పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
‘పంచకుల’లో కేంద్ర పర్యావరణ మంత్రి నేతృత్వంలో అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం- 2026
‘సంక్షోభం నుంచి పునరుద్ధరణ దిశగా – భారత్‌లో రాబందుల పరిరక్షణ’ ప్రధాన ఇతివృత్తంగా జాతీయ స్థాయి వర్క్‌షాప్
అడవిలో జీవజాతుల పునరుద్ధరణకు దోహదపడేలా.. రాబందుల రక్షిత ప్రాంతాల ఏర్పాటు, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చిన శ్రీ భూపేందర్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 10:49AM by PIB Hyderabad
హర్యానాలోని పంచకుల వేదికగా అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం - 2026ను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. ‘సంక్షోభం నుంచి కోలుకునే దిశగా – భారతీయ రాబందుల పరిరక్షణ’ అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర పర్యావరణ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ శాఖ మంత్రి శ్రీ రావు నర్బీర్ సింగ్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌సీసీ), కేంద్ర జంతు ప్రదర్శన శాలల ప్రాధికార సంస్థ (సీజెడ్ఏ), హర్యానా అటవీ, వన్యప్రాణి సంరక్షణ శాఖ, బొంబాయి ప్రకృతి శాస్త్ర అధ్యయన సొసైటీ (బీఎన్‌హెచ్ఎస్), పింజోర్‌లోని జటాయు సంరక్షణ, ప్రజనన కేంద్రం (జేసీబీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్‌లో రాబందుల పరిరక్షణ దిశగా సమష్టి కృషిని బలోపేతం చేసే దిశగా.. అటవీ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, పశువైద్యులు, జంతు ప్రదర్శన శాలల నిపుణులు, సంరక్షణ రంగంలో నిపుణులు, సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఈ సమావేశం ఒక్క వేదికపైకి తెచ్చింది.

సభను ఉద్దేశించి శ్రీ యాదవ్ ప్రసంగిస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వ పర్యావరణ సంరక్షణ విధానం నిర్దిష్ట జాతులకు మాత్రమే పరిమితం కాలేదనీ, మొత్తం పర్యావరణ వ్యవస్థ ఆధారిత ప్రాతిపదికగా సమగ్ర దృక్పథంతో సాగుతోందనీ అన్నారు. పెద్ద పులి జాతులు, స్లాత్ ఎలుగుబంట్లు, బట్టమేక పక్షులు, డాల్ఫిన్లు, ఘరియల్ మొసళ్ళు, అడవి దున్నలు, రాబందులు... ఇలా ఏ జాతి సంరక్షణ కార్యక్రమాన్ని పరిశీలించినా ప్రభుత్వ విధానం స్పష్టంగా ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాబందుల గురించి మాట్లాడుతూ... తెల్లని వీపు (వైట్ రంప్డ్) రాబందులు, పొడవు ముక్కు (లాంగ్ బిల్డ్) రాబందులు, సన్నని ముక్కు గల (స్లెండర్ బిల్డ్) రాబందులు, ఎర్ర తల రాబందులు, ఈజిప్షియన్, హిమాలయన్ గ్రిఫాన్, యురేషియన్ గ్రిఫాన్, సినిరియస్, బియర్డ్ రాబందుల వంటి వైవిధ్యభరితమైన స్థానిక, వలస వచ్చిన రాబందులకు భారత్ ఆవాసంగా ఉందన్నారు. వాటి సంరక్షణ కోసం భారత్ విజయవంతంగా కృషి చేస్తోందన్నారు.
పర్యావరణ వ్యవస్థలో అత్యంత సమర్థమైన పారిశుద్ధ్య కార్మికులుగా రాబందులు కీలక పాత్ర పోషిస్తాయన్న శ్రీ యాదవ్.. ప్రకృతి తయారు చేసుకున్న స్వీయ పారిశుద్ధ్య వ్యవస్థగా వాటిని అభివర్ణించారు. జంతు కళేబరాలను వేగంగా ఆహారంగా తీసుకోవడం ద్వారా.. పోషకాల పునర్వినియోగానికి తోడ్పడుతూ, పర్యావరణ సమతౌల్యాన్ని రాబందులు కాపాడతాయని వివరించారు. వాతావరణ మార్పులు, మానవ - వన్యప్రాణి సంఘర్షణ వంటి అనేక సవాళ్లను నేడు ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. రాబందుల ఆహార గొలుసులో అవాంతరాలు, జంతువుల చికిత్సలో వాడే పెయిన్ కిల్లర్ల ప్రభావం వల్ల.. ముఖ్యంగా 1990ల నుంచి భారతీయ రాబందుల సంఖ్య చాలా వరకు క్షీణించిందని తెలిపారు.
రాబందుల పరిరక్షణ కోసం విధాన రూపకల్పనలో ప్రభుత్వ యంత్రాంగమంతా, సమాజమంతా ఏకమై సమన్వయంతో కృషిచేయడం ఆవశ్యకమని మంత్రి స్పష్టం చేశారు. రాబందులకు సురక్షితమైన పశువైద్య విధానాలు, సురక్షిత ఆహార లభ్యత, అడవుల్లో ఆ జాతుల పునరుద్ధరణకు తోడ్పడేలా సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా... ‘రాబందుల సురక్షిత ప్రాంతాల’ను సృష్టించే దిశగా నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబందుల పరిరక్షణలో పశువైద్యులు, పశుపోషకులు, స్థానిక పరిపాలన యంత్రాంగం, స్థానిక ప్రజలు క్రియాశీలక భాగస్వాములు కావాలనీ, కళేబరాల నిర్వహణలో సురక్షిత పద్ధతులను ప్రోత్సహించాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు పింజోర్‌లోని జేసీబీసీ సందర్శనతో కేంద్ర మంత్రి తన పర్యటనను ప్రారంభించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. సంరక్షణ కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్‌ను వీక్షించారు. రాబందుల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులతో సంభాషించారు. హర్యానా అటవీ శాఖ, బీఎన్‌హెచ్ఎస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. తెల్ల వీపు, పొడవు ముక్కు, సన్నని ముక్కు గల రాబందుల సంరక్షణ, ప్రజనన చర్యలకు సంబంధించి అత్యంత కీలక కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంది.
శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, కృత్రిమంగా ఇంక్యుబేషన్ పద్ధతులు, పశువైద్యం, ప్రజనన - జన్యుపరమైన యాజమాన్య పద్ధతులను ఈ కేంద్రంలో చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. 2025–26 సమయానికి జటాయు సంరక్షణ కేంద్రంలో 356 రాబందులు ఆవాసం పొందుతుండగా.. 35 రాబందు పిల్లలు జన్మించాయని తెలిపారు. అలాగే 87 రాబందులను స్వేచ్ఛా వాతావరణంలోకి విడుదల చేయగా.. మరో 90 పక్షులను ఇతర సంరక్షణ-ప్రజనన కేంద్రాలకు తరలించారు. అంతేకాకుండా 22 సంస్థలకు చెందిన 1,222 మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా రాబందుల పరిరక్షణలో సాంకేతిక సామర్థ్యం పెంపొందేలా ఈ కేంద్రం కృషి చేసింది.
సభనుద్దేశించి శ్రీ రావు నర్బీర్ సింగ్ మాట్లాడుతూ.. పింజోర్‌లోని జటాయు సంరక్షణ, ప్రజనన కేంద్రం (జేసీబీసీ)లో విజయవంతంగా కొనసాగుతున్న రాబందుల పరిరక్షణ కార్యక్రమాన్ని, కేంద్రం అందిస్తున్న కీలకమైన సేవలను వివరించారు. ఒక్క జన్మించిన పక్షుల సంఖ్య మాత్రమే సంరక్షణ, ప్రజనన సేవల జయాపజయాలకు కొలమానం కాదన్నారు. ఆరోగ్యకరమైన, జన్యుపరంగా క్రమబద్ధీకరించిన రాబందులు, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడం, సాంకేతిక సామర్థ్యాలను విస్తరించుకోవడం, అడవుల్లో ఈ జాతుల పునరుద్ధరణ చర్యలే.. కార్యక్రమ విజయానికి ప్రాతిపదికలుగా ఉంటాయన్నారు.

ప్రారంభోత్సవ సభలో భాగంగా.. ‘స్టోరీ ఆఫ్ జటాయు: సేవింగ్ ఇండియాస్ వల్చర్’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాబందుల సంఖ్యలో క్షీణత నుంచి పింజోర్‌లో జేసీబీసీని నెలకొల్పడం ద్వారా విజయవంతంగా చేపట్టిన ప్రజనన, సంరక్షణ కార్యక్రమం వరకు... రాబందుల సంరక్షణలో భారత్ విశిష్ట ప్రయాణాన్ని ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుంది. అలాగే రాబందుల సంరక్షణపై నిర్వహించిన ఆన్‌లైన్ డ్రాయింగ్, డిజిటల్ ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు.
భారత పర్యావరణ వ్యవస్థలో రాబందుల వికాసం కొనసాగుతూ, కీలక పాత్రను పోషించే దిశగా పునరంకితం కావాలన్న సంకల్పంతో.. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం- 2026 సందర్భంగా ఈ జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ‘సంక్షోభం నుంచి కోలుకునే దిశగా’ సాగుతున్న ఈ ప్రయాణం.. శాస్త్రీయ పద్ధతులు, సరైన విధానాలు, సంరక్షణ - ప్రజననం, సురక్షిత ఆవాసాలు, సామాజిక భాగస్వామ్యం ద్వారా రాబందుల పరిరక్షణకు భారత్ సమష్టిగా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2307190)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6