ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2026 4:41PM by PIB Hyderabad

యువర్ ఎక్సలెన్సీ, నా మిత్రుడు, అధ్యక్షునికి,

రెండు దేశాల ప్రతినిధులకు,

పాత్రికేయ మిత్రులకు,

నమస్కారం!

తాష్కెంట్‌లో నాకు, నా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికిన ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునికి, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఉజ్బెకిస్థాన్‌లో నాలుగోసారి పర్యటిస్తున్నాను. ఇది మన సన్నిహిత సంబంధాలను, సమన్వయాన్ని, గాఢమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తోంది.

దాదాపు ఒక దశాబ్ద కాలంగా అధ్యక్షునితో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ కాలంలో, ఆయనను పదిసార్లకు పైగా కలుసుకునే అవకాశం నాకు లభించింది.

సానుకూలమైన, దూరదృష్టితో కూడిన ఆయన వైఖరి, నిరంతరం నేర్చుకొనే స్ఫూర్తి నిజంగా ఆదర్శప్రాయమైనవి. భారతదేశం పట్ల స్నేహభావానికి, మన సంబంధాల పట్ల ప్రదర్శిస్తున్న అచంచలమైన నిబద్ధతకు నేను ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

మిత్రులారా,

మధ్య ఆసియాకు, ఈ ప్రాంతంతో భారతదేశానికున్న సంబంధాలకు కేంద్ర బిందువుగా ఉజ్బెకిస్థాన్ ఉంది. దృక్పథాలు, ఆకాంక్షల విషయంలో భారత్, ఉజ్బెకిస్థాన్ బలమైన సారూప్యతలను కలిగి ఉన్నాయి. యాంగీ ఉజ్బెకిస్థాన్, వికసిత్ భారత్ రెండు లక్ష్యాలకు మన యువత, ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధి, ఆధునిక సాంకేతికత ప్రధానాధారాలుగా ఉన్నాయి. ఈ ఉమ్మడి దార్శనికతతోనే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాము.

ఈ ఏడాదితో మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 వసంతాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా.. మన సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని మేం నిర్ణయించాం.

ఈ నూతన విధానం ప్రకారం మన భాగస్వామ్యాన్ని మరింత వేగంతో, నిర్దిష్ట ఫలితాలతో ముందుకు తీసుకెళ్లడం కోసం లక్ష్యంతో కూడిన అజెండాను మేం రూపొందించాం.

మన ద్వైపాక్షిక వాణిజ్యం ఒక బిలియన్ డాలర్లను దాటింది. 2030 నాటికి అయిదు బిలియన్ డాలర్లను చేరుకోవాలని ఇప్పుడు మనం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీన్ని సాధించడం కోసం.. మార్కెట్ అవకాశాలు, అనుసంధానం, బ్యాంకింగ్, చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన సమస్యలను క్రమపద్ధతిలో మేం పరిష్కరిస్తాం.

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇద్దరికీ ప్రయోజనం కలిగించేలా సహకారాన్ని పెంపొందించడానికి మేం కలసి పనిచేస్తాం. డిజిటల్ పౌర మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు, శుద్ధ ఇంధనం, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో సహకారం భవిష్యత్తుకు తగిన విధంగా ఉండేలా మన సంబంధాలను మారుస్తోంది.

మిత్రులారా,

వ్యవసాయం, ఆరోగ్య సేవల రంగంలో మన సామర్థ్యాలు పరస్పరం ప్రయోజనం కలిగించేవిగా ఉన్నాయి. హార్టీకల్చర్‌లో ఉజ్బెకిస్థాన్ నైపుణ్యాన్ని, భారత ఆధునిక వ్యవసాయ పద్ధతులతో కలపడం ద్వారా రెండు దేశాల ఆహార భద్రతకు తోడ్పాటు అందిస్తాం.

ఉజ్బెకిస్థాన్ ఔషధ మూలికలు, ఆయుర్వేదంలో భారత్ నైపుణ్యం కూడా సహజమైన సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తాయి. సంప్రదాయ వైద్యంలో ఈ రోజు కుదిరిన ఒప్పందం ఈ రంగంలో మన ఉమ్మడి ప్రయత్నాలకు మరింత వేగాన్ని అందిస్తుంది.

మన భాగస్వామ్యం మన రెండు రాజధానులకే పరిమితం కాకుండా చూసేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి.. మన నగరాలు, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే దిశగా మేం కలసి పనిచేస్తున్నాం. పట్టణ నిర్వహణ, పరిశ్రమ, విద్య, పర్యాటకం, సంస్కృతి లాంటి రంగాల్లో ప్రత్యక్ష సంబంధాలను పెంపొందించేందుకు ఈ భాగస్వామ్యాలు సహకరిస్తాయి.

మన రెండు దేశాల మధ్య ఉన్న పటిష్టమైన రక్షణ, భద్రతా సహకారం మన బంధానికి పునాదిగా ఉన్న బలమైన నమ్మకాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో మన రెండు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య ప్రత్యక్ష సంబంధాలను, ఉమ్మడి ఉత్పత్తిని, అభివృద్ధిని మరింతగా ప్రోత్సహిస్తాం.

ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాదం ఈ ప్రాంతం మొత్తానికి కఠినమైన సవాళ్లను విసురుతున్నాయని మేం విశ్వసిస్తున్నాం.

 

వాటిని ఎంతమాత్రమూ ఉపేక్షించకూడదనే మా అంచంచలమైన ఉమ్మడి సంకల్పం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది...

మిత్రులారా,

ఉమ్మడి వారసత్వంలోనే మన సంబంధాల మూలాలు ఉన్నాయి. ఈ బంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రోజు ప్రత్యేక దృష్టి సారించాం.

ఉజ్బెకిస్థాన్‌లో ఉన్న బౌద్ధ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు మేం కలసి పనిచేస్తాం. రెండు దేశాల మధ్య యువతను ముఖ్యంగా విద్యార్థులు, నిపుణుల ఆదానప్రదానాలను ప్రోత్సహించడానికి మేం అధిక ప్రాధాన్యమిస్తున్నాం. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించే సహకార కార్యక్రమంపై ఈ రోజు ఏకాభిప్రాయానికి వచ్చాం. ఉజ్బెకిస్థాన్‌లో హిందీ భాషను ప్రోత్సహించేలా ఈ రోజు ఉపకార వేతనాలను ప్రకటించబోతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

మన  సహకారంలో క్రీడలు కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి. గతేడాది గోవాలో జరిగిన ఫిడె ప్రపంచ చెస్ కప్‌ను 20 ఏళ్ల ఉజ్బెక్ గ్రాండ్ మాస్టర్ సిందరోవ్ గెలుచుకున్నారు. అతడు ఈ నవంబర్‌లో 20 ఏళ్ల భారతీయ ఛాంపియన్ గుకేష్‌తో తలపడతాడు. చదరంగంలో ఈ ఇద్దరు యువ క్రీడాకారులు తలపడే పోటీని ప్రపంచమంతా ఆసక్తితో వీక్షిస్తుంది. వచ్చే నెల సమరకండ్‌లో జరిగే చెస్ ఒలింపియాడ్‌కుగాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కురాష్, కబడ్డీ లాంటి సంప్రదాయ క్రీడలు మన క్రీడా భాగస్వామ్యానికి సరికొత్త శక్తిని అందిస్తాయి.

ఈ రోజు చేపట్టిన చర్చలు మన సంబంధాల భవిష్యత్తుకు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాయి. మధ్య ఆసియాలో శాంతి, ప్రగతి, శ్రేయస్సుకు పటిష్టమైన భారత్–ఉజ్బెకిస్థాన్ భాగస్వామ్యం బలమైన శక్తిగా మారుతుంది.

ఎక్సలెన్సీ,

మీ స్నేహానికి, ఈ రోజు మనం జరిపిన ఫలప్రదమైన చర్చలకు మరోసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మరో రెండు రోజుల్లో 35వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉజ్బెకిస్థాన్ నిర్వహించుకోనుంది. ఈ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ ప్రజలకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

 

***


(రిలీజ్ ఐడి: 2304975) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada