ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యక్తిగత (పీటూపీ) లావాదేవీల విషయంలో యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితం
పెద్ద మొత్తంలోని మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ వర్తింపు
లావాదేవీ విలువతో సంబంధం లేకుండా వ్యక్తిగత (పీటూపీ) లావాదేవీలపై సున్నా ఛార్జీలు
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పీటూఎం లావాదేవీలపై నామమాత్రంగా 0.4 శాతం ఎండీఆర్.. రూ.75000, అంతకంటే ఎక్కువ విలువైన అధిక-మొత్తం లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వరకు ఎండీఆర్ ఛార్జీలు
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 6:45PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ (పీఎస్ఎస్) చట్టం- 2007కు సవరణలు చేసింది. దీనిద్వారా ఎటువంటి ఛార్జీలు వర్తించని నిర్దిష్ట డిజిటల్ చెల్లింపు విధానాలను నోటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి లభించింది. ఈ సవరణ డిజిటల్ లావాదేవీలలో ఆర్థిక సౌలభ్యం, పారదర్శకతను నిర్ధారించడానికి చట్టపరమైన వెసులుబాటును కల్పిస్తుంది.
2026 సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వం ఈ విధానం కింద ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం రూ.2,000 వరకు ఉండే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై సున్నా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కార్యాచరణ ప్రమాణాలు, ఫీజు పంపిణీ నమూనాలు, కేటగిరీ పరిమితులపై యూపీఐ స్టీరింగ్ కమిటీ చర్చించిన తర్వాత 2026 సెప్టెంబర్ 15న ఎన్‌పీసీఐ ఒక సమగ్ర సర్క్యులర్ కూడా జారీ చేసింది.
ఈ సర్క్యులర్‌లోని ప్రధాన ముఖ్యాంశాలు:
-
వ్యక్తిగత (పీటూపీ) లావాదేవీలకు లావాదేవీ విలువతో సంబంధం లేకుండా ఎటువంటి ఛార్జీలు ఉండవు. మొత్తం యూపీఐ లావాదేవీలలో పీటూపీ లావాదేవీలు పరిమాణం పరంగా 37 శాతం, విలువ పరంగా 70 శాతం ఉన్నాయి.
-
రూ.2000 కంటే ఎక్కువ ఉన్న పీటూఎం లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి.
సాంకేతిక ఫ్రేమ్‌వర్క్
పీటూఎం లావాదేవీలపై ఎండీఆర్:
-
రూ.2000 కంటే ఎక్కువ ఉన్న పీటూఎం లావాదేవీలపై నామమాత్రంగా 0.4 శాతం ఎండీఆర్ ఉంటుంది. ఈ కమిషన్‌ను బ్యాంకులు, యాప్ ప్రొవైడర్‌లతో సహా చెల్లింపు వ్యవస్థ భాగస్వాములు పంచుకుంటారు.
-
రూ.75000, అంతకంటే ఎక్కువ విలువైన అధిక-మొత్తం లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి ఎండీఆర్ గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుంది.
నిత్యావసర రంగాలకు ఒకే రకమైన ఎండీఆర్:
-
రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్‌లు మొదలైన రంగాల విషయంలో రూ.2,000 కంటే ఎక్కువ లావాదేవీలకు రూ.5 చొప్పున ఒకే తరహా(ఫ్లాట్ రేట్) ఎండీఆర్ వర్తిస్తుంది.
-
ఈ ఒకటే రేటు నమూనా అత్యవసర ప్రజా సేవలు, తక్కువ లాభాల మార్జిన్ ఉన్న పరిశ్రమలలో ఖర్చుల విషయంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.
-
ఇలాంటి పారిశ్రామిక విభాగాలు మొత్తం యూపీఐ పీటూఎం లావాదేవీల పరిమాణంలో దాదాపు 17 శాతం, యూపీఐ మర్చంట్ లావాదేవీల విలువలో సుమారు 46 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
మూలధన మార్కెట్ లావాదేవీలు:
-
మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు చేసే చెల్లింపులపై నామమాత్రంగా 0.02 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి రూ.300.
