ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెమీకాన్ ఇండియా-2026: ‘సిలికాన్ టు సిస్టమ్స్’ దాకా భారత సెమీకండక్టర్ రంగ ప్రస్థానంపై ప్రదర్శన

పరిశ్రమలు.. విద్యా-అంకుర సంస్థలు.. విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తేవడం సహా సెమీకండక్టర్ విలువ వ్యవస్థలో విస్తరిస్తున్న భారత్ సామర్థ్యాన్ని ఇది చాటుతుంది

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 12:10PM by PIB Hyderabad

   భారత సెమీకండక్టర్ రంగ సామర్థ్యం, పురోగమన వేగం ప్రపంచానికి ప్రస్ఫుటమయ్యాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా మూడు రోజులపాటు నిర్వహించిన సెమీకాన్ ఇండియా-2026 ప్రదర్శన దేశ శక్తిసామర్థ్యాలను ఆవిష్కరించింది. చిప్ డిజైన్, అత్యాధునిక ప్యాకేజింగ్ నుంచి మెటీరియల్స్, పరికరాలు, కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ దాకా సెమీకండక్టర్ వ్యవస్థలోని వివిధ విభాగాలను ఈ ప్రదర్శన ఒకే వేదికపైకి తెచ్చింది.

ఇది ‘సెమీకాన్ ఇండియా’ 5వ ప్రదర్శన కాగా, “సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఇకోసిస్టమ్” ఇతివృత్తంగా ఈ నెల 17 నుంచి 19 వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ అగ్రగాములు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, అంకుర సంస్థలు సహా అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమ ఒకే వేదికపైకి వచ్చింది. ఇందులో వివిధ దేశాల నుంచి 600కు పైగా ప్రదర్శన కంపెనీలతోపాటు ఒక అంకుర సంస్థల పెవిలియన్, వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ పెవిలియన్, కేంద్ర-రాష్ట్ర స్థాయి పెవిలియన్‌లు ఏర్పాటు కావడమే కాకుండా ఒక హ్యాకథాన్ కూడా నిర్వహించారు.

భారత సెమీకండక్టర్ ప్రస్థానం డిజైన్‌ను మించి తయారీ, ప్యాకేజింగ్, పరిశోధన, మెటీరియల్స్, ప్రతిభ, వ్యవస్థ స్థాయి అనువర్తనాలను అనుసంధించే ఒక విస్తృత వ్యవస్థ వైపు విస్తరిస్తున్న తీరును ఒక సంగ్రహావలోకనం వివరించింది.

చిప్ డిజైన్ నుంచి అత్యాధునిక కంప్యూటింగ్ దాకా…

స్వదేశీ సెమీకండక్టర్, కంప్యూటింగ్ సామర్థ్యాల శ్రేణి ఈ ప్రదర్శనలోని కీలకాంశాల్లో ఒకటిగ నిలిచింది. ఇందులో భాగంగా హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఏఐ, రంగాలలో సి-డాక్ తన కృషిని ప్రదర్శించింది. దీనిలో ఏయూఎం హెచ్‌పీసీ-ఏఐ ప్రాసెసర్, రుద్ర-ఏయూఎం కంప్యూట్ నోడ్ కూడా ఉన్నాయి. ఈ కృషి కేవలం చిప్ స్థాయికి పరిమితం కాకుండా మొత్తం కంప్యూటింగ్ వ్యవస్థలలో స్వదేశీ సామర్థ్య విస్తరణపై పెరుగుతున్న శ్రద్ధను ప్రతిబింబించింది.

