రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తాగునీటి ట్యాంకులు, ఫిల్టర్ల స్వచ్ఛత, సూక్ష్మక్రిముల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెట్టిన భారతీయ రైల్వే

తాగునీటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా తనిఖీ చేయడంతో పాటు వాటిని మెరుగుపరచాలని జోనల్ రైల్వేలకు సలహా..
స్టేషన్‌వారీ లోటుపాట్లు, తీసుకున్న చర్యలపై పర్యవేక్షణకు రంగం సిద్ధం

प्रविष्टि तिथि: 24 AUG 2026 11:37AM by PIB Hyderabad

రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సురక్షిత, స్వచ్ఛ తాగునీరు అన్ని వేళలా అందుబాటులో ఉండేటట్లు చూడటానికి తాగునీటి ట్యాంకులను, వడపోత వ్యవస్థలను శుభ్రపరచడం, క్రిమినిర్మూలన దిశగా దృష్టి పెట్టే ఒక ప్రత్యేక స్వచ్ఛత పరిరక్షణ ఉద్యమాన్ని భారతీయ రైల్వే మొదలుపెట్టింది.
తాగునీటి నాణ్యత నిర్వహణను పటిష్ఠం చేసేందుకు భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో అమలుపరుస్తున్న ఒక విస్తృత కార్య ప్రణాళికలో ఈ కార్యక్రమం ఓ భాగం. ఈ కార్యాచరణ ప్రణాళికలో.. పూర్తి తాగునీటి వ్యవస్థను తరచు తనిఖీ చేస్తుండడంతో పాటు, ఆ వ్యవస్థ నిర్వహణ విషయంలో శ్రద్ధ వహించనున్నారు. ఒక్క నల్లా నీటిని పరీక్షించడానికే పరిమితం కాకుండా, జల మూలం వద్ద, పంపుల వద్ద కూడా నీటి నాణ్యతను పరీక్షించాలని ఈ కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, నీటి వనరులు, శుద్ధి ప్లాంటులు, వడపోత ప్లాంటులు, భూమి లోపలి ట్యాంకులు,  ఓవర్‌హెడ్ ట్యాంకులు, పీవీసీ ట్యాంకులు, వాటర్ బూత్‌లు, నల్లాలు, నీటిని అందించే స్థలాల వద్ద కూడా ముమ్మర పరిశీలనలను జోనల్ రైల్వేలు చేపడతాయి. అన్ని తాగునీటి ట్యాంకుల్నీ ఖాళీ చేసి, బురదను బయటకు తీసి, ట్యాంకులను లోపల నుంచి శుభ్రపరిచి, వ్యాధికారక క్రిమికీటకాలు, సూక్ష్మజీవుల లేకుండా చూస్తారు. దీనికి అదనంగా, నీరు బయటకు పోయేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాలు, ట్యాంకు నిండాక నీరు బయటకు పొంగి పొరలే చోట్ల వద్ద పక్షుల, పశువుల సంచారం, చెత్త పేరుకుపోవడం, నాచు పెరగడం వంటి సమస్యల నుంచి తగిన రక్షణ కోసం కట్టుదిట్టమైన మూతలను ఏర్పాటు చేసేందుకు కూడా చొరవ తీసుకుంటారు.
ఈ ప్రత్యేక స్వచ్ఛత పరిరక్షణ ఉద్యమ కాలంలో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను నిశితంగా పరిశీలించి గుర్తిస్తారు. పాడైన ట్యాంకులు, గొట్టపు మార్గాలు, ఫిల్టర్లను మరమ్మతు చేయడమో, లేదా అవసరాన్ని బట్టి వాటిని మార్చడమో చేస్తారు. వీటితోపాటు తాగడానికి అనువైన, తాగడానికి అనువు గాని జల వ్యవస్థల మధ్య ఎలాంటి క్రాస్-కనెక్షన్ ఏర్పడకుండా చూస్తారు. తాగునీటి వ్యవస్థలో భాగంగా ఉన్న అన్ని గొట్టాలు చిల్లులేమైనా పడి కారుతున్నాయా అన్