషి కొనసాగుతోంది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరి 7 నాటి సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఒక మధ్యంతర ఒప్పందం ఖరారుకు శ్రీ పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రితోనూ ద్వైపాక్షికంగా సంప్రదింపుల్లో పాల్గొంటారు.
ఈ పర్యటనలో భాగంగా మిల్వాకీ, షికాగో నగరాల్లో తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయ వాణిజ్యం, రిటైల్, టెక్నాలజీ రంగాల్లోని ప్రసిద్ధ అమెరికా కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతోనూ శ్రీ గోయల్ సమావేశమవుతారు. దీంతోపాటు వాణిజ్య, అంకుర సంస్థలు సహా వినూత్న కంపెనీలతో రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. తయారీ, పెట్టుబడుల కూడలిగా భారత్‌లో గల అవకాశాలను వారికి విశదీకరిస్తారు. భారతీయ సంస్థలతో తమ భాగస్వామ్యాల పటిష్టానికి చొరవ చూపాల్సిందిగా పిలుపునిస్తారు.
ఇక గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీతోపాటు స్వామి వివేకానందకు షికాగోలో శ్రీ గోయల్ పుష్పాంజలి ఘటిస్తారు. అలాగే, ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వృత్తిపరమైన సంఘాలతోనూ సంభాషిస్తారు.
శ్రీ గోయల్ పర్యటన భారత్-అమెరికాల వాణిజ్య-పెట్టుబడుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా జి20 భాగస్వామ్య దేశాలతో స్నేహ సంబంధాలను పటిష్టం చేస్తుందని అంచనా.
***
(రిలీజ్ ఐడి: 2316267)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3