సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
షెడ్యూల్డు కులాల విద్యార్థులకు సకాలంలో ఉపకారవేతనాలు... పారదర్శకతను బలోపేతం చేసిన ప్రభుత్వం
డీబీటీ, ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాలతో నేరుగా విద్యార్థులకే చేరుతున్న కేంద్ర ప్రభుత్వ సాయం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వెబ్ పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షలు, క్షేత్ర పర్యటనలతో బలోపేతమవుతున్న జవాబుదారీతనం
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 2:22PM by PIB Hyderabad
షెడ్యూల్డు కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, వారితోపాటు ఇతర విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ఆయా పథకాల పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయమందించే కేంద్ర ప్రాయోజిత పథకాలివి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన యంత్రాంగాల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారు.
ఈ స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల అర్హత ఆధారంగా, అవసరాలను బట్టి వారికి లబ్ధి చేకూర్చే నిరంతర ప్రక్రియలు. పోస్ట్మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని 2021-22 నుంచీ, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని 2022-23 నుంచీ.. ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ)’ పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఈ విధానంలో భాగంగా.. అర్హులైన దరఖాస్తుదారుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను నేరుగా జమచేస్తున్నారు.
కేంద్ర వాటా నిధుల విడుదల అంశం.. బదిలీ ప్రక్రియతో ముడిపడి ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వాటా చెల్లింపులకు సంబంధించిన డేటాను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన అనంతరం కేంద్ర నిధులు విడుదలవుతాయి. ఈ డిజిటల్ ప్రక్రియ ద్వారా స్కాలర్‌షిప్ దరఖాస్తులు, నిధుల పంపిణీ తీరును కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఇది సకాలంలో లబ్ధిదారులకు నిధులు అందేలా చూడటంతోపాటు.. నిధులు దారిమల్లకుండా లేదా దుర్వినియోగం కాకుండా నిరోధిస్తుంది.
అమలుకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులను... ఈ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా ఉన్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలన యంత్రాంగానికి తక్షణమే పంపిస్తారు. వారు తగిన విధానాల ప్రకారం పరిశీలించి, పరిష్కార చర్యలను చేపడతారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత ప్రాధికార సంస్థలు తగిన పరిపాలన చర్యలను కూడా తీసుకుంటాయి.
పునర్వ్యవస్థీకరించిన ఈ విధివిధానాలు.. సమగ్రమైన జవాబుదారీతనం, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి సమావేశాలతోపాటు క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా కూడా ఈ పథకాల అమలు తీరును క్రమంతప్పకుండా సమీక్షిస్తారు. పథకం పనితీరును అంచనా వేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధుల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి సదస్సులు, చింతన శిబిరాలను కూడా నిర్వహిస్తారు.
డీబీటీ, ఆధార్ అనుసంధానం, పోర్టల్ ద్వారా సమాచార వినిమయం, క్రమబద్ధమైన సమీక్షలు... ఇవన్నీ కలిసి నిధుల మంజూరు నుంచి లబ్ధిదారునికి అందే వరకూ, ప్రతి దశనూ పారదర్శకంగా, స్పష్టంగా పర్యవేక్షించగలిగేలా వ్యవస్థాగత ఏర్పాటును అందిస్తున్నాయి. అనవసర జాప్యాలకు తావులేకుండా స్కాలర్‌షిప్ సాయం నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరేలా, అంతరాయం లేకుండా వారు చదువులను కొనసాగించేలా చూడడమే ఈ చర్యల ముఖ్య లక్ష్యం.
సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన స్కాలర్‌షిప్ పంపిణీ వ్యవస్థల ద్వారా.. వెనుకబడ్డ వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది.
మరింత సమాచారం కోసం https://socialjustice.gov.in/schemes/23 వెబ్‌సైట్‌ను సందర్శించండి.
***
(రిలీజ్ ఐడి: 2307617)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6