హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 22న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్‌ల అధిపతుల మూడో జాతీయ సదస్సును ప్రారంభించనున్న కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
లక్నో, డెహ్రాడూన్‌లో ఎన్‌సీబీ జోన్ కాంప్లెక్సులకు హోం మంత్రి శంకుస్థాపన
మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి దేశ యువతను రక్షించేందుకు ప్రధానమంత్రి నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి మార్గదర్శకత్వంలో విశేష కృషి చేస్తున్న భారత ప్రభుత్వం
ప్రధానమంత్రి శ్రీ మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్–2047 లక్ష్యం సాకారం కావాలంటే మాదక ద్రవ్య రహిత భారత్‌ను నిర్మించాలి
నార్కోటిక్స్ నియంత్రణపై దార్శనిక పత్రం (2026–2029)లో నిర్దేశించిన లక్ష్యాలు/ఫలితాలను సాధించడంలో ఏఎన్‌టీఎఫ్‌ల పాత్రపై రెండు రోజుల జాతీయ సదస్సు
మాదకద్రవ్య ముఠాలను నిర్మూలించడం, సింథటిక్ డ్రగ్‌లు, రహస్య తయారీ కేంద్రాలను ఎదుర్కోవడం, డార్క్‌నెట్–క్రిప్టో దర్యాప్తు చర్చల అజెండాలో ప్రధానాంశాలు
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 12:53PM by PIB Hyderabad
2026 సెప్టెంబర్ 22 మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల యాంటీ–నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) మూడో జాతీయ సదస్సును కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే టీవీ ప్రకటనలను శ్రీ అమిత్ షా విడుదల చేస్తారు. అలాగే లక్నో, డెహ్రాడూన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోన్ల నూతన కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏఎన్‌టీఎఫ్‌లను సత్కరిస్తారు. అలాగే పునర్‌వ్యవస్థీకరించిన ఎన్‌సీబీ వెబ్‌సైటును ప్రారంభిస్తారు. ఎన్‌సీబీ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సుకు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్‌టీఎఫ్‌ల అధిపతులు హాజరవుతారు. వీరితో పాటుగా సంబంధిత ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు, భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రభావాల నుంచి దేశ యువతను రక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి మోదీ నిర్దేశించారు. మాదక ద్రవ్య రహిత భారత్‌ను నిర్మించకుండా ఈ లక్ష్యాన్ని సాధించలేం. మాదకద్రవ్యాల ప్రమాదం నుంచి భవిష్యత్తు తరాలను రక్షించే శక్తిమంతమైన వేదికగా ఈ సదస్సు పనిచేస్తుంది.
‘‘ఉమ్మడి సంకల్పం, సమష్టి బాధ్యత’’ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సదస్సు జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన నార్కోటిక్స్ నియంత్రణపై దార్శనిక పత్రం (2026–2029)లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్‌లకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను, దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు సంబంధిత వర్గాలు చేపట్టిన కార్యక్రమాలు, ప్రయత్నాలపై దృష్టి సారిస్తారు. సరఫరాను, డిమాండును, హానిని తగ్గించే చర్యలను భారత ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి తగిన వ్యూహాలను గుర్తించడం, అమలుకు సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు.
దార్శనిక పత్రంలోని నాలుగు ప్రధానాంశాలైన (I) అమలు, నిఘా, కార్యకలాపాలు (II) ముడిపదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ (III) డిమాండు, ప్రమాద తగ్గింపు (IV) సామర్థ్య నిర్మాణం, సమన్వయం ఆధారంగా ఎనిమిది సాంకేతిక సెషన్లను ఈ కార్యక్రమంలో నిర్వహిస్తారు. అవి:
-
నార్కోటిక్స్ నియంత్రణకు దార్శనిక పత్రం (2026-2029) – మొదటి భాగం: సంస్థాగత యంత్రాంగాలు
-
నెట్‌వర్కు సంబంధాలను, ముఠాలను నిర్వీర్యం చేయడం – మొదటి భాగం
-
నార్కోటిక్స్ నియంత్రణకు దార్శనిక పత్రం (2026-2029) – రెండో భాగం: డిమాండు తగ్గింపు, నివారణ, పునరావాసం
-
నెట్‌వర్కు సంబంధాలను, ముఠాలను నిర్వీర్యం చేయడం – రెండో భాగం
-
సామర్థ్యాన్ని, అమలును మెరుగుపరచడం
-
ముడిపదార్థాలు, సింథటిక్ మాదకద్రవ్యాలు, రహస్య తయారీ కేంద్రాలు
-
అక్రమ సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలు
-
డార్క్ నెట్, క్రిప్టో దర్యాప్తు
ఈ చర్చలు ఏకోన్ముఖ ప్రభుత్వ విధానానికున్న ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సమర్థంగా ఎదుర్కోవడానికి భాగస్వామ్య రాష్ట్రాలు, విభాగాలు, సంస్థలు నూతన నిబద్ధతతో ముందుకు సాగేందుకు వీలు కల్పిస్తాయి. దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడానికి మాదకద్రవ్యాల చట్టాల అమలును బలోపేతం చేయడానికి ఆచరణాత్మక వ్యూహాలను ఈ చర్చలు రూపొందించగలవని అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి మాత్రమే కాకుండా డ్రగ్–ఫ్రీ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేలా ఎన్‌సీబీకి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్‌ల మధ్య భవిష్యత్తు అవసరాలకు తగిన భాగస్వామ్యాన్ని ఈ జాతీయ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2313021)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam