వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారులకు ఊరట: కీలక వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
ముడి సన్ ఫ్లవర్ నూనెపై బీసీడీ పూర్తిగా రద్దు.. సోయాబీన్, పామాయిల్‌పై సుంకం 5 శాతానికి తగ్గింపు
స్వదేశీ రిఫైనింగ్ రంగానికి మద్దతుగా ముడి, శుద్ధి చేసిన నూనెల మధ్య 19.25 శాతం సుంకం వ్యత్యాసం కొనసాగింపు
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 12:43PM by PIB Hyderabad
అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలో కూడా నూనె ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఉత్పన్నమయ్యే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వంటనూనెల ధరలను నియంత్రించడంతోపాటు వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా దిగుమతి చేసుకునే ప్రధాన ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (ప్రాథమిక దిగుమతి సుంకాలు) కేంద్రం తగ్గించింది.
ముడి నూనెలపై ఉన్న ప్రాథమిక దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది. క్రూడ్ సన్‌ఫ్లవర్ (ముడి పొద్దుతిరుగుడు) నూనెపై ఉన్న 10 శాతం సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే క్రూడ్ సోయాబీన్ నూనె, క్రూడ్ పామాయిల్‌పై ఉన్న సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ముడి నూనెలతో పాటు శుద్ధి చేసిన నూనెలపై ఉండే సుంకాన్ని కూడా తగ్గించింది. ముడి, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య దిగుమతి సుంకంలో 19.25 శాతం వ్యత్యాసాన్ని యథాతథంగా కొనసాగించింది.
అంతర్జాతీయ వంట నూనెల ధరలు పెరగడం, దాని ఫలితంగా దేశీయంగా దిగుమతి చేసిన నూనెల వ్యయం, రిటైల్ ధరలు పెరగడాన్ని పరిగణనలోకి తీసుకుని సుంకాలను సవరించింది. దిగుమతి చేసుకునే వంట నూనెల మొత్తం వ్యయంలో దిగుమతి సుంకాలే కీలక భాగంగా ఉంటాయి. ఇవి దేశీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలపై ప్రభావం చూపుతాయి.
ముడి వంట నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకం తగ్గించడం వల్ల వాటిని దిగుమతి చేసుకునే మొత్తం ఖర్చు తగ్గుతుందని, దేశీయ సరఫరా వ్యవస్థలో ఈ ప్రయోజనం వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తుందని భావిస్తున్నారు. ఆహార ధరల పెరుగుదలను, నిత్యావసరాల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టాలనే లక్ష్యానికి ఈ చర్య దోహదపడనుంది.
దేశీయ రిఫైనింగ్ సామర్థ్య వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, శుద్ధి చేసిన వంట నూనెలను అధికంగా దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించేందుకు ముడి, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య దిగుమతి సుంకంలో వ్యత్యాసాన్ని ప్రభుత్వం కొనసాగించింది. ఈ చర్య దేశీయ శుద్ధి కర్మాగారాలకు సమానమైన పోటీ వాతావరణాన్ని కల్పించడంతో పాటు, దేశంలోనే విలువను పెంచే ప్రక్రియ కొనసాగేందుకు తోడ్పడుతుందని అంచనా.
వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు పరిశ్రమ రంగానికి మార్గదర్శకాలు
దిగుమతి సుంకం తగ్గించడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని వంట నూనెల సంఘాలు, పరిశ్రమ భాగస్వాములకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
దిగుమతి చేసుకున్న నూనెల మొత్తం ఖర్చు తగ్గడానికి అనుగుణంగా పంపిణీదారులకు విక్రయించే ధరలను (పీటీడీ), గరిష్ఠ రిటైల్ ధరలను (ఎంఆర్‌పీ)లను వెంటనే తగ్గించాలని పారిశ్రామిక వర్గాలను ప్రభుత్వం కోరింది. ధరల తగ్గింపును ఆలస్యం చేయకుండా అమలు చేసేలా తమ సభ్యులకు సూచించాలని వంట నూనెల సంఘాలను కోరింది.
అంతర్జాతీయ వంట నూనెల మార్కెట్లలో, దేశీయ ధరల్లో చోటుచేసుకునే మార్పులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రైతులు, దేశీయ వంటనూనె పరిశ్రమకు సమతుల్య విధాన వాతావరణాన్ని కల్పిస్తూనే, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2314368)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9