మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ‘సేవ ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ను ప్రారంభించనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
అయిదు దక్షిణ రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి యువతను ఒకచోట చేర్చనున్న కార్యక్రమం
ఈ కార్యక్రమానికి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24, 2026 వరకు అందుబాటులో ఉండనున్న రిజిస్ట్రేషన్లు
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 4:16PM by PIB Hyderabad
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (భారతీయ విజ్ఞాన సంస్థ-ఐఐఎస్‌సీ)లో ‘సేవ ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ (ఎస్ఎఫ్ఐసీ)ను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి రేపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను సమాజంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సహిస్తారు. ఈ పరిష్కారాలను పరీక్షించి, మెరుగుపరిచి, అమలు చేసే దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి సహా అయిదు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోటీని నిర్వహించనున్నారు.
ఈ పోటీలో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐలు), పాలిటెక్నిక్‌లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన యువత పాల్గొంటారు. ఇందులో జూనియర్, టెక్నికల్, ఓపెన్ అనే మూడు స్థాయిలు ఉంటాయి. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థులు జూనియర్ స్థాయిలో పాల్గొనవచ్చు. ఈ స్థాయిలో విద్యార్థులు స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి సరళమైన ఆచరణాత్మక పరిష్కారాలను లేదా తగిన ఆలోచనలతో కూడిన సేవలు, పాలనకు సంబంధించిన పరిష్కారాలను రూపొందించవచ్చు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల విద్యార్థులు ఇంజినీరింగ్, పరికరాల తయారీ (ఫ్యాబ్రికేషన్), ఎలక్ట్రానిక్స్, ప్రాసెస్ సొల్యూషన్స్‌కు సంబంధించిన పరిష్కారాలపై దృష్టి సారిస్తారు. డిగ్రీ, పీజీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు తమ పరిష్కార నమూనాలు లేదా ప్రయోగాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించాలి. వాటిని వాస్తవంగా అమలు చేసే అవకాశం, విధానం కూడా స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది.
ఈ ఛాలెంజ్ అయిదు జాతీయ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారిస్తుంది. అవి: 1) పరిశుభ్రమైన, సుస్థిరమైన భారత్, 2) సంపన్న రైతులు-సంపన్న భారత్, 3) ఆరోగ్యకరమైన, సమ్మిళిత భారత్, 4) విద్యావంతమైన, నైపుణ్యం కలిగిన భారత్, 5) సురక్షితమైన భారత్. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 24, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఛాలెంజ్ చివరి దశ అయిన జాతీయ ఫైనల్‌ను 2026 డిసెంబర్ 10 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు.
పోటీలో పాల్గొనేవారికి విద్యా రంగం, పరిశ్రమల నిపుణుల మార్గదర్శకత్వం, ప్రయోగశాలల సదుపాయం, పరికరాల తయారీ సౌకర్యాలు, పరీక్షల నిర్వహణకు సహకారం, ఇంక్యుబేషన్, ప్రారంభ దశ నిధులు, పైలట్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, క్షేత్రస్థాయి పరీక్షలకు అవకాశాలు, మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంబంధించిన మార్గదర్శకత్వం అందుబాటులో ఉంటాయి. ఆశాజనకమైన పరిష్కారాలను అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలతో అనుసంధానం చేసి వాటిని అమలు చేసే అవకాశాలను కల్పిస్తారు.
ఈ ఛాలెంజ్‌ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఐఐఎస్‌సీ బెంగళూరు ఈ కార్యక్రమానికి నోడల్ సంస్థగా వ్యవహరిస్తోంది.
సమాజంలో పాతుకుపోయిన సమస్యలను గుర్తించడం నుంచి వాటికి పరిష్కారాలను రూపొందించే దిశగా యువతను ప్రోత్సహించడం.. సమాజ అవసరాల ఆధారంగా కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. వికసిత్ భారత్ @ 2047 లక్ష్య సాధనకు యువత తమ వంతు సహకారం అందించేలా చేయడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://sevafirst.mic.gov.in/
(రిలీజ్ ఐడి: 2314559)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14