ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబరు 8న గుజరాత్, మహారాష్ట్రలలో ప్రధానమంత్రి పర్యటన
రూ.35,000 కోట్ల కన్నా ఎక్కువ విలువైన అభివృద్ధి పథకాలకు వడోదరాలో ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం
ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధానమంత్రి
వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యూడీఎఫ్‌సీ)లో మూడు కీలక భాగాలను
దేశ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధానమంత్రి.. పూర్తి అయిన డబ్ల్యూడీఎఫ్‌సీ ప్రాజెక్టు
మూడు రైల్వే ప్రాజెక్టులతో పాటు మూడు హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
ముంబయిలో ‘2026 గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్’ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
‘‘ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ - సమ్మిళిత ఆర్థిక సాయానికి ఉద్దేశించిన విశ్వసనీయ, అనుసంధానిత, అంతర్జాతీయ వ్యవస్థలు: 2026 జీఎఫ్ఎఫ్ ప్రధానాంశంగా ‘ప్రభావం చూపించగల శక్తి’
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 11:51AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు, అంటే 2026 సెప్టెంబరు 8న.. గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. రూ.35,000 కోట్ల కన్నా ఎక్కువ విలువ గల వివిధ అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 12 గంటలకు, వడోదరాలో శంకుస్థాపన చేయడంతో పాటు ఆ పథకాలను దేశ ప్రజలకు అంకితమివ్వనున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్)ను ప్రధానమంత్రి ముంబయిలో సాయంత్రం దాదాపు 5 గంటల 45 నిమిషాలకు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
వడోదరాలో ప్రధానమంత్రి
వడోదరాలో ప్రధానమంత్రి వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యూడీఎఫ్‌సీ)లోని మూడు ప్రధాన భాగాలైన సానంద్ (ఎన్)-మకర్పురా, న్యూ ఉంబర్‌గావ్-న్యూ సఫాలే, న్యూ సఫాలే-జేఎన్‌పీటీ లను దేశ ప్రజలకు అంకితం చేస్తారు. దీని పొడవు 326 రూట్ కిలోమీటర్లు. దీనిని రూ.20,700 కోట్ల కన్న ఎక్కువ ఖర్చుతో నిర్మించారు.
జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ) ప్రత్యక్ష అనుసంధానంతో ఎగుమతి, దిగుమతి కార్గో రాకపోకలు వేగవంతం కానున్నాయి. పారిశ్రామిక కేంద్రాలకు, ఓడరేవులకు మధ్య సంధానం బలోపేతమవుతుంది. ఆధునిక వస్తు రవాణా వ్యవస్థకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ముంబయి రైల్వే నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గించడానికి కూడా ఇది సాయపడనుంది.
వీటి ప్రారంభంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ) వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. సరుకులను తీసుకుపోవడానికి దోహదం చేసే రహదారుల వ్యవస్థ.. దేశ ఆధునిక వస్తు రవాణా విస్తారిత అనుబంధ వ్యవస్థతో ముడిపడిన బహువిధ సంధానాన్ని మెరుగుపరిచి, రవాణాకు పట్టే కాలాన్ని కుదించడంతో పాటు వివిధ ప్రాంతాలలో సరుకు రాకపోకలను సౌకర్యవంతంగా మార్చి దేశ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్‌ను మరింత పటిష్ఠపరుస్తుంది.
ముంబయిలోని న్యూ సానంద్ (ఉత్తర), న్యూ మకర్పురా, న్యూ ఉంబర్‌గావ్, న్యూ జేఎన్‌పీటీ నుంచి గూడ్స్ సేవలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. వడోదరా, టాండా రహదారి మధ్య నడిచే ఒక కొత్త రైలు సర్వీసును కూడా ప్రారంభిస్తారు. దీనితో వడోదరా, ఛోటా ఉదేపూర్, అలీరాజ్‌పూర్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
చోటా ఉదేపూర్-ధార్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధిపరిచిన కొత్త రైలుమార్గం జోబత్-టాండా రోడ్డును ప్రధానమంత్రి దేశ ప్రజలకు అంకితం చేస్తారు. ఈ కొత్త రైలు మార్గం అలీరాజ్‌పూర్‌కు చెందిన మారుమూల గిరిజన ప్రాంతాలను దేశ రైల్వే వ్యవస్థతో కలుపుతుంది.
ప్రధానమంత్రి మూడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ.9,700 కోట్ల కన్న ఎక్కువ ఖర్చుతో ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. వీటిలో.. వడోదరా-రత్లమ్ మూడో, నాలుగో లైన్లు, మియాగామ్ కర్జన్-చోరండా-మల్‌సర్ గేజ్ మార్పిడి, విశ్వమిత్రి-దభోయి డబ్లింగ్ ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో ప్రయాణికుల చేరవేతతో పాటు, సరకు రవాణా సామర్థ్యం కూడా పెంపొందుతుంది. రద్దీ తగ్గుతుంది. గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య సంధానం బలోపేతమవుతుంది.
సుమారు రూ.1,780 కోట్ల ఖర్చుతో నిర్మించే మూడు జాతీయ రహదారి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్‌హెచ్-48లో కామ్‌రేజ్-చల్‌థాన్ సెక్షన్లో ఆరు లేన్ల నిర్మాణం, ఎన్‌హెచ్-48లోనే వడోదరా-సూరత్ సెక్షన్లో తాపీ, నర్మదా నదుల మీద ప్రధాన వంతెనలు సహా అదనపు నిర్మాణాలు, ఎన్‌హెచ్-53లో అభవా, మింధోలా, ఖజోద్ జంక్షన్లలో గ్రేడ్-సెపరేటెడ్ నిర్మాణాలు ఉంటాయి. వీటికి తోడు, ఎన్‌హెచ్-48లో వడోదరా-సూరత్ సెక్షన్లో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, రాకపోకలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన కందారీ చౌకడీ, లువారా పాటియా ఆరు లేన్ల ఫ్లయ్‌ఓవర్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
సుమారు రూ.2,600 కోట్ల ఖర్చుతో గుజరాత్ ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రాజెక్టులకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో.. వడోదరా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ రింగ్ రోడ్డు రెండో దశ, కడానా ఆనకట్ట మీద 110 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు, వడోదరా నగర పాలక సంస్థ కోసం ఒక కొత్త కార్యాలయ నిర్మాణం ఉన్నాయి. ప్రారంభించబోయే ప్రాజెక్టుల్లో.. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ (పీఎమ్ఏవై)లో భాగంగా గృహనిర్మాణ ప్రాజెక్టులతో పాటు తూర్పు వడోదరాలో 11 గ్రామాల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన నీటి సరఫరా ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.
ముంబయిలో ప్రధానమంత్రి
‘2026 గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్’ (జీఎఫ్ఎఫ్)ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ప్రపంచంలో అతి పెద్ద, ప్రభావశీల వార్షిక ఫిన్‌టెక్ సమావేశాల్లో జీఎఫ్ఎఫ్ ఒకటి.
ముంబయిలో జీఎఫ్ఎఫ్ ఏడో సంచికను ఈ నెల 8 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. జీఎఫ్ఎఫ్ ఓ 2020 మొదలు ఓ అంతర్జాతీయ వేదికగా ఎదిగింది. ఇది ఆర్థిక రంగ భవిష్యత్తు రూపురేఖలను తీర్చిదిద్దడానికి విధాన నిర్ణేతలను, నియంత్రణ సంస్థలను, కేంద్ర బ్యాంకులను, ఆర్థిక సహాయ సంస్థలను, ఫిన్‌టెక్ కంపెనీలను, సాంకేతిక సంస్థలను, ఇన్వెస్టర్లను, విద్యారంగ ప్రముఖులను, ఇతర అంతర్జాతీయ ఆసక్తిదారులను ఒక చోట సమావేశపరుస్తోంది.
ఈసారి జీఎఫ్ఎఫ్‌లో ‘‘ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ - సమ్మిళిత ఆర్థిక సాయానికి ఉద్దేశించిన విశ్వసనీయ, అనుసంధానిత, అంతర్జాతీయ వ్యవస్థలు..‘ప్రభావం చూపించగల శక్తి’ అంశాన్ని ప్రధానాంశంగా ఎంచుకున్నారు.
విధాన రూపకల్పన ప్రక్రియ, నియంత్రణ, సాంకేతికత, పెట్టుబడి, పరిశ్రమ.. వీటికి ఒక ఉమ్మడి వేదికను అందించే ఉద్దేశంతో ‘2026 జీఎఫ్ఎఫ్’ను నిర్వహిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితత్వం అంశాల్లో భారత్ నాయకత్వ భూమికను మరింతగా పెంపొందింప చేసి, ముందున్న అవకాశాలను వాస్తవ ప్రభావాన్ని ప్రసరించేవిగా మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఏజెంటిక్ ఏఐ, ప్రోగ్రామబుల్ ఫైనాన్స్, క్వాంటమ్ సాంకేతికత, తదితర ప్రధాన, సరికొత్త సాంకేతికతలను, అంతర్జాతీయ స్థాయిలో పౌరులు, వాణిజ్య సంస్థలతో పాటు ఆర్థిక వ్యవస్థల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని విశ్వసనీయ, సమ్మిళిత, వాస్తవ ఫలితాలుగా ఆవిష్కరించడమెలాగన్న విషయంపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2307620)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam