ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్లు.. 59.09 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు...
ఖాతాదారుల్లో 56 శాతం మంది మహిళలు.. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే 78 శాతం ఖాతాలు
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక భద్రతను మరింత అందుబాటులోకి తెస్తూ... 41 కోట్లకు పైగా రూపే కార్డుల జారీ
నిరుపేదలకు సంక్షేమ ప్రయోజనాలు నేరుగా, పారదర్శకంగా, దారి మళ్లింపు లేకుండా అందించడాన్ని సాధ్యం చేసిన జేఏఎమ్ ప్రణాళిక
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2026 12:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రారంభించిన కార్యక్రమాల్లో ఒకటిగా... 28 ఆగస్టు 2014న ప్రారంభమైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 12 సంవత్సరాల పీఎంజేడీవై కార్యక్రమం భారత ఆర్థిక రంగంలో అద్భుత పరివర్తనకు సాక్ష్యంగా నిలిచింది. ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితానికి ఒక మార్గదర్శిగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా ఈ పీఎంజేడీవై... భారతీయులంతా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశాన్ని కల్పించడం కొనసాగిస్తోంది.
ఆర్థిక సమ్మిళితాన్ని విస్తరించడం:
పటిష్ఠమైన ఆర్థిక సమ్మిళిత పథకాలు, విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా అట్టడుగున ఉన్న, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మద్దతునివ్వడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. పీఎంజేడీవై పథకం ద్వారా, బ్యాంకు సేవలు అందని వయోజనులందరికీ ఎలాంటి కనీస బ్యాలెన్స్ అవసరం లేని, ఎలాంటి నిర్వహణ రుసుములు లేని ఒక సాధారణ బ్యాంకు ఖాతా అందుబాటులోకి వస్తుంది.
ప్రతి ఖాతాతో పాటు ఉచిత రూపే డెబిట్ కార్డు లభిస్తుంది. ఇది రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది. డిజిటల్ లావాదేవీలను, ఆర్థిక భద్రతను ప్రోత్సహిస్తుంది. ఖాతాదారులు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యానికీ అర్హులు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వారికి ఒక భరోసాను అందిస్తుంది.
పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి జన సురక్షా పథకాల ద్వారా... అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమాను అందించడంలోనూ పీఎంజేడీవై ఖాతాలు కీలక పాత్ర పోషించాయి.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి మాట్లాడుతూ... "2014 ఆగస్టు 28న 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' (పీఎంజేడీవై) పేరుతో ఆర్థిక సమ్మిళిత జాతీయ మిషన్‌ను గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారు. నేడు 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన' తన 12వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం నాకు సంతోషాన్నిస్తోంది. 59 కోట్లకు పైగా ఖాతాల ప్రారంభం, రూ.3.17 లక్షల కోట్ల డిపాజిట్ నిల్వలు లేదా 41.29 కోట్ల ఉచిత రూపే కార్డుల జారీ వంటి అంశాల కోణంలోనే పీఎంజేడీవైని చూడకూడదు. దీనిని దేశ బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో సాధించిన అద్భుతమైన మార్పుల కోణంలోనూ చూడాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎటువంటి జాప్యం లేకుండా, సమాజంలోని ప్రతి వ్యక్తికీ... అత్యంత పేదవారికీ... ఆర్థిక సేవలను అందించడం దీనివల్లే సాధ్యమైంది" అన్నారు.
పీఎంజేడీవై పథకం కింద తెరిచిన 78 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సుమారు 56 శాతం ఖాతాలు మహిళల పేరిటే ఉన్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే అట్టడుగు వర్గాల ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలన్న ఈ పథకం ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోంది.
పీఎంజేడీవై పథకం లక్షలాది మందికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి... వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం బ్యాంకింగ్, ఆర్థిక సేవలను పొందేందుకు సాధికారత కల్పించింది. ఈ ఖాతా కలిగి ఉండడం సామాన్యులకు బీమా, పింఛను వంటి ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పించింది. ప్రతి రాష్ట్రం, జిల్లాలో అవిశ్రాంతంగా చేపట్టిన విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా... దేశంలోని దాదాపు ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతాలను అందించే దిశగా మేం పురోగమించాం. బీమా, పింఛను పథకాల పరిధినీ... వాటి అవసరం అత్యంతగా ఉన్న వారి కోసం క్రమంగా విస్తరించాం.
12వ వార్షికోత్సవం సందర్భంగా... పీఎంజేడీవై పథకాన్ని సామాన్యులకు చేరవేసి దానిని ఘనవిజయం చేయడంలో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న బ్యాంకర్లు, వ్యాపార ప్రతినిధుల కృషిని నేను అభినందిస్తున్నాను.” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
జేఏఎమ్ ప్రణాళిక : ఒక గేమ్-చేంజర్
పీఎంజేడీవై ప్రధాన కేంద్రంగా రూపొందించిన 'జన్ ధన్–ఆధార్–మొబైల్' (జేఏఎమ్) ప్రణాళిక... ఆర్థిక సహాయాన్ని నేరుగా ప్రజల ఖాతాలకు చేరవేయడం ద్వారా మళ్లింపులకు తావులేని ఒక సమర్థమైన విధానంగా నిరూపితమైంది. జేఏఎమ్ ద్వారా... మధ్యవర్తుల ప్రమేయాన్ని, జాప్యాన్ని తొలగించడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం నేరుగా అట్టడుగు వర్గాల వారి బ్యాంకు ఖాతాలకు విజయవంతంగా బదిలీ చేయడం సాధ్యమైంది.
విజయాలు:
a. పీఎంజేడీవై ఖాతాలు: 59.09 కోట్లు (19 ఆగస్టు 2026 నాటికి)
19 ఆగస్టు 2026 నాటికి, మొత్తం పీఎంజేడీవై ఖాతాల సంఖ్య 59.09 కోట్లుగా ఉంది. జన్ ధన్ ఖాతాదారుల్లో 55.7 శాతం (32.92 కోట్లు) మంది మహిళలు కాగా, 77.8 శాతం (45.95 కోట్లు) జన్ ధన్ ఖాతాలు గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
b. పీఎంజేడీవై ఖాతాల్లో డిపాజిట్లు – రూ. 3.17 లక్షల కోట్లు (19 ఆగస్టు 2026 నాటికి)
పీఎంజేడీవై ఖాతాల కింద మొత్తం డిపాజిట్ నిల్వలు రూ. 3,16,514 కోట్లుగా ఉన్నాయి. గత 12 ఏళ్లలో (ఆగస్టు 2015 - ఆగస్టు 2026 మధ్య) డిపాజిట్లు సుమారు 12.8 రెట్లు పెరగగా, ఖాతాల సంఖ్య 2.3 రెట్లు పెరిగింది.
c. ప్రతి పీఎంజేడీవై ఖాతాలో సగటు డిపాజిట్ – రూ. 5,356 (19 ఆగస్టు 2026 నాటికి)
19.08.2026 నాటికి, ఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ రూ. 5,356గా ఉంది. గత 12 ఏళ్లలో (ఆగస్టు 2015 నుంచి ఆగస్టు 2026 వరకు) ఒక్కో ఖాతాకు సగటు డిపాజిట్ 3.4 రెట్లు పెరిగింది. సగటు డిపాజిట్‌లో ఈ పెరుగుదల... ఖాతాల వినియోగం పెరగడానికి, ఖాతాదారుల్లో పొదుపు అలవాట్లు పెంపొందడానికి నిదర్శనంగా ఉంది.
d. పీఎంజేడీవై ఖాతాదారులకు జారీ చేసిన రూపే కార్డులు: 41.29 కోట్లు (19 ఆగస్టు 2026 నాటికి)
పీఎంజేడీవై ఖాతాదారులకు 41.29 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. కాలక్రమేణా రూపే కార్డుల సంఖ్య, వాటి వినియోగం పెరిగాయి.
పీఎంజేడీవై విజయం దాని మిషన్-మోడ్ విధానం, నియంత్రణ సంస్థల మద్దతు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, బయోమెట్రిక్ ధ్రువీకరణ కోసం ఆధార్ వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల అనుసంధానం వంటి అంశాల వల్లే సాధ్యమైంది. ఇది ఆర్థిక సమ్మిళితం దిశగా మొదటి అడుగుగా కొనసాగుతోంది. గతంలో అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్నవారికి పొదుపు, రుణ సదుపాయాన్ని కల్పించడం ద్వారా మరింత పురోగతి సాధ్యమవుతోంది. స్పష్టమైన పొదుపు విధానాలతో, ఖాతాదారులు ఇప్పుడు ముద్రా రుణాలు సహా ఇతర రుణాలకూ అర్హులయ్యారు. ఇది వ్యక్తులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధికారత కల్పిస్తోంది.
పీఎంజేడీవై తన 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో... ఇది సమ్మిళిత వృద్ధి, డిజిటల్ ఆవిష్కరణ, ఆర్థిక సాధికారతకు ఒక దిక్సూచిగా నిలుస్తోంది. దీని నిరంతర విజయం... ఆర్థిక శ్రేయస్సు దిశగా సాగే ప్రయాణంలో ఏ ఒక్క పౌరుడూ వెనకబడిపోకుండా చూడటం పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2303728)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam