సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
చలనచిత్రాల పరిరక్షణ, ఆర్కైవింగ్, డిజిటలైజేషన్, పునరుద్ధరణపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్న ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ, ఎఫ్‌టీఐఐ
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 6:15PM by PIB Hyderabad
ఎన్‌ఎఫ్‌డీసీ-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ), పూణేలోని భారత చలనచిత్ర, టెలివిజన్ సంస్థ (ఎఫ్‌టీఐఐ) సహకారంతో “చలనచిత్రాలు: సంరక్షణ, ఆర్కైవింగ్, డిజిటలైజేషన్, పునరుద్ధరణ” అనే అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్‌ను 2026 అక్టోబర్ 5 నుంచి 15 వరకు (వారాంతపు రోజులు మినహాయించి) పూణేలోని ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐ, ఎఫ్‌టీఐఐ ప్రాంగణాల్లో నిర్వహించనుంది.
చలనచిత్ర సంరక్షణ, ఆర్కైవింగ్, పునరుద్ధరణ, చిత్ర సాంకేతికత, ఆడియో విజువల్ వారసత్వ సంపదపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, వృత్తిపరమైన రంగంలోకి ప్రవేశించాలనుకునేవారు, పరిశోధకులు, ఇతర ఆసక్తిగల వ్యక్తుల కోసం ఈ వర్క్‌షాప్‌ను రూపొందించారు. తరగతి గది సెషన్లు, ఆచరణాత్మక ప్రదర్శనలు, ప్రత్యక్ష శిక్షణ, సంస్థల సందర్శనలు, ఆర్కైవల్, పునరుద్ధరించిన చిత్రాల ప్రదర్శనల ద్వారా చలనచిత్రాలను సంరక్షించే కళ, శాస్త్రం, ఆచరణాత్మక విధానాలపై పాల్గొనేవారికి అవగాహన కల్పిస్తారు.
చలనచిత్రాల సంరక్షణ, మెటాడేటా, డిజిటల్ సంరక్షణ, చిత్ర రకాలు, ఆధారాలు, నివారణాత్మక పరిరక్షణ, డిజిటల్ చిత్ర పునరుద్ధరణ, కాగితపు పదార్థాల పరిరక్షణ, ఆడియో పునరుద్ధరణ వంటి కీలక అంశాలను ఈ కార్యక్రమంలో బోధిస్తారు. ప్రాక్టికల్ సెషన్లలో ఫిల్మ్ గుర్తింపు, పరిశీలన, మరమ్మతులు, మాన్యువల్ ఫిల్మ్ క్లీనింగ్, సెల్యులాయిడ్, డిజిటల్ ఫిల్మ్ ప్రొజెక్షన్, ఫిల్మ్ స్కానింగ్, డిజిటలైజేషన్ ఉంటాయి. ఫిల్మ్ స్కానర్లు, చిత్రాలు, ఆడియో స్కానింగ్, నిల్వ అవసరాలు, కలర్ గ్రేడింగ్, నాణ్యత నియంత్రణ గురించి కూడా నేర్చుకుంటారు.
ఎన్‌ఎఫ్‌డీసీ-ఎన్‌ఎఫ్‌ఏఐలోని లైబ్రరీ, వాల్ట్స్, డాక్యుమెంటేషన్, ప్రొజెక్షన్ రూమ్ వంటి విభాగాలు, సదుపాయాల్లోని పని వాతావరణాన్ని పాల్గొనేవారు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం పొందుతారు. ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో వృత్తిపరమైన ఫిల్మ్ పునరుద్ధరణ ప్రక్రియలపై కూడా వారికి అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం సంస్థ సాంకేతిక నైపుణ్యం, పరికరాలను అందించి ఫిల్మ్ మరమ్మతులు, పరిరక్షణ, డిజిటల్ పునరుద్ధరణలో సహకరించనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎఫ్‌డీసీ-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, భారత చలనచిత్ర, టెలివిజన్ సంస్థ (ఎఫ్‌టీఐఐ), భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్కైవ్స్‌ను సందర్శించేలా సంస్థాగత పర్యటనలు ఉంటాయి. ఈ సందర్శనల ద్వారా ఆర్కైవ్ సేకరణల సంరక్షణ, డాక్యుమెంటేషన్, పరిరక్షణ, నిర్వహణలో అనుసరించే వివిధ విధానాలపై పాల్గొనేవారికి అవగాహన కలుగుతుంది.
థాయ్ ఫిల్మ్ ఆర్కైవ్ అనుసరిస్తున్న విధానాలపై ప్రత్యేక సమావేశం ద్వారా అంతర్జాతీయ దృక్పథాన్ని అందిస్తారు. 35 మిల్లిమీటర్, డిజిటల్ ఫార్మాట్లపై ప్రదర్శనలతో పాటు ఆర్కైవ్, పునరుద్ధరించిన చిత్రాల ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి.
ఈ కార్యక్రమం గురించి ఎఫ్‌టీఐఐ ఉపకులపతి శ్రీ ధీరజ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చలనచిత్ర విద్య, సినీ వారసత్వ పరిరక్షణను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని అన్నారు. పాల్గొనేవారికి విద్యాపరమైన అభ్యాసం, ఆచరణాత్మక అనుభవం, ప్రత్యేక సదుపాయాలను వినియోగించుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్దుమ్ మాట్లాడుతూ.. విద్యార్థులు, వృత్తి నిపుణులుగా ఎదగాలనుకునే వారితో సంస్థాగత అనుభవాన్ని, ప్రత్యేక నైపుణ్యాలను పంచుకోవడం, అలాగే చలనచిత్ర పరిరక్షణపై మరింత ఆసక్తిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
ప్రసాద్ కార్పొరేషన్ డైరెక్టర్, సీఎటీఓ శ్రీ అభిషేక్ ప్రసాద్ మాట్లాడుతూ.. పరిశ్రమ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా భవిష్యత్తు తరం చలనచిత్ర పరిరక్షణ నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు.
ఈ కోర్సుకు కోర్సు డైరెక్టర్ అపర్ణ సుబ్రహ్మణియన్ నేతృత్వం వహిస్తారు. ఇందులో గరిష్టంగా 24 మంది పాల్గొంటారు. కోర్సు ఫీజు ఒక్కో అభ్యర్థికి రూ.12,000.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం ఎఫ్‌టీఐఐని 020-2553 0085 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. లేదా info.cfol@ftii.ac.in / fro@ftii.ac.in కు మెయిల్ చేయవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2306699)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21