వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ వాణిజ్య పరిధి విస్తరణ దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దేశవ్యాప్త సద్వినియోగం పెరగాలి
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
“సుమారు 60 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థలతో భారత్ కుదుర్చుకున్న 9 ‘ఎఫ్‌టీఏ'లు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా వరకూ ప్రాధాన్య సౌలభ్యం కల్పిస్తాయి”
“మరిన్ని ‘ఎఫ్‌టీఏ'లతోపాటు మార్కెట్ సౌలభ్యం మరింత పెంచే కృషి వల్ల పోటీదారులతో పోలిస్తే స్వల్ప వ్యయంతో ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటాను భారత్ కైవసం చేసుకోగలదు”
“ఏప్రిల్-జూలై మధ్య భారత్ ఎగుమతులు 317 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి... నిరుడు ఇదే వ్యవధిలో పోలిస్తే ఇది 36-37 బిలియన్లు అధికం”
“ప్రతి జిల్లా.. ఎంఎస్‌ఎంఈ.. పారిశ్రామికవేత్త.. అంకురం.. వ్యాపారి.. మహిళా వాణిజ్యవేత్తలకు చేరువయ్యేలా ‘ఎఫ్‌టీఏ’లు విస్తరించాలి”
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 1:56PM by PIB Hyderabad
భారత అంతర్జాతీయ వాణిజ్య పరిధి విస్తరణ దిశగా దేశవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) సద్వినియోగం మరింత పెరగాలని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో “ఎఫ్‌టీఏ’ల సద్వినియోగంపై అవగాహన కార్యక్రమం” కింద ఇవాళ నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ సౌలభ్యం మెరుగుపడిందని, తద్వారా లభించే ప్రయోజనాలు దేశంలోని అన్ని వ్యాపారాలకూ గరిష్ఠ స్థాయిలో చేరాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రీకృత, సార్వజనీన, దేశవ్యాప్త కృషి మరింత ముమ్మరం కావాలని సూచించారు. భారత ‘ఎఫ్‌టీఏ’ల నెట్‌వర్క్ నానాటికీ విస్తరిస్తున్నందున అన్ని వ్యాపార-వాణిజ్య సంస్థలకూ ఎగుమతి అవకాశాలు అందేవిధంగా సమష్టి కృషి అవశ్యమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
ఈ కృషి దేశమంతటా వేగంగా విస్తరించడం ద్వారా చిన్నాపెద్దా తేడా లేకుండా మొత్తం 780 జిల్లాల్లోనూ చివరి అంచెలోగల అతిచిన్న వ్యాపారి, వాణిజ్య-పారిశ్రామికవేత్త, అంకుర సంస్థ, మహిళా వ్యాపారవేత్తల స్థాయిదాకా ప్రయోజనం చేకూరాలని శ్రీ గోయల్ అన్నారు. ప్రధానంగా అంతర్ముఖ దేశీయ ఆర్థిక వ్యవస్థగా పరిగణనలోగల భారత్‌ను ఓ కీలక అంతర్జాతీయ శక్తిగా నిలపాలనే బృహత్సంకల్ప సాధనలో ఎంత స్వల్ప స్థాయిలోనైనా లభించే సహకారం అత్యంత అమూల్యమైనదేనని ఆయన అభివర్ణించారు.
దేశమంతటా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నెట్‌వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఎగుమతిదారులకు… ముఖ్యంగా ‘ఎంఎస్‌ఎంఈ’లకు, తొలిసారిగా ఎగుమతి చేసేవారికి నిర్దిష్ట ఫలితాలు చేకూర్చడం లక్ష్యంగా ఒకరోజు పాటు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల అధికారులు, ఎగుమతి ప్రోత్సాహక మండలాలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
అంతర్జాతీయంగా భారత్ పోషిస్తున్న పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు, గౌరవం పొందగల ఆర్థిక వ్యవస్థగా, ఇతర దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా మన దేశం మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ విశ్వాసం విలువగా మారాలని, 2047 నాటికి అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధిక వాటాతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందడంలో దేశవ్యాప్త సమష్టి కృషి ద్వారా ఈ విలువ ప్రతిపాదన రూపుదిద్దుకోవాలని సూచించారు.
భారత్ నేడు తన ఆర్థిక ప్రస్థానంలో కీలక మలుపును చేరిందని శ్రీ గోయల్ అన్నారు. స్థిరమైన ధరల వద్ద ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదవడం ఒక ప్రధాన విజయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, గందరగోళం మధ్య ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం అపూర్వమని వ్యాఖ్యానించారు. ఈ వాస్తవాన్ని “వ్యతిరేకించే వారి” వ్యాఖ్యానాలను విశ్వసించవద్దని ఆయన ప్రజలను కోరారు.
కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ పరిధిలో విస్తృత, క్షేత్రస్థాయి యంత్రాంగం స్వతంత్ర ప్రక్రియ ద్వారా దశాబ్దాలుగా ఈ గణాంకాలను రూపొందిస్తుంది తప్ప ప్రభుత్వం, మంత్రులు లేదా అధికారులకు వాటితో నిమిత్తం లేదని ఆయన స్పష్టం చేశారు.
యావద్దేశాన్నీ ముందుకు నడిపిస్తూ, కొత్త పారిశ్రామికవేత్తలను అంతర్జాతీయ విపణుల వైపు ప్రోత్సహిస్తూ, అందివచ్చే అపార అవకాశాలను సద్వినియోగానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు మరింత సార్వజనీనతతో నిరంతర, సుస్థిర, అవిరళ ఫలితాధారిత ప్రయత్నాలు సాగాలని సూచించారు.
సుమారు 60 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థలతో భారత్ కుదుర్చుకున్న 9 ‘ఎఫ్‌టీఏ'లు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా వరకూ ప్రాధాన్య సౌలభ్యం కల్పిస్తాయని శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. రాబోయే కొన్ని నెలలు లేదా రెండేళ్ల వ్యవధిలో కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, ఎస్‌ఏసీయూ, జీసీసీ, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలతో భారత్ ‘ఎఫ్‌టీఏ’లు కుదుర్చుకోనుందని తెలిపారు. అంతేకాకుండా ఆసియాన్, కొరియా, జపాన్ విపణుల సమీక్షకు కృషితోపాటు మరింత మార్కెట్ సౌలభ్యం కోసం చేపట్టే ఇతర చర్యలతో మన పోటీదారులతో పోలిస్తే స్వల్ప వ్యయంతో ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటాను భారత్ కైవసం చేసుకోగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మన పోటీదారులతో పోలిస్తే భారత్ మెరుగైన వాణిజ్య వాటా పొందడమే అంతిమంగా ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం (పీటీఏ), ఎఫ్‌టీఏ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తదితరాల పరమార్థమని చెప్పారు. వాస్తవ సుంకానికి అంకెలతో నిమిత్తం ఉండదని, దాన్ని పోటీకి అనుగుణంగానే పరిగణించాలని ఆయన వివరించారు.
అమెరికా, ఐరోపా సమాఖ్యల వాణిజ్య సరళి భిన్నమని, వాటి నిర్వహణ-కార్మిక వ్యయాలు పూర్తిగా వేర్వేరని శ్రీ గోయల్ అన్నారు. అందువల్ల ఇతర మార్కెట్లలో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి మన పోటీదారులు చెల్లించే సుంకాలతో భారత్ అంచనాలు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమను ఉదాహరిస్తూ- ‘ఎల్‌డీసీ హోదాతోపాటు ‘ఎఫ్‌టీఏ'లతో ప్రయోజనం పొందుతూ శూన్య లేదా స్వల్ప సుంకాలతో అభివృద్ధి చెందిన మార్కెట్లను అందుకోగలిగిన బంగ్లాదేశ్, వియత్నాంలతో పోటీ పడటంలో భారత్ చిరకాలం నుంచీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని శ్రీ గోయల్ చెప్పారు. ఆ మేరకు అధిక సుంకాల సమస్యతో మన దేశం సతమతం కావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, దాదాపు అన్ని అభివృద్ధి చెందిన మార్కెట్లలో పోటీ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన ధరలను పొందుతున్నదని చెప్పారు. ఈ విషయంలో పనితీరు తప్ప మరెలాంటి సాకులకు వీల్లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్పత్తి పరిమాణం, నాణ్యత, శ్రద్ధ, వినియోగదారుల విశ్వసనీయత నిలబెట్టుకోవడం, షెడ్యూళ్లు, ప్యాకేజింగ్ పరంగా సకాలంలో సరఫరా చేయడం తదితరాలపై పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపారు. “అంటే- అవకాశాలు నేడు పూర్తిగా మన చేతిలోనే ఉన్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమష్టి కృషిలో ప్రభుత్వం, సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలు భాగం పంచుకుంటాయని, వాణిజ్య శాఖతోపాటు దీని పరిధిలోని ‘డీపీఐఐటీ’ అన్ని శాఖల సమన్వయంతో సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తుందని శ్రీ గోయల్ చెప్పారు. తదనుగుణంగా భారత్ వాణిజ్య ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న వస్త్ర, ఔషధ, రసాయన, ఎలక్ట్రానిక్స్ రంగాలు సహా అన్ని కీలక మంత్రిత్వ శాఖలను సంప్రదింపుల ద్వారా క్రమంగా ఇందులో భాగస్వాములను చేయాలన్నారు.
ఇప్పటికే అమలులోగల, రాబోయే ‘ఎఫ్‌టీఏ’లపై మంత్రి మాట్లాడుతూ- ప్రస్తుతం ఏడాదికి ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో మారిషస్, ఒమన్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే (జూలై 15 నుంచి)లతో ఒప్పందాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అటుపైన మరో నాలుగు దేశాలతో ‘ఈఎఫ్‌టీఏ’ కూడా త్వరలో అమలు కానుండగా, న్యూజిలాండ్‌తో పాటు ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలతో ఒప్పందాలు త్వరలో అమలులోకి రానున్నాయి.
భారత్ పోటీతో పోలిస్తే అమెరికా ఒక ప్రాధాన్య రేటును ప్రకటించగలిగితే తక్షణం ‘బీటీఏ’ను ఖరారు చేసి, పూర్తి వివరాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా కుదుర్చుకున్న 9 ‘ఎఫ్‌టీఏ’లలోనూ భారత్ మంచి ఒప్పందాలనే కుదుర్చుకున్నదని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ప్రతి ఒప్పందం ఉభయతారకంగా ఉండటమే కాకుండా రైతులు, మత్స్యకారులు, ‘ఎంఎస్‌ఎంఈ’లు, కార్మికులు సహా కీలక రంగాలతోపాటు ఔషధ, వస్త్ర, ఆహార-వ్యవసాయ ఉత్పత్తుల వంటి ప్రధాన రంగాల్లో ప్రతిదానిపైనా భారత్ గర్వించదగిన మంచి ఒప్పందాలను కుదుర్చుకున్నదని ఆయన తెలిపారు.
సన్నిహిత భాగస్వాములతో సంయుక్త భాగస్వామ్యం, సంప్రదింపుల ఫలితంగా ఈ ఒప్పందాలన్నీ చక్కగా కుదిరాయని ఆయన అన్నారు. కీలక రంగాలకు గణనీయ రక్షణ సహా భారత్‌కు ఆసక్తి, నైపుణ్యం గల రంగాల్లో ఎగుమతి సామర్థ్యాన్ని కూడా ఇవి ప్రోదిచేస్తాయని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకోవడం సుమారు 16 శాతం వృద్ధిని సూచిస్తున్నదని శ్రీ గోయల్ అన్నారు.
గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య ఎగుమతులు 280 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సుమారు 317 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. తద్వారా తొలి నాలుగు నెలల్లోనే పెరుగుదల 36 నుంచి 37 బిలియన్ డాలర్ల మే నమోదైందని పేర్కొన్నారు.
సాధారణంగా క్రిస్మస్ పర్వదినం సమీపించే కొద్దీ మన ఎగుమతులు వేగం పుంజుకుంటాయని, ఆ మేరకు జనవరి-మార్చి మధ్య చివరి త్రైమాసికంలో గరిష్ఠ స్థాయికి చేరుతాయని వివరించారు. ప్రస్తుత ధోరణి ఒక శుభ సంకేతమని, ఈ వృద్ధి వేగాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటిదాకా అందుబాటులోగల ఆగస్టు నెల గణాంకాలను ప్రస్తావిస్తూ- భారత్ నేడు సముచిత మార్గంలోనూ సాగుతున్నదని శ్రీ గోయల్ అన్నారు. సమష్టి కృషితోపాటు మరిన్ని అవకాశాలు అందిరావడంతో వర్తమాన-భవిష్యత్ సామర్థ్యంగల దేశంలోని ప్రతి జిల్లాకు, ప్రతి రంగానికీ ఈ అవకాశాలు చేరువ కాగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్ తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడమే కాకుండా కొత్త ఎగుమతిదారులను ప్రోత్సహిస్తుందని, ప్రస్తుతం చిన్న స్థాయిలో ఉన్నవారు మరింత ఎదిగేందుకు చేయూత ఇస్తుందని చెప్పారు. అలాగే, పెద్ద ఎగుమతిదారులకూ సాధ్యమైన ప్రతి అంశంలోనూ అన్నవిధాలా మద్దతిస్తుందని ప్రకటించారు.
ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌కు మద్దతివ్వాల్సిందిగా కోరుతూ- వినూత్న, విశిష్ట ఆలోచనలను పంచుకోవాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. కొండ ప్రాంతాలు లేదా కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ సహా ఈశాన్య ప్రాంతాల నుంచి ఎగుమతులకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం తోడ్పాటునిస్తుందని చెప్పారు. ఈ మేరకు అవసరమైన మేర నియంత్రణ ఆమోదాలు, ‘ఎస్‌పీఎస్’-టీబీటీ ఆమోదాలు, రవాణా నష్టపరిహారం తదితర కీలకాంశాలపై ఆలోచనలు-సూచనల స్వీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
హోర్ముజ్ జలసంధి వల్ల సమస్య ఎదురయ్యే సందర్భాల్లో- ముఖ్యంగా చిన్న ఎగుమతిదారులకు మద్దతిచ్చే మార్గాన్వేషణ చేయాలని సూచించారు.
ఇప్పటి నుంచి మరో నాలుగేళ్లలో- అంటే.. 2030కల్లా ఎన్నో ఏళ్ల కిందట నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంపై భారత్ గురిపెట్టాలని మంత్రి అన్నారు. భారత్ ఇప్పటికే కోవిడ్ మహమ్మారి సహా రెండు యుద్ధాలను, అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని ఆయన గుర్తుచేశారు. అయితే, కేంద్రీకృత కృషితో ముందడుగు వేయాలని, 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని దేశం వదులుకోరాదని పిలుపునిచ్చారు.
సంకల్పం భారీదైనపుడు సామర్థ్యం కూడా బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని లోపాలున్నప్పటికీ, ఫలితం సాధ్యమైనంత వరకు 2 ట్రిలియన్ డాలర్లకు చేరువగా ఉండాలన్నారు. అంతేగానీ, 1.2 ట్రిలియన్ లేదా 1.3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో మాత్రమే దేశానికి సేవ చేయడమనే ప్రసక్తి ఉండదన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాల కల్పన, కొత్త పారిశ్రామికవేత్తల సృష్టి వంటి లక్ష్యాలను సాధించడం అసాధ్యమని స్పష్టం చేశారు.
కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడంపై యోచించాలని శ్రీ గోయల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయా కార్యాలయాలు రాష్ట్రాల్లో ఉన్నాయని, భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి మద్దతివ్వాలన అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, జౌళి, మెరైన్, వ్యవసాయం, రత్నాలు, ఆభరణాలు, చర్మ పరిశ్రమ సహా ప్రతి రంగంలోనూ అపార అవకాశాలు ఉన్నాయని, ఈ జాబితాకు అంతులేదని ఆయన చెప్పారు.
సేవల రంగంలో అనేక కొత్త రంగాలు రూపుదిద్దుకోవడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ప్రతి దేశం ఆకాశమే హద్దుగా నిర్ణయించుకుంటోందని అన్నారు.
సాంకేతిక ప్రమాణాలు, పారిశుధ్య-ఎస్‌పీఎస్ ప్రమాణాల ప్రాధాన్యాన్ని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. అనైతికమైన ఏ అంశానికీ భారత్ ఒక మాధ్యమం కారాదని, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలవడమే మన లక్ష్యం కావాలని ఉద్బోధించారు.
భారత్ వాస్తవిక విలువను జోడించే దేశంగా ఎదగాలని, మనం జారీ చేసే ఉత్పత్తి దేశ ధ్రువీకరణ పత్రానికి ఎనలేని విలువ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
రాబోయే 100 ‘భవ్య’ పారిశ్రామిక పార్కుల దిశగా ఎగుమతిదారులకు ప్రధానంగా మద్దతిస్తామని మంత్రి తెలిపారు. ఉన్నత ప్రమాణాలకు కట్టుబడిన ఎగుమతిదారుల కేటాయింపులకు రాయితీ ఉంటుందన్నారు. ఎగుమతిదారుల కార్యకలాపాల కోసం సర్వసన్నద్ధ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ లేదా పారిశ్రామిక పార్కుల ద్వారా ఇప్పటికే గల సముదాయలకూ మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని శ్రీ గోయల్ ప్రస్తావించారు. అన్ని రంగాల ఉత్పత్తులూ అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా చూడాలన్న ప్రధానమంత్రి దృక్కోణాన్ని గుర్తుచేశారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను అందుకోవడంతో సరిపెట్టకుండా అంతకుమించిన ఘనత సాధించేలా కృషి చేయాలని సంస్థలకు పిలుపునిచ్చారు.
శిఖర స్థాయికి దూసుకెళ్లే మార్గం ఇదేనని, విప్లవ స్థాయిలో దేశం ఈ కృషిని కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.
శ్రీ గోయల్ చివరగా నిర్దిష్ట అంశాలను ప్రస్తావిస్తూ కీలక సూచనలిచ్చారు:
మొదటిది: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ఇప్పటికే వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుతున్న ఉత్పత్తులను, సముదాయాలను ప్రతి రాష్ట్రం గుర్తించాలి. అలాగే, ఏయే ప్రయోజనాలు ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదో కూడా చూడాలి. తద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు అవసరమో అంచనా వేయవచ్చు.
రెండోది: తొలిసారి ఎగుమతిదారులను, కొత్త ఉత్పత్తులను గుర్తించాలి. ‘ఎంఎస్ఎంఈ’లు సహా తొలిసారి ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్లలో ప్రవేశించేందుకు ఈ-కామర్స్ ఒక సులువైన మార్గంగా ఉంది. కాబట్టి, పెద్ద ఎత్తున ఎగుమతుల ప్రారంభానికి వీలుగా వాటిని ప్రోత్సహిస్తూ కొన్ని మార్పులు చేశామని ఆయన వెల్లడించారు.
మూడోది: ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల (ఈపీసీల) మధ్య సమన్వయ బలోపేతం సహా అవి తమ పరిధిలోని పరిశ్రమలకు చేరువ కావాలి. అయితే, ‘ఈపీసీ’లు-పరిశ్రమల మధ్య సంప్రదింపులు క్షేత్రస్థాయితోపాటు చివరి అంచెకు, ముందు వరుస ఎగుమతిదారులకు చేరువ కావకపోవడం తనకు ఆందోళన కలిగిస్తున్నదని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు. ‘ఈపీసీ’లు తమ సందేశాన్ని ఎగుమతిదారులకు, పరిశ్రమలకు ఎంతవరకు చేరవేస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు.
అలాగే, పారిశ్రామిక సంఘాలు కూడా చివరి వ్యక్తి లేదా అతి చిన్న యూనిట్ దాకా చేరువ కావాల్సిన అవసరం ఎంతయినా ఉందని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం, సంఘాలు, ‘ఈపీసీ’ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ప్రతి జిల్లా నుంచి మరింత ఎక్కువ మందిని అంతర్జాతీయ ప్రతినిధి బృందాలలో సభ్యులుగా చేర్చాలన్నారు. సరైన ఉత్పత్తులను సరైన మార్కెట్లలో ప్రదర్శించాలని… ముఖ్యంగా రంగాలవారీ ప్రతినిధి బృందాల సంఖ్యను పెంచాలని సూచించారు.
నాలుగోది: పారిశ్రామిక సంఘాలు తమకుతాము లక్ష్యనిర్దేశం చేసుకోవాలని, అదే సమయంలో ‘ఈపీసీ’లు మరింత ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని చెప్పారు. తమతమ సభ్యులకు, ‘ఎంఎస్ఎంఈ’లకు స్థానిక భాషలలో, సులభంగా అర్థమయ్యే సారాంశంతో విస్తృత సమాచారం అందించాలని తెలిపారు. సభ్యుల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వం-ఎగుమతిదారుల మధ్య మద్దతుకు కేంద్రకంగా, పరస్పర సహకారంలో వాస్తవ చేయూతగా నిలవాలని పిలుపునిచ్చారు.
సంబంధిత మంత్రిత్వశాఖ రంగాలవారీగా లేదా సముదాయాల వారీగా వర్క్ షాప్‌లు నిర్వహించాలన్నారు. జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో ఒక సంప్రదింపుల అధికారిని నియమించి సౌలభ్య కల్పన యంత్రాంగాన్ని రూపొందించాలని సూచించారు. తమను సంప్రదించే ఎగుమతిదారుల సమస్యలపై ప్రతిస్పందన అత్యంత వేగంగా, సాధ్యమైనంత వరకు తక్షణం ఉండాలన్నారు. ముఖ్యంగా పదేపదే కార్యాలయాలను సందర్శించే అవసరం లేకుండా ప్రతి సందర్భంలోనూ ఆన్‌లైన్ మార్గాలు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.
సమష్టి కృషి ద్వారానే క్షేత్రస్థాయిలో లక్షలాది ఉద్యోగాల సృష్టి సాధ్యమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. దేశానికి బిలియన్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరడమే కాకుండా భావి తరాలు భారీ స్థాయిన ఎగుమతి వ్యాపారంలో ప్రవేశించగల స్ఫూర్తి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నేటి అమృత శకంలో వర్ధమాన దేశమైన భారత్, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తితో అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందగలదని ఆశాభావం వెలిబుచ్చుతూ శ్రీ గోయల్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ‘ఈపీసీ’లు, పారిశ్రామిక సంస్థలు సహా భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తేవడమే ఈ వర్క్ షాప్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలకు లభించే నిర్దిష్ట అవకాశాలను అన్ని రాష్ట్రాలకూ తెలియజేయడం కోసమే ఈ విభిన్న చర్చాగోష్ఠులను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎగుమతి రంగానికి ప్రోత్సాహంలో రాష్ట్రాల భాగస్వామ్యంతో కూడిన సుస్థిర విధానంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ వర్క్ షాప్‌లో ప్రముఖులు, నిపుణుల ప్రసంగాలు పునరుద్ఘాటించాయి. అలాగే, భవిష్యత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మరింత సద్వినియోగం అయ్యే దిశగా శాఖాపరమైన కార్యాచరణ ప్రణాళికను వివరించాయి.
ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం), జిల్లాలను ఎగుమతి కూడళ్లుగా (డీఈహెచ్) మార్చే కార్యక్రమంపై ఒక ప్రత్యేక ప్రసంగం సాగింది. ఎగుమతి రుణాల సౌలభ్యం, నిబంధనల పాటింపు సరళీకరణ, డిజిటలీకరణ విధానం, రూల్స్-ఆఫ్-ఆరిజిన్ సర్టిఫికేషన్ సహా ‘ఎఫ్‌టీఏ’ పత్రాలకు ప్రత్యక్ష మద్దతు వంటి కీలకాంశాలకు ప్రాధాన్యమిస్తూ ‘ఈపీఎం’ను రూపొందించినట్లు తెలిపారు. ప్రాంతీయ అధికారులలో అవగాహనను కూడా ఇది బలోపేతం చేస్తుంది. అలాగే, తొలితరం, ‘ఎంఎస్‌ఎంఈ' ఎగుమతిదారులకు అత్యంత కీలకమైన సమాచార అంతరాన్ని భర్తీచేస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా- భారత ఎగుమతిదారుల కోసం మార్కెట్ అనుసంధాన బలోపేతం గురించి ‘ఐటీపీవో’ చైర్మన్ శ్రీ జావేద్ అష్రఫ్ విశదీకరించారు. ఎగుమతి ప్రోత్సాహం దిశగా సహకారాత్మక కార్యాచరణను ఆయన స్పష్టం చేశారు. భారత ఎగుమతిదారులకు మద్దతివ్వడంలో తాము పోషిస్తున్న పరిణామాత్మక పాత్రను కూడా ఆయన ప్రముఖంగా వివరించారు.
భారత్ ఇటీవల వివిధే దేశాలతో కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ'ల వల్ల అందివచ్చిన మార్కెట్ అవకాశాలపై మరొక ప్రసంగం నిశితంగా దృష్టి సారించింది. ఎగుమతి సౌలభ్య కల్పనలో క్షేత్రస్థాయి అనుభవాన్ని ప్రాతిపదికగా ‘ఎఫ్‌టీఏ'ల సద్వినియోగంపై రాజస్థాన్ బృందం తన దృక్పథాన్ని వివరించింది.
మధ్యాహ్నం కార్యక్రమంలో రాష్ట్రాల వారీగా ఆరు సమాంతర బృంద చర్చాగోష్ఠులను నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వీటిని ప్రాంతీయ స్థాయిలో ఏర్పాటు చేయగా, ప్రతి గోష్ఠిలోనూ వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు సహా రాష్ట్ర స్థాయి సీనియర్ అధికారి కూడా అధ్యక్షత వహించారు. నిర్దిష్ట ఎగుమతి సముదాయాలు, ఉత్పత్తుల గుర్తింపుతోపాటు ‘ఎఫ్‌టీఏ’ ప్రయోజనాల సద్వినియోగంలో ఎగుమతిదారుల ఆచరణాత్మక పరిమితులు, కేంద్రం నుంచి తదుపరి సహాయంపై ప్రతి బృందం స్థాయిలో సాగిన చర్చలు నిశితంగా దృష్టి సారించాయి. ప్రతి బృంద గోష్ఠి నుంచి అందిన కీలక కార్యాచరణ అంశాలను ముగింపు సదస్సులో సమర్పించిన తర్వాత వందన సమర్పణ చేశారు.
ఎగుమతులను ప్రోత్సహించడంపై కేంద్ర-రాష్ట్ర సమన్వయ బలోపేతం ప్రాధాన్యంతో ఈ వర్క్ షాప్ ఏర్పాటైంది. ప్రత్యేకించి… ‘ఎఫ్‌టీఏ'ల ప్రయోజనాలు దేశమంతటా- జిల్లా, క్లస్టర్ స్థాయి తయారీదారులకు, ఎగుమతిదారులకు చేరేలా చూడటంలో వాణిజ్య శాఖ నిరంతర కృషిని ఈ వర్క్ షాప్ ప్రతిబింబించింది.
***
(రిలీజ్ ఐడి: 2306579)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11