-
ఈ తగ్గిన రేటు వ్యవస్థీకృత ఆర్థిక మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
చిన్న వ్యాపారుల కోసం పీటూపీఎం ఫ్రేమ్‌వర్క్:
-
పర్సన్-టూ-పర్సన్-మర్చంట్ (పీ2పీఎం) వర్గీకరణ కింద యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులు అన్ని లావాదేవీలపై తప్పనిసరి సున్నా ఎండీఆర్ సౌకర్యాన్ని కొనసాగిస్తారు.
-
ఇది అవ్యవస్థీకృత వీధి వ్యాపారులను వ్యవస్థీకృత ఖాతాలతో (మార్చంట్ అక్వైరింగ్ అకౌంట్) అనుసంధానిస్తుంది. ఇది అసంఘటిత రంగంలో డిజిటల్ స్వీకరణను ప్రోత్సహిస్తుంది.
వినియోగదారులకు రక్షణలు
-
ప్లాట్‌ఫామ్ ఫీజులు లేవు: యూపీఐ యాప్ ప్రొవైడర్లు ప్లాట్‌ఫామ్ ఫీజులను లేదా కనిపించని ఛార్జీలను వసూలు చేయకుండా స్పష్టంగా నిషేధం ఉంది.
-
యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులు వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అపరిమిత ఉచిత వినియోగం: వ్యక్తులకు ఉచిత యూపీఐ లావాదేవీలపై నెలవారీ కోటాలు, పరిమాణపరమైన పరిమితులు లేదా విభాగపరమైన పరిమితులు ఏవీ లేవు.
-
భద్రతా పరిమితులు: బ్యాంకులు, ఎన్‌పీసీఐ ద్వారా అమలయ్యే రోజువారీ లావాదేవీల పరిమితులు (విభాగాన్ని బట్టి రూ.1–5 లక్షలు) పూర్తిగా రిస్క్ నిర్వహణ చర్యలే కానీ వాణిజ్య ఛార్జీల శ్రేణులు కావు.
మర్చంట్ చెల్లింపులపై ప్రభావం
అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం 4 శాతం మర్చంట్ లావాదేవీలు మాత్రమే ఎండీఆర్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రభావితమవుతాయి. ఎందుకంటే చాలా వరకు లావాదేవీలు రూ. 2,000 పరిమితి కంటే తక్కువగా ఉన్నాయి లేదా సున్నా ఎండీఆర్ పీటూపీఎం విధానం కింద ఉన్నాయి. ఇది సూక్ష్మ, చిన్న వ్యాపారాలపై ఖర్చుల భారం పడకుండా చూసుకుంటుంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
చిన్న వ్యాపారుల విషయంలో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి వసూలు చేసిన మొత్తం ఎండీఆర్‌లో 5 శాతంతో ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. ఇది యూపీఐ వాడకాన్ని విస్తృతం చేయటంతో పాటు అది నిరంతరం కొనసాగేలా ప్రోత్సహిస్తుంది. ఇది భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చిన్న వ్యాపారాల చేరికను వేగవంతం చేస్తుంది.
ముగింపు
కొత్త ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్ యూపీఐని స్వయం సమృద్ధిగా మారుస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింత విస్తరణకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. అత్యధిక శాతం చెల్లింపులు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఉండేలా చూస్తూనే పోటీతత్వం ఉండేలా చూసుకుంటుంది. ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది. ఆ కమిటీ 32వ నివేదికలో ఈ కింది విధంగా సిఫారసు చేసింది:
'యూపీఐ వ్యవస్థ ఆర్థిక సుస్థిరతను సాధించేలా చూసేందుకు లాభదాయకమైన ఆదాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం చాలా కీలకమని కమిటీ ప్రధానంగా సూచిస్తోంది.'
***
(రిలీజ్ ఐడి: 2310758)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam