సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పీఎం జ్ఞాపికల ఇ-వేలం 8వ ఎడిషన్‌ను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్
అధికారిక పోర్టల్ ద్వారా 17 సెప్టెంబర్ 2026 నుంచి ఇ-వేలం ప్రారంభం
ఇ-వేలం ద్వారా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, కళ, హస్తకళలను ప్రతిబింబించే 1,498 జ్ఞాపికల విక్రయం
నమామి గంగే కార్యక్రమానికి మద్దతుగా వేలం ద్వారా వచ్చిన ఆదాయం
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 6:26PM by PIB Hyderabad
సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ సమక్షంలో ఇవాళ న్యూఢిల్లీలో పీఎం జ్ఞాపికల ఇ-వేలం 8వ ఎడిషన్‌ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. గౌరవ ప్రధానమంత్రికి పలు సందర్భాల్లో బహూకరించిన ప్రత్యేక జ్ఞాపికలను సొంతం చేసుకునే సువర్ణావకాశాన్ని దేశ పౌరులకు, కలెక్టర్లకు, సంస్థలకు, కళా-సంస్కృతి ప్రేమికులకు ఈ ఇ-వేలం కల్పిస్తోంది. పీఎం జ్ఞాపికల ఇ-వేలం 8వ ఎడిషన్ 17 సెప్టెంబర్ 2026 నుంచి www.pmmementos.gov.in. అధికారిక పోర్టల్ ద్వారా ప్రారంభం అవుతుంది.
శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈసారి మొత్తం 1,498 జ్ఞాపికలను వేలానికి పెడుతున్నట్లు తెలిపారు. ఈ సేకరణ భారతదేశ గొప్ప, వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. దేశ కళాత్మక సంప్రదాయాలు, సంప్రదాయ హస్తకళలు, సాంస్కృతిక ఆచారాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, క్రీడా విజయాలను ప్రతిబింబించే వస్తువులు ఇందులో ఉన్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ జ్ఞాపికలను సేకరించటం వలన ఈ కార్యక్రమానికి అఖిల భారత గుర్తింపు లభించింది.
రాష్ట్రాలవారీగా ఉన్న వస్తువుల సేకరణల ప్రాతినిధ్యం భారతదేశ భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో జ్ఞాపికలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రత్యేక గుర్తింపు పొందిన 50 కీలక వస్తువులు ఈ 8వ ఎడిషన్‌లో ఉన్నాయని శ్రీ గజేంద్ర షెకావత్ తెలిపారు. వీటిలో కొన్ని విశిష్టమైన వస్తువులున్నాయి. రూ.13.50 లక్షల కనీస ధర గల కర్ణాటకకు చెందిన శ్రీరాముడి వెండి జ్ఞాపిక, రూ.9 లక్షల కనీస ధర గల కాకతీయ కళాతోరణం వెండి ప్రతిమ, రూ.7.50 లక్షల కనీస ధర గల ట్రీ ఆఫ్ లైఫ్ గోండ్ ఆర్ట్ పెయింటింగ్ ఫ్రేమ్, కనీస ధర రూ.6 లక్షలు గల జగన్నాథ పరివార్ రథం, రూ. 5.40 లక్షలు గల 99.99 ప్యూరిటీతో ఉన్న గోల్డ్ ప్లేటెడ్ ఫ్రేమ్డ్ రాధాకృష్ణ ఆర్ట్ వర్క్ వంటివి ఉన్నాయి.
వరుస ఎడిషన్ల ద్వారా నిర్వహించిన పీఎం జ్ఞాపికల ఇ-వేలంలో పౌరులు, కలెక్టర్లు, సంస్థలు ఉత్సాహంగా పాల్గొన్నట్లు శ్రీ గజేంద్ర షెకావత్ తెలిపారు. పీఎం జ్ఞాపికలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈ కార్యక్రమం పారదర్శకమైన విధానాన్ని అందిస్తుందన్నారు. అంతేకాక భారతదేశ విభిన్న కళా, సాంస్కృతిక సంప్రదాయాలను అభినందించేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ... పీఎం జ్ఞాపికల ఇ-వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి కేటాయిస్తారని మంత్రి వెల్లడించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, గంగా నది పునరుజ్జీవనం, పరిరక్షణకు చేపట్టిన జాతీయ మిషన్‌కు మధ్య సార్థకమైన అనుసంధానాన్ని ఈ కార్యక్రమం ఏర్పరుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, ప్రదర్శన, నిర్వహణ అంశాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్‌జీఎంఏ) చూసుకుంది. ఈ ప్రక్రియలో వివిధ భాగస్వాముల సహకారం ఉంటుంది. సాంకేతిక, పోర్టల్ సంబంధిత సహాయానికి ఎన్‌ఐసి, మూల్యాంకనం, విలువ నిర్ణయించేందుకు సంబంధిత అధికారులు, పేమెంట్ గేట్ వే సహాయానికి ఎస్‌బీఐ, విజయవంతంగా కొనుగోలు చేసిన వస్తువులను ప్యాకింగ్ చేసి డెలివరీ చేసేందుకు నిర్దేశిత ఫైన్ ఆర్ట్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ వంటివి ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటాయి.
ఇ-వేలంలో పాల్గొనే ముందు జ్ఞాపికలను వీక్షించేందుకు, వాటి కళాత్మక, సాంస్కృతిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి సందర్శకులకు ప్రత్యేక ప్రదర్శన ద్వారా అవకాశం కల్పిస్తారు. ఈ ప్రదర్శన ద్వారా భారతదేశ సంప్రదాయ హస్తకళలు, కళాత్మక పద్ధతులు, వైవిధ్యమైన సాంస్కృతిక విధానాలను ప్రజలు నేరుగా వీక్షించి తెలుసుకోవచ్చు.
భారతదేశంలోని పౌరులు, కలెక్టర్లు, సంస్థలు, కార్పొరేట్ వారు, కళాభిమానులు, ప్రజలందరూ ఈ సేకరణను పరిశీలించి, ప్రదర్శనను సందర్శించాలని, పీఎం జ్ఞాపికల ఇ-వేలం 8వ ఎడిషన్‌లో పాల్గొనాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది.
పీఎం జ్ఞాపికల ఇ-వేలం... భారతదేశ వారసత్వం, కళ, హస్తకళలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకునే కార్యక్రమం. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించటంతో పాటు నమామి గంగే కార్యక్రమం ద్వారా మహత్తర జాతీయ లక్ష్యానికి తోడ్పడుతుంది.
******
(రిలీజ్ ఐడి: 2311297)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4