మరోవైపు స్వదేశీ ప్రాసెసర్ డిజైన్ దిశగా విస్తృత ముందడుగును కూడా ఈ ప్రదర్శన చాటింది. టెలికమ్యూనికేషన్స్, ఆటోమోటివ్ అప్లికేషన్లు, ఏఐ నుంచి నిఘా వరకూ వివిధ రంగాల కోసం దేశీయ అంకుర సంస్థలు, కంపెనీలు. ప్రాసెసర్ సాంకేతికతలు, అప్లికేషన్-నిర్దిష్ట చిప్‌లు, సిస్టమ్ సొల్యూషన్లను భారత సెమీకండక్టర్ వ్యవస్థ రూపొందించడాన్ని కూడా ఈ ప్రదర్శనలో గమనించవచ్చు.

దైనందిన అప్లికేషన్ల కోసం చిప్‌ల రూపకల్పన

సెమీకండక్టర్ సాంకేతికతలు, ప్రయోగశాలలు, డిజైన్ కేంద్రాల నుంచి దైనందిన ఉత్పత్తులలోకి భారత్‌ ఏ విధంగా ప్రవేశించగలదో కూడా ఈ ప్రదర్శన సందర్శకులకు తేటతెల్లం చేసింది.

స్మార్ట్ ఉపకరణాలు, కనెక్టివిటీ, నిఘా, పారిశ్రామిక వ్యవస్థలు, ఇంధన నిర్వహణ, ఆటోమోటివ్ టెక్నాలజీ తదితర అప్లికేషన్లకు సంబంధించి భారత సెమీకండక్టర్ కంపెనీలు, అంకుర సంస్థలు వివిధ పరిష్కారాలను ప్రదర్శించాయి.

భారత చిప్ డిజైన్ వ్యవస్థలో ప్రముఖ స్థానంలోగల కంపెనీలలో ‘వెర్వ్‌సెమి మైక్రోఎలెక్ట్రానిక్స్’ ఒకటి. మోటార్ కంట్రోల్, ఎనర్జీ మీటర్లు, డేటా సేకరణ అప్లికేషన్ల కోసం సెమీకండక్టర్ పరిష్కారాలను ఈ సంస్థ రూపొందిస్తోంది. దీంతోపాటు వినియోగదారు ఉపకరణాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డ్రోన్ల వంటి అప్లికేషన్ల కోసం చిప్‌ల తయారీ కూడా చేపట్టింది.

విస్తృత ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను రూపొందించడంలో స్వదేశీ చిప్ డిజైన్ ప్రాధాన్యాన్ని ఇలాంటి అనువర్తన-నిర్దిష్ట సెమీకండక్టర్ ఉత్పత్తులు ప్రస్ఫుటం చేస్తున్నాయి.

రిస్క్-వి: స్వదేశీ ప్రాసెసర్ సామర్థ్య రూపకల్పన

స్వదేశీ ప్రాసెసర్ డిజైన్, సెమీకండక్టర్ టెక్నాలజీలలో భారత్‌ సామర్థ్యాన్ని సి-డాక్‌ స్వదేశీ 64-బిట్ ‘రిస్క్‌-వి’ ప్రాసెసర్ బలోపేతం చేస్తుంది. సార్వత్రిక ‘రిస్క్‌-వి’ స్వరూపం ప్రాతిపదికగా ఇది హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, అత్యాధునిక డిజిటల్ అనువర్తనాలకు తోడ్పాటునిస్తుంది. స్వదేశీ పరిష్కారాలలో భాగంగా దీని అనుసరణ, భావితరం కంప్యూటింగ్, కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం అత్యాధునిక ప్రాసెసర్ సాంకేతికతల తయారీలో పెరుగుతున్న స్వదేశీ నైపుణ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది.

స్వదేశీ రిస్క్‌-వి ప్రాసెసర్ ఐపీలు, ఎస్‌ఓసీ డిజైన్ ఆటోమేషన్ ఉపకరణాలకు సంబంధించిన తన కృషిని ఇన్‌కోర్ సెమీకండక్టర్స్ ప్రదర్శించింది.

ఈ సంస్థ ఉత్పాదనల జాబితాలో ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎడ్జ్-ఏఐ వినియోగం వరకూ విస్తరించిన అనువర్తనాలతో విభిన్న స్థాయుల కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ప్రాసెసర్ వేదికలున్నాయి. ఇన్‌కోర్ ప్రాసెసర్ ఐపీ- 180 ఎన్‌ఎం నుంచి 16 ఎన్‌ఎం వరకూ గల సాంకేతిక విభాగాల్లో, పలు వినియోగదారు చిప్‌లలో సిలికాన్ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంది.

విస్తృత సెమీకండక్టర్ డిజైన్ వ్యవస్థలో ఇటువంటి ప్రాసెసర్ సాంకేతికతల రూపకల్పన ఓ కీలక భాగం. భారతీయ కంపెనీలు దేశీయంగా రూపొందించిన మేధో సంపత్తి ప్రాతిపదికన ఉత్పత్తుల తయారీకి ఇది వీలు కల్పిస్తుంది.

అహీసా టెక్నాలజీ సంస్థ ‘1 జీబీపీఎస్‌’ సామర్థ్యంతో స్వదేశీ ఇంటర్నెట్‌ అనుసంధాన పరికరాన్ని తయారు చేసింది. ఇంటర్నెట్ సేవాప్రదాన సంస్థలు దీని ద్వారా ఒకే ఆప్టికల్ లైన్ టెర్మినల్ (ఓఎల్‌టీ) ద్వారా సుమారు 64 గృహాలను సంధానించగలవు. పూర్తిగా భారత్‌లో రూపొందించిన ‘విహాన్’ సాఫ్ట్‌ వేర్ వేదికగా ‘సి-డాక్‌’ తయారు చేసిన 64 బిట్‌ ‘రిస్క్‌-వి’ ప్రాసెసర్‌ ద్వారా ఇది పనిచేస్తుంది. భారత స్వదేశీ సాంకేతిక సామర్థ్య బలోపేతం, పూర్తి దేశీయ టెక్నాలజీ స్టాక్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సంధానం కల్పనలో ఇదొక కీలక మలుపును సూచిస్తుంది.

ఏఐ.. విజన్-స్మార్ట్ సర్వైలెన్స్

సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని చాటడం ఈ ప్రదర్శనలో మరో ముఖ్యాంశం. ఈ మేరకు సురక్షిత నిఘా, స్మార్ట్ సెన్సర్లు, రోబోటిక్స్, డ్రోన్లు, రవాణా వంటి అనువర్తనాల కోసం ఏఐ సమర్థ ‘సిస్టమ్-ఆన్-చిప్స్’  తన ప్రతిభను భారత సెమీకండక్టర్ అంకుర సంస్థ ‘నేత్రసేమి’ ప్రదర్శించింది.

ఇందులో భాగంగా సీసీటీవీ నిఘా వ్యవస్థల కోసం స్వదేశీ పరిజ్ఞానాధారిత ‘ఏఐ ఎస్ఓసీ’ని 12 ఎన్ఎమ్ ప్రాసెస్ నోడ్‌లో ఈ సంస్థ జోడించింది. ఇందులో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ యాక్సిలరేటర్లు, విజన్ ప్రాసెసింగ్, వీడియో ఇంజన్లను ఏకీకృతం చేసింది. ఇంటెలిజెంట్ విజన్, ఎడ్జ్ ప్రాసెసింగ్ అవసరమయ్యే అప్లికేషన్లు లక్ష్యంగా ఈ సాంకేతికతలు రూపొందాయి.

మెషీన్ విజన్, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అటానమస్ సిస్టమ్స్, నిఘా తదితర రంగాలలో అప్లికేషన్ల రూపకల్పనను సెమీకండక్టర్ డిజైన్‌లో ప్రగతి ఎలా సాధ్యం చేస్తున్నదో ఈ ప్రదర్శన రుజువు చేసింది.

యావత్‌ విలువ వ్యవస్థలో సెమీకండక్టర్ ఆవిష్కరణ

ఈ ప్రదర్శన కేవలం చిప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా సెమీకండక్టర్ ఉత్పత్తుల రూపకల్పన-తయారీకి అవసరమైన భారీ వ్యవస్థను ప్రతిబింబించింది. ముడి పదార్థాలు, పరికరాల నుంచి టెస్టింగ్, ప్యాకేజింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ దాకా… సెమీకండక్టర్ విలువ వ్యవస్థ పరస్పర సంధాన స్వభావాన్ని ప్రముఖంగా చూపింది.

ఈ విస్తృత విధానమే 2026 జూలైలో కేంద్ర మంత్రిమండలి 1,27,500 కోట్ల వ్యయంతో ఆమోదించింది సెమీకాన్ 2.0కు కేంద్రకం. సెమీకాన్ 1.0 పునాదిపై రూపొందిన ఈ కార్యక్రమం ఆరు వ్యూహాత్మక మూలస్తంభాలపై దృష్టి సారిస్తుంది. ఈ మేరకు డిజైన్, యంత్రాలు-ముడి పదార్థాలు, మరిన్ని ఫ్యాబ్‌లు, అత్యాధునిక ప్యాకేజింగ్, పరిశోధన- అభివృద్ధి, ప్రతిభా వికాసం దాకా ఇది విస్తరిస్తుంది.

అంకురాల నుంచి పరిశోధన సంస్థల వరకూ..

దేశంలో పురోగమిస్తున్న సెమీకండక్టర్ డిజైన్ వ్యవస్థపై అంకుర సంస్థల పెవిలియన్ సరికొత్త అవగాహన కల్పించింది. ఈ మేరకు వీడియో నిఘా, డ్రోన్ డిటెక్షన్, ఎనర్జీ మీటర్లు, మైక్రోప్రాసెసర్లు, శాటిలైట్ కమ్యూనికేషన్లు, బ్రాడ్‌బ్యాండ్-ఐఓటీ ఎస్‌ఓసీ సహా పలు రంగాల్లో దేశీయ చిప్ డిజైన్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజైన్ సంధానిత ప్రోత్సాహక (డీఎల్‌ఐ) పథకం మద్దతిచ్చింది.

విద్యార్థులు, పరిశోధకులు, కంపెనీలు, అంకుర సంస్థలలో సెమీకండక్టర్ డిజైన్ సామర్థ్యం  అభివృద్ధికి చిప్స్ టు స్టార్టప్ (సీ2ఎస్‌) కార్యక్రమం కూడా చేయూతనిస్తోంది. నిపుణ చిప్ డిజైనర్ల సంఖ్య పెంపు, దేశీయ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ సామర్థ్య బలోపేతం ఈ కార్యక్రమ లక్ష్యం.

దేశవ్యాప్తంగా 400 విద్యాసంస్థలు, 100 అంకురాలు సహా 500కు పైగా సంస్థల నుంచి లక్ష మందికి పైగా ఇంజనీర్లను సీ2ఎస్‌ ప్రోగ్రామ్, డీఎల్‌ఐ పథకం కింద ‘చిప్‌ఇన్ సెంటర్’ చేర్చుకుంది. వారికి అధునాతన చిప్-డిజైన్ టూల్స్, చిప్-డిజైన్, ఫ్యాబ్రికేషన్ సేవలు సహా ప్రత్యేక శిక్షణ కల్పించారు. ఈ కంపెనీలు, అంకురాలు సంయుక్తంగా దేశవిదేశాల్లో గల ఫౌండ్రీలలో ఫ్యాబ్రికేషన్ కోసం 300కు పైగా చిప్ డిజైన్‌లను రూపొందించాయి. అంతేకాకుండా 4 కోట్లకు పైగా చిప్-డిజైన్ టూల్ వినియోగాన్ని నమోదు చేశాయి. చిప్‌ఇన్ సెంటర్‌లో అతిపెద్ద కేంద్రీకృత చిప్-డిజైన్ వినియోగదారుల పునాది పడేందుకు ఈ అసాధారణ స్థాయి సామర్థ్యం దోహదం చేసింది.

విధానం నుంచి ఉత్పత్తి దాకా…

భారత సెమీకండక్టర్ వ్యవస్థ ప్రాథమిక విధాన మద్దతు నుంచి తయారీ-వాణిజ్య ఉత్పాదనవైపు పయనిస్తున్న తరుణంలో ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఇక సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద దేశంలోని 6 రాష్ట్రాలలో 1.64 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రకటనతో 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో ఇప్పటికే 3  ప్లాంట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. ఆ మేరకు భారత్‌ నిర్దేశించుకున్న   లక్ష్యంపైనే కాకుండా డిజైన్, తయారీ, ప్యాకేజింగ్ సంబంధిత సాంకేతికతలలో ఇప్పటికే పురోగమిస్తున్న సామర్థ్యాలపైనా సెమీకాన్ ఇండియా-2026లో దృష్టి సారించారు.

సంపూర్ణ సెమీకండక్టర్‌ వ్యవస్థకు రూపం

భారత సెమీకండక్టర్ రంగంలో విస్తరిస్తున్న ఆకాంక్షల పరిధిని ఈ ప్రదర్శన ఇతివృత్తం “సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్‌ ది ఇకోసిస్టమ్‌” ప్రస్ఫుటం చేసింది. సెమీకండక్టర్ వ్యవస్థకు విడి చిప్‌ల తయారీకన్నా అవసరాలు అధికం. అంటే- చిప్ డిజైనర్లు, ఫ్యాబ్‌లు, ప్యాకేజింగ్, టెస్టింగ్ కేంద్రాలు, పరికరాలు, ముడి పదార్థాల సరఫరాదారులు, పరిశోధన సంస్థలు, అంకుర సంస్థలు, సిస్టమ్ కంపెనీలు సహా నిపుణ శ్రామికశక్తిని ఇది ఒకే వేదికపైకి తెస్తుంది.

ఈ మేరకు సెమీకాన్ ఇండియా-2026 విభిన్నాంశాలన్నింటినీ ఒకచోట చేర్చి, విలువ వ్యవస్థల అంతటా పురోగమన వేగాన్ని కళ్లకు కట్టింది. అలాగే, స్వదేశీ ఆవిష్కరణలను అంతర్జాతీయ సెమీకండక్టర్ అవకాశాలతో సంధానించింది. ప్రాసెసర్ డిజైన్, ‘రిస్క్‌-వి”  సాంకేతికతల నుంచి ఏఐ సామర్థ్యం గల ‘ఎస్‌ఓసీ’లు, మోటార్-కంట్రోల్ చిప్‌లు, ఆధునిక కంప్యూటింగ్, సెమీకండక్టర్ తయారీ దాకా భారత సెమీకండక్టర్ రంగం శరవేగంగా పురోగమించడంలోని అనేక అంచెలను ఈ ప్రదర్శన యావత్‌ ప్రపంచానికీ చాటింది. ఆ మేరకు యశోభూమిలో ప్రదర్శించిన విజయగాథ కేవలం చిప్ రూపకల్పన, తయారీకి పరిమితం కాదు… దాని చుట్టూ గల ప్రతి అంశంలో ప్రగతి వేగానికి సంబంధించినది. ఒక సంపూర్ణ సెమీకండక్టర్ వ్యవస్థ రూపకల్పనకు అవసరమైన సిలికాన్, వ్యవస్థలు, వ్యక్తులు, పరిశోధన, తయారీ సామర్థ్యాలు, భాగస్వామ్యాల సంబంధిత సమగ్ర ఆవిష్కరణగా దీన్ని పరిగణించాలి.

***


(రిలీజ్ ఐడి: 2313460) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam