వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బ్రిక్స్ దేశాల మధ్య మరింత విస్తృత... పటిష్ట... సమతుల వాణిజ్యం
· “భారత వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు”
· “సభ్య దేశాలన్నీ నియంత్రణ విధానాల సరళీకరణతో మార్కెట్ సౌలభ్యం కల్పించాలని సూచన”
· “చెల్లింపు వ్యవస్థల సంధానం సహా పరస్పర ద్రవ్య మార్పిడి సౌలభ్యంతో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని సభ్య-భాగస్వామ్య దేశాలకు పిలుపు”
· “వ్యవసాయ, ఔషధ.. ఇంజినీరింగ్.. ఎలక్ట్రానిక్స్.. ఆటోమొబైల్.. అంకుర.. నవ్య సాంకేతిక.. సేవా రంగాల్లో విస్తృత సహకార ఆవశ్యకతపై స్పష్టీకరణ”
· సరఫరా వ్యవస్థల సంధానం.. వాణిజ్య సౌలభ్యం.. ఆవిష్కరణలు బ్రిక్స్ కీలక ప్రాథమ్యాలు: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్”
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 12:10PM by PIB Hyderabad
ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల వాటా దాదాపు నాలుగో వంతు కాబట్టి, ఈ కూటమి మరింత చురుగ్గా వ్యవహరించాలని భారత వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇవాళ ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తూ- ఈ దిశగా సభ్య-భాగస్వామ్య దేశాల మధ్య విస్తృత, పటిష్ట, సమతుల వాణిజ్య భాగస్వామ్యాల ఆవశ్యకత ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక సహకార సామర్థ్య సంపూర్ణ సద్వినియోగానికి విస్తృత మార్కెట్ లభ్యత, వైవిధ్యభరిత సరఫరా వ్యవస్థలు, సరళ నియంత్రణ విధానాలు అవసరమని శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక చర్చలు, వ్యాపార భాగస్వామ్యాలను తదుపరి స్థాయికి చేర్చడంలో ఈ వేదిక గణనీయ నిర్ణయాలు తీసుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రారంభ సమావేశంలో రష్యన్ ఫెడరేషన్ ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి గౌరవనీయ మాగ్జిమ్ రెషెట్నికోవ్, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, వాణిజ్యం-పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ కూడా ప్రసంగించారు.
బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యంలో భారత్ కీలక మూలస్తంభమని అని శ్రీ గోయల్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ వస్తు తయారీ, ఎగుమతి రంగాల్లో గణనీయ వాటా గల భారత్ బలమైన సామర్థ్యాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, భారత్‌ను ప్రపంచం ప్రపంచ ఔషధ శాలగానూ పరిగణిస్తుందని గుర్తుచేశారు. ఈ ఉత్పత్తులు సహా ప్రపంచానికి ఒక విశ్వసనీయ భాగస్వామిగా రూపొందే క్రమంలో తన ఇతరత్రా ఉత్పత్తులకూ బ్రిక్స్ దేశాలను భారత్ ఓ కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ క్రమంలో భాగస్వామ్య దేశాల మధ్య విస్తృత, పటిష్ట వాణిజ్య బంధం ప్రాధాన్యాన్ని ఆయన విడమరిచారు. ఆ మేరకు సరఫరా వ్యవస్థలు వైవిధ్యభరితంగా ఉండాలని, సభ్య దేశాల్లో ప్రజల ప్రగతికి, సౌభాగ్యానికి వాణిజ్యం ఒక అవరోధం కారాదని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ముడి పదార్థాలు, కీలక ఖనిజాలు సహా ఉత్పత్తుల పరస్పర వాణిజ్యానికి సభ్య, భాగస్వామ్య దేశాలన్నీ తమ ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ సౌలభ్యం కల్పించాలని బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు.
సరఫరా వ్యవస్థల మధ్య రెండువైపులా సహకారం కొనసాగితేనే అవి పటిష్టంగా ఉంటాయని శ్రీ గోయల్ వివరించారు. ప్రపంచంలోని 88 శాతం దేశాల్లో సుంకాలకన్నా సుంకమేతర చర్యలే అధిక ఎగుమతి వ్యయభారం మోపుతున్నాయని గుర్తుచేశారు. అందువల్ల సరళ, నిరంతరాయ మార్కెట్ ప్రవేశం దిశగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నియంత్రణ విధానాల సరళీకరణ, సరకు రవాణా వేగవంతం దిశగా సంయుక్త కృషితోపాటు పరస్పర మార్కెట్ సౌలభ్యం కల్పించడం అవశ్యమని బ్రిక్స్ సభ్య-భాగస్వామ్య దేశాలకు సూచించారు.
వ్యవసాయ రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని శ్రీ గోయల్ చెప్పారు. సమష్టి ఆహార భద్రత దృష్ట్యా అన్నదాతలకు సంబంధించి వివిధ పరిష్కారాల సంయుక్త ఆవిష్కరణ చేపట్టాలని కోరారు. ఈ దిశగా వ్యవసాయ-సాంకేతిక అంకుర సంస్థలను ప్రోత్సహించాలని బ్రిక్స్ దేశాలకు సూచించారు. అంతేకాకుండా కూటమి సభ్య-భాగస్వామ్య దేశాలన్నీ తమ సేవా రంగ మార్కెట్లలో పరస్పర ప్రవేశానికి వీలు కల్పించాలని చెప్పారు. ఆయా దేశాల సరిహద్దుల గుండా నిపుణులకు రాకపోకల సౌలభ్యం ఉండాలని, వారి వృత్తిగత అర్హతలు, నైపుణ్యానికి సులభ గుర్తింపు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత అంకుర, వ్యవస్థాపన వ్యవస్థలలో మహిళా భాగస్వామ్యాన్ని శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో గల 2,50,000 గుర్తింపు పొందిన అంకురాలలో 45 శాతానికి పైగా కనీసం ఒక మహిళా భాగస్వామి లేదా డైరెక్టరుకు స్థానం కల్పించాయని పేర్కొన్నారు. ఒక దశాబ్దం పాటు చిన్న రుణాల వితరణలో మూడింట రెండు వంతులు మహిళా పారిశ్రామికవేత్తలకే లభించినట్లు తెలిపారు. తద్వారా వ్యాపార కార్యకలాపాల్లో వారు స్వతంత్రంగా వ్యవహరిస్తూ స్వావలంబన సాధించగలిగారని చెప్పారు. ఈ వారం ప్రారంభంలో న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ మహిళా వ్యాపార కూటమి సమావేశం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బ్రిక్స్ దేశాల్లో నిర్వహించే ప్రదర్శనలు, వాణిజ్య సమ్మేళనాలు, ప్రోత్సహిచందగిన రంగాల్లో మహిళల సారథ్యంలోని సంస్థలకు అవకాశాలు కల్పించాలని ఆ కూటమిని కోరినట్లు ఆయన తెలిపారు.
సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా భారత్ అమలు చేసిన ప్రధాన కార్యక్రమాలను శ్రీ గోయల్ ప్రముఖంగా వివరించారు. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) ద్వారా నేడు ఏటా 250 బిలియన్లకు పైగా లావాదేవీలు నమోదువుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అంతర్జాతీయ లావాదేవీల పరిమాణంలో భారత్ వాటా 50 శాతానికి పైగా ఉన్నదని తెలిపారు. ఇప్పుడు 11 దేశాల్లో యూపీఐ ఆమోదం పొందిందని వివరిస్తూ- బ్రిక్స్ సభ్య-భాగస్వామ్య దేశాలు కూడా చెల్లింపు వ్యవస్థలను పరస్పరం అనుసంధానించాలని కోరారు. స్థానిక కరెన్సీలలో పరస్పర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ, డిజిటల్ వాణిజ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పారు. అలాగే ఆధునిక సాంకేతికతల కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ, ఔషధ, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్-విడిభాగాలు సహా సేవా రంగంలోనూ భారత్ సామర్థ్యం అపారమని శ్రీ గోయల్ చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాల్లోని అంకురావరణ వ్యవస్థలను కూడా అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆవిష్కరణలకు, సాంకేతిక భాగస్వామ్యాలకు, పటిష్ట ప్రపంచ విలువ వ్యవస్థలకు ఇవన్నీ గణనీయ అవకాశాలను అందుబాటులోకి తెస్తాయన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో... దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని 140 కోట్ల మంది భారతీయులు లక్ష్యంగా పెట్టుకున్నారని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు భారత్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సదస్సులోని అంశాలపై జరిగే చర్చలు నిర్మాణాత్మకమైన, అమలు చేయగల సిఫారసులకు దారితీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రసంగిస్తూ.. ఈ ఏడాదితో బ్రిక్స్ సంస్థాగత సహకారానికి 20 ఏళ్లు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ కాలంలో సభ్యత్వం, చర్చించే అంశాలు, సహకార విధానాల పరంగా బ్రిక్స్ గణనీయంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ పరిణామాలను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా భారత్ అధ్యక్షతన ‘విస్తృత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత’ అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాలు ఎంతో ప్రాధాన్యమైనవని ఆయన అన్నారు. అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టలతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణాలుగా మారుతున్నాయని.. భౌగోళిక రాజకీయ ఘర్షణలు, మహమ్మారులు, వాతావరణ సంబంధిత అంతరాయాలు, డిజిటలైజేషన్, సాంకేతిక పురోగతి వంటివి ప్రపంచ ఆర్థిక పరిస్థితిని కొత్తగా తీర్చిదిద్దుతున్నాయని వివరించారు.
బ్రిక్స్ దేశాల సముదాయంలో ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం కీలక అంశంగా మారిందని డాక్టర్ జైశంకర్ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ ఉమెన్స్ బిజినెస్ అలయన్స్ ద్వారా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులను బ్రిక్స్ ప్రక్రియలో భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సరఫరా వ్యవస్థల అనుసంధానం, వాణిజ్య సులభతరం కీలక అంశాలుగా మారాయని, వీటితో పాటు సేవలు, వ్యవసాయం–వ్యవసాయ సాంకేతికత, డిజిటల్ సేవల అందజేత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, అంకుర సంస్థలు, మహిళల నేతృత్వంలోని సంస్థలు కూడా ముఖ్యమైనవని చెప్పారు. ఇతర దేశాలతో అనుసంధానమై, పోటీ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే మరింత స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని డాక్టర్ జైశంకర్ స్పష్టం చేశారు. ఇందుకోసం నిజమైన మార్కెట్ విధానాలు, విశ్వసనీయమైన లాజిస్టిక్స్, ముందుగా అంచనా వేయగల వ్యాపార వాతావరణం, విభిన్న వాణిజ్య సంబంధాలు, పారదర్శకమైన వాణిజ్యం, పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్, అధునాతన తయారీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ రంగాల్లో అందరికీ అందుబాటు, ప్రమాణాలు, భద్రత, విశ్వసనీయత వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బ్రిక్స్ ఇంక్యుబేటర్ వ్యవస్థ, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా ఆవిష్కరణలు, వ్యవస్థాపకతకు సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్ అధ్యక్షతన చర్యలు చేపట్టామని డాక్టర్ జైశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమాల ప్రయోజనాలు అన్ని రకాల వ్యాపార వర్గాలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పెద్దదైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్, విస్తరిస్తున్న తయారీ సామర్థ్యాలు, విస్తృతమైన ప్రతిభా వనరులు, డిజిటల్ రంగంలో అనుభవం, చురుకైన ఆవిష్కరణలు, వ్యవస్థాపకతకు బలమైన పునాది వంటి అంశాలతో భారత్ సహజ భాగస్వామిగా నిలుస్తోందని అన్నారు. బ్రిక్స్ దేశాల నేతలు సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. అవకాశాలు, వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తూ, బ్రిక్స్ సహకారం తదుపరి దశకు స్పష్టమైన వ్యాపార దృక్పథాన్ని అందించడం ఈ ఫోరం చేసే అత్యంత ఉపయోగకరమైన సహకారం అవుతుందని తెలిపారు.
ప్రారంభ సమావేశంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల బలాన్ని స్పష్టమైన వాణిజ్య ఫలితాలుగా మార్చేందుకు బ్రిక్స్ బిజినెస్ వేదిక ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధతో కూడిన డిజిటల్ సేవలు సహకారానికి కీలకమైన రంగమని పేర్కొన్నారు. ఇవి వ్యక్తులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఉత్పాదకత, జీవన ప్రమాణాలు, ఆదాయాలు, పనితీరును మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంప్యూటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.
పాలనలో ఐక్యరాజ్యసమితిని కేంద్రంగా ఉంచుతూ.. కృత్రిమ మేధ రంగంలో మరింత సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సహకారం అవసరమని శ్రీ ప్రసాద పేర్కొన్నారు. సెమీకండక్టర్ల రంగంలో సుమారు 13 బిలియన్ అమెరికన్ డాలర్ల ప్రోత్సాహకాలతో కూడిన భారత్ సెమీకండక్టర్ మిషన్ 2.0ను ఆయన ప్రస్తావించారు. మొత్తం సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు డేటా సెంటర్లు కూడా సహకారానికి ముఖ్యమైన రంగాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ రంగాల్లో భారత్ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను బ్రిక్స్ దేశాలతో పంచుకోవాలని అన్నారు. యువతకు అంతర్జాతీయ సరిహద్దులను దాటి వివిధ మార్కెట్లలో అవకాశాలు లభించేలా, బ్రిక్స్ దేశాలు కలిసి సాంకేతికతను అభివృద్ధి చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి, అంకుర సంస్థలకు మరిన్ని వనరులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బ్రిక్స్ ఒక ముఖ్యమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలుస్తోందని వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ అన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం 2003లో 84 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండగా, 2024 నాటికి దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను కేంద్రంగా చేసుకుని బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను పరిరక్షించి, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సరసమైన నిర్వహణ మూలధనాన్ని (వర్కింగ్ క్యాపిటల్) అందించడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలకు) మద్దతు ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం ఉమ్మడి బ్రిక్స్ విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించడానికి జైపూర్ సమ్మతిని ఒక పునాదిగా ఉపయోగపడుతుందని తెలిపారు.
బ్రిక్స్ కనెక్ట్, బీ2బీ భాగస్వామ్యాలు, ప్రతి ఏడాది బ్రిక్స్ వాణిజ్య, పెట్టుబడి ఎక్స్‌పో నిర్వహించడం, డిజిటల్ వాణిజ్య పత్రాల వినియోగం, ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాల్లో మరింత సహకారం ద్వారా ప్రపంచ విలువ వ్యవస్థలను బలోపేతం చేయాలని శ్రీ అగర్వాల్ సూచించారు. సహకారం, విశ్వాసం, ఆవిష్కరణలు, అందరి సమృద్ధి ఆధారంగా బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం 2030 కింద మరింత బలమైన ఆర్థిక సమీకరణ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ బిజినెస్ వేదిక విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ అగర్వాల్ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2309372)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam