రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలో స్వచ్ఛతను పటిష్ఠంగా అమలు చేయడంతో పాటు
అపరిష్కృత వ్యవహారాలను పరిష్కరించడానికి ‘6వ ప్రత్యేక ప్రచార ఉద్యమ’ సన్నాహాలు
ఈ- వేస్ట్ తో పాటు స్క్రాప్ తొలగింపు, స్థల నిర్వహణ, పెండింగ్ వ్యవహారాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
150 కన్నా ఎక్కువ మంది నోడల్ అధికారులకు ప్రచారోద్యమ కార్యకలాపాల పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 1:32PM by PIB Hyderabad
ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛతను పటిష్ఠంగా అమలు చేయడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న వ్యవహారాలను త్వరిత గతిన తగ్గించడానికి 6వ ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఉద్యమంలో రెండు దశలు ఉన్నాయి. సన్నాహక దశను ఈ నెల 15 నుంచి 30 వరకూ చేపట్టి, లక్ష్యాలను నిర్ధారిస్తారు. ఆ తరువాత అక్టోబర్ 2 నుంచి 31 వరకూ రెండో దశ ఉంటుంది. ఇది ప్రధానంగా అమలుకు సంబంధించిన దశ.
ఇంతకు ముందు ‘5.0 ప్రచార ఉద్యమం’లో ప్రజల ఫిర్యాదులు, వీఐపీ వ్యవహారాలతో పాటు ఇతర అపరిష్కృత వ్యవహారాలను పరిష్కరించడానికి సంబంధించిన నిర్ధారిత లక్ష్యాలను రైల్వే శాఖ 100 శాతం సాధించి, కీలక ప్రగతిని నమోదు చేసింది. ఈ శాఖ సాధించిన ప్రధాన విజయాల్లో 6.06 లక్షల చదరపు అడుగుల జాగాను పునర్వినియోగానికి అనువైందిగా రూపొందించడమే కాకుండా రూ.570 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడానికి రంగాన్ని సిద్ధం చేశారు.
రైల్వే శాఖ తన అన్ని క్షేత్రీయ విభాగాలు, అనుబంధ, సహాయక కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో పెండింగ్ వ్యవహారాలను పరిష్కరించడం కోసం 6వ ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని ఫలప్రదంగా అమలు చేయడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ ప్రచార ఉద్యమానికి అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అవసరమైన సన్నాహక చర్యలను రైల్వే బోర్డు ఎన్నో జాగ్రత్తలను తీసుకుని మరీ పర్యవేక్షిస్తున్నది. పాలనాపరమైన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) తరఫున విస్తృత మార్గదర్శకాలను అన్ని క్షేత్ర విభాగాలకు పంపించారు. పనులు చేసే సిబ్బందిని సమీకరించడం, ప్రచార ఉద్యమ స్థలాలను గుర్తించడం, ఏయే ప్రాంతాల్లో ప్రచార ఉద్యమాన్ని నిర్వహించాలో ఎంపిక చేయడం, స్థల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయడం వంటి పనులను పురమాయించారు. ఈ విషయంలో జనరల్ మేనేజర్లకు, ఇతర యూనిట్ల అధిపతులకు రైల్వే బోర్డు కార్యదర్శి ఒక డెమీ అఫీషియల్ (డి.ఒ.) లేఖను కూడా పంపారు.
విస్తృత స్థాయిలో భాగస్వామ్యం లభించేటట్లు చూడడానికి అన్ని జోనల్ రైల్వేలు, డివిజనల్ కార్యాలయాలు, పీఎస్‌యూలు, నిర్మాణ యూనిట్లకు సమగ్ర ఆదేశాలను జారీ చేశారు. ఈ ప్రయత్నాన్ని సమన్వయపరిచేందుకు భారతీయ రైల్వేకు చెందిన 150 కన్న ఎక్కువ మంది నోడల్ అధికారులను నామినేట్ చేశారు. వీరు రోజువారీ పురోగతికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి రైల్వే బోర్డుకు పంపుతారు. దీంతో ఈ సమాచారాన్ని నేరుగా డీఏఆర్‌పీజీకి చెందిన అధికారిక డిజిటల్ పర్యవేక్షణ ప్రధాన వేదికైన కేంద్ర ఎస్‌సీడీపీఎమ్ (స్పెషల్ క్యాంపెయిన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ మ్యాటర్స్)లో నమోదు చేయడానికి బోర్డుకు అవకాశం కలుగుతుంది. ఫలితంగా వాస్తవిక సమయంలో పర్యవేక్షణ, వారం వారీ ఉన్నత స్థాయి సమీక్షకు మార్గం సుగమం అవుతుంది.
ప్రస్తుతం సన్నాహక దశ పురోగమిస్తున్న కారణంగా, ప్రచార ఉద్యమానికి సంబంధించిన ప్రమాణాల విషయంలో లక్ష్యాలకు తుది రూపురేఖలు తీర్చిదిద్దుతున్నారు. ఈ సంవత్సరం నిర్దేశించుకన్న ప్రాధాన్యాలకు అనుగుణంగా, ‘2022 ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్) నియమావళి’లో ప్రస్తావించిన ‘‘ఈ-వ్యర్థాలను ప్రభావవంతంగా సేకరించడం, వేరు చేయడం, తొలగించడం’’, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జీఎఫ్ఆర్) పరిధిలో చెత్త తొలగింపు, కార్యాలయ పరిసరాల సుందరీకరణ, ప్రక్రియలు, నియమాల సరళీకరణతో పాటు పెండింగ్ వ్యవహారాల పరిష్కారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు.
రైల్ చౌపాల్ (ఎస్‌సీడీపీఎమ్ 4.0), అమృత్ సంవాద్ (ఎస్‌సీడీపీఎమ్ 5.0)లను విజయవంతంగా నిర్వహించిన తరువాత, రైల్వే మంత్రిత్వశాఖ 6వ ఎస్‌సీడీపీఎమ్‌లో భాగంగా ‘‘రైల్ జన్ సంవాద్’’ ను నిర్వహించనుంది. ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పౌరులతో అర్థవంత చర్చను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
రోజువారీ కార్యకలాపాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్న తన నిబద్ధతను రైల్వే బోర్డు శాఖ పునరుద్ఘాటిస్తున్నది. ప్రజా సంబంధాలను ఇదివరకటి కన్న నిరంతరాయంగా మెరుగుపరుచుకోవడానికి ఈ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వ్యవహారాలను సత్వర గతిన పరిష్కరించడానికి ప్రాధాన్యాన్ని కొనసాగించనుంది. సమన్వయపూర్వక పథక రచన, అన్ని యూనిట్లలోనూ అంకిత భావంతో కూడిన భాగస్వామ్యం ద్వారా రైల్వే శాఖ 6వ ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్థాయిలో విజయవంతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2313001)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5