ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పటిష్ఠ భద్రత, నిరంతర పర్యవేక్షణతో దేశవ్యాప్తంగా విజయవంతంగా పూర్తయిన నీట్-పీజీ 2026 పరీక్ష

36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 339 నగరాల్లో 1,111 కేంద్రాల్లో.. 2.73 లక్షల మంది అభ్యర్థుల కోసం పరీక్ష

హాజరైన 2.65 లక్షల మందికి పైగా అభ్యర్థులు

జైపూర్‌లోని రెండు కేంద్రాల్లో సాంకేతిక అంతరాయం కారణంగా 2,445 మంది అభ్యర్థులకు 2026 సెప్టెంబర్ 5న మళ్లీ పరీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2026 1:56PM by PIB Hyderabad

నిష్పక్షపాత, సురక్షిత, అవాంతరాలు లేని పరీక్షా ప్రక్రియను నిర్ధారించడం కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎమ్ఎస్)... సమగ్రమైన రవాణా, సాంకేతిక, భద్రత, మానవ వనరుల పరమైన ఏర్పాట్లతో ఈ రోజు దేశవ్యాప్తంగా నీట్-పీజీ 2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాల్లో ఉన్న 1,111 పరీక్షా కేంద్రాల్లో 2,73,096 మంది అభ్యర్థుల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 2,65,980 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, సుమారు 2,63,535 మంది అభ్యర్థులు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష కోసం నిరంతర పర్యవేక్షణ, కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించడానికి మొత్తం 2,527 మంది బోధనా సిబ్బందిని స్వతంత్ర పరిశీలకులుగా నియమించారు. దీనికి అదనంగా, డీన్‌లు, డైరెక్టర్‌లు, మెడికల్ సూపరింటెండెంట్‌లు, సీనియర్ ప్రొఫెసర్‌లు సహా 700 మందికి పైగా సీనియర్ బోధనా సిబ్బందిని ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు.

సమన్వయం, పర్యవేక్షణ బలోపేతం కోసం, దేశవ్యాప్తంగా 16 ఎన్‌బీఈఎమ్ఎస్ ప్రాంతీయ కమాండ్ కేంద్రాలను కార్యాచరణలోకి తీసుకువచ్చారు.

పరీక్షా కేంద్రాలనూ లైవ్ సీసీటీవీ నిఘాలో ఉంచారు. దీనిని ద్వారకలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న ఎన్‌బీఈఎమ్ఎస్ కమాండ్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించారు. నిరంతర నిఘా, పర్యవేక్షణ కోసం ఎన్‌బీఈఎమ్ఎస్, టీసీఎస్‌ల నుంచి 190 మంది సిబ్బందితో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు.

ఎన్‌బీఈఎమ్ఎస్ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక కమాండ్ సెంటర్‌లో... ఎన్‌బీఈఎమ్ఎస్, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, బీఈఎల్, ఈసీఐఎల్, టీసీఎస్ అధికారులు రోజంతా పరీక్షా ప్రక్రియను నిశితంగా, నిరంతరం పర్యవేక్షించారు.

పరీక్ష కోసం భద్రతను మరింత పటిష్ఠం చేయడానికి, నకిలీ అభ్యర్థులను నివారించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా... పరీక్షా కేంద్రాల్లో  ఆధార్ ఆధారిత ధ్రువీకరణను విజయవంతంగా నిర్వహించారు. పరీక్షను సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించడానికి ప్రభుత్వ సంస్థలు తమ పూర్తి మద్దతును అందించాయి.

దేశవ్యాప్తంగా అత్యధిక శాతం అభ్యర్థులకు పరీక్ష విజయవంతంగా పూర్తయినప్పటికీ, పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎమ్/ఎస్ టీసీఎస్ లిమిటెడ్ కారణంగా... రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఐఓఎన్ డిజిటల్ జోన్, ఐడిజెడ్ సితాపుర కేంద్రాల్లో (పరీక్షా కేంద్రాల సంఖ్య. 41682, 41683) ఊహించని సాంకేతిక అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ఈ పరీక్షా కేంద్రాల్లో అంతర్గత విద్యుత్ సరఫరా సమస్యల కారణంగా 2,445 మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు.

ప్రభావిత అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి ఎన్‌బీఈఎమ్ఎస్ చింతిస్తోంది. వారికి నీట్ పీజీ-2026 పరీక్షకు హాజరయ్యేందుకు న్యాయమైన, సమానమైన అవకాశం కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టింది.

దీనికి అనుగుణంగా, ఈ అభ్యర్థులందరికీ 2026 సెప్టెంబర్ 5వ తేదీ శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. వేదిక వివరాలు, పరీక్ష సంబంధిత ఇతర సూచనలు సంబంధిత అభ్యర్థులకు విడిగా తెలియజేస్తారు.

339 నగరాల్లోని 1,111 కేంద్రాల్లో పరీక్షను విజయవంతంగా నిర్వహించడం... ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో పాలుపంచుకున్న పరీక్షా అధికారులు, వైద్య సంస్థలు, అధ్యాపకులు, భద్రతా సంస్థలు, సాంకేతిక బృందాలు, ఇతర భాగస్వాముల మధ్య విస్తృత సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది.

అభ్యర్థుల సహకారం, సహనం, నమ్మకాన్ని ఎన్‌బీఈఎమ్ఎస్ అభినందిస్తోంది. నీట్-పీజీ 2026 నిర్వహణతో సంబంధం ఉన్న సిబ్బంది, సంస్థలందరి అంకితభావంతో కూడిన కృషినీ గుర్తిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2304695) సందర్శకుల సూచీ సంఖ్య : : 58