పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
‘పులుల ఆవాసాలు: ఉపాధి, ఆదాయం ప్రాతిపదికలుగా వాటి సంరక్షణ, బయో ఎకానమీ, పర్యావరణ హిత పర్యాటకం’ ప్రధాన ఇతివృత్తంగా... న్యూఢిల్లీలో అంతర్జాతీయ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
సామరస్యం, మానవుడు - ప్రకృతి సహజీవనం... పర్యావరణ సంరక్షణకు ఇవే పునాదులుగా ఉండాలి: శ్రీ భూపేందర్ యాదవ్
పులుల ఆవాసాల సంరక్షణ, సుస్థిరాభివృద్ధి, సామర్థ్యాభివృద్ధి, వైజ్ఞానిక వినిమయం, ప్రకృతి సానుకూలతా నిధుల కార్యక్రమాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఐబీసీఏ, ఏడీబీ మధ్య అవగాహన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 11:47AM by PIB Hyderabad
‘పులుల ఆవాస ప్రాంతాలు: ఉపాధి, ఆదాయం ప్రాతిపదికలుగా - వాటి సంరక్షణ, బయో ఎకానమీ, పర్యావరణ హిత పర్యాటకం’ అన్న అంశం ప్రధాన ఇతివృత్తంగా న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు ప్రారంభించారు. 2026 సెప్టెంబర్ 2 - 3 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సదస్సును.. అంతర్జాతీయ పెద్దపులి జాతుల (బిగ్ క్యాట్) కూటమి - ఐబీసీఏ, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ తన్మయ్ కుమార్, డీజీ (అటవీ), మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ అవస్థి, ఐబీసీఏ డీజీ శ్రీ ఎస్.పి. యాదవ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత డైరెక్టర్ శ్రీమతి మియా ఒకా, మంత్రిత్వశాఖ, ఐబీసీఏ, ఎన్‌టీసీఏ, ఏడీబీల చెందిన ఉన్నతాధికారులు, పులుల సంచార దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పులుల ఆవాస ప్రాంతాలను సహజ మూలధనంగా గుర్తించడం, వ్యవస్థాగత సేవల విలువను చాటడంతోపాటు - నిరంతర జీవనోపాధికి, స్థానికులకు ఆదాయాన్ని సమకూర్చడంలో, దీర్ఘకాలిక పర్యావరణ భద్రత వంటి అంశాలకు.. పులుల సంరక్షణ, బయో ఎకానమీ, పర్యావరణ హిత పర్యాటకం ఏ విధంగా చోదక శక్తిగా నిలుస్తాయో వివరించడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి.
ప్రారంభోత్సవ సభనుద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రాజెక్ట్ టైగర్’ కింద భారత్ సాధించిన అద్భుత సంరక్షణా ప్రయాణాన్ని శ్రీ యాదవ్ వివరించారు. అడవులు, గడ్డి భూములు, నదులు, ఎరగా మారే జంతుజాతులు, వన్యప్రాణి కారిడార్లు, స్థానిక వర్గాల సంక్షేమం వంటి అనేక అంశాలతో... పులుల మనుగడ నేరుగా ముడిపడి ఉందన్నారు. నీటి భద్రత, కర్బన సంగ్రహణ, వాతావరణ నియంత్రణ, జీవవైవిధ్య సంరక్షణ, జీవనోపాధికి చేయూతనివ్వడం వంటి కీలకమైన పర్యావరణ సేవలతో... పులుల ఆవాస ప్రాంతాలు విలువైన ప్రాకృతిక మూలధనంగా నిలుస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. నిర్దిష్ట జంతు జాతులు కేంద్రంగా సంరక్షణ చర్యలకు పరిమితం కాకుండా.. పర్యావరణ భద్రత, సామాజిక - ఆర్థిక అభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేలా ఆవాస ప్రాంత నిర్వహణ దిశగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రకృతి ఆధార పరిష్కార మార్గాలు, కొత్త ఆర్థిక మార్గాలు, సామాజిక భాగస్వామ్యంతో పర్యావరణ హిత పర్యాటకం ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
‘‘ప్రకృతితో సామరస్యం కలిగిన సంరక్షణ, మానవ-ప్రకృతి సహజీవనమే పర్యావరణ పరిరక్షణకు ప్రధాన ప్రాతిపదిక కావాలి’’ అని శ్రీ యాదవ్ వ్యాఖ్యానించారు. భూమిని కాపాడుకోవడమంటే నాణ్యమైన ఆహారాన్ని పరిరక్షించడమేనని, మానవజాతి మనుగడకు ఇది అత్యావశ్యకమని అన్నారు. ఎడారుల పరిమాణం పెరగడం, నేలలో తేమ తగ్గిపోవడం, మృత్తికా నాణ్యత క్షీణించడం వంటి తీవ్రమైన సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి రక్షణతోపాటు... స్థానిక ప్రజల సంప్రదాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, సుస్థిర సామాజిక-ఆర్థిక వికాసాన్ని సాధించడంలో పులుల ఆవాస ప్రాంతాల సంరక్షణ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

సంరక్షణ, బయో ఎకానమీ, పర్యావరణ హిత పర్యాటక రంగాలకు సంబంధించిన విధాన రూపకల్పనలో సాంప్రదాయక పరిజ్ఞానాన్ని క్రోడీకరించి, ఆయా విధానాల్లో పొందుపరచాల్సిన ఆవశ్యకతపై చర్చించాల్సిందిగా వర్క్‌షాప్ ప్రతినిధులకు మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సామర్థ్య నిర్మాణం, స్థానిక ప్రజల సాంప్రదాయక విజ్ఞాన వినిమయం, విధాన రూపకల్పన తీరుతెన్నుల్లో చెప్పుకోదగ్గ మార్పులపై ఈ సదస్సు దృష్టి సారించాలని ఆయన కోరారు. పర్యావరణ సంరక్షణ విధానాల రూపకల్పనలో అభివృద్ధి చెందుతున్న దేశాల స్థానిక సంప్రదాయ విజ్ఞానాన్ని ఒక్క వేదికపైకి చేర్చే దిశగా ఐబీసీఏ ముందడుగు వేయాలన్నారు.
అంతర్జాతీయ పెద్దపులి జాతుల (బిగ్ క్యాట్) కూటమి (ఐబీసీఏ) - ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లు.. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుని భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించుకున్నాయి. ఆవాస ప్రాంతాల సంరక్షణ, సుస్థిరాభివృద్ధి, సామర్థ్యాభివృద్ధి, పరస్పర సమాచార వినిమయం, ప్రకృతి సంరక్షణ కోసం నిధుల సమీకరణ కార్యకలాపాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఈ ఒప్పందం ఒక కీలక ముందడుగు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా.. ఏడు పెద్దపులి జాతుల (బిగ్ క్యాట్స్) సంరక్షణ కోసం కృషి చేస్తున్న వివిధ దేశాలు, సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చే అంతర్జాతీయ సహకార వేదికగా ఐబీసీఏ పాత్ర క్రమంగా పెరుగుతోందని మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు.
ఐబీసీఏ, ఏడీబీ మధ్య భాగస్వామ్యాన్ని శ్రీమతి మియా ఓకా స్వాగతించారు. ఏడీబీకి భారత్‌తో ఉన్న భాగస్వామ్యానికి 2026తో 40 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర సామాజిక-ఆర్థిక అభివృద్ధి రంగాల్లో భారత్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం.. పెద్దపులి జాతుల (బిగ్ క్యాట్) సంచార దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. పెద్దపులి జాతుల సంచార దేశాలను ఒక్క వేదికపైకి తీసుకురావడంలో, భారత సంరక్షణ అనుభవాలను పంచుకోవడంలో, పర్యావరణ పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు ఆర్థిక వనరులను సమకూర్చడంలో ఏడీబీ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్, భూటాన్, కాంబోడియా, మలేషియా, నేపాల్, వియత్నాంలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులతోపాటు.. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ రిజర్వుల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు, పరిశోధకులు, సంరక్షణ నిపుణులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. పులుల ఆవాస ప్రాంతాల సంరక్షణను బలోపేతం చేయడంతోపాటు.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే వినూత్న మార్గాలను అన్వేణకు, అనుభవాలను పంచుకోవడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఒక అరుదైన వేదికగా ఈ సదస్సు నిలవనుంది.
***
(రిలీజ్ ఐడి: 2305974)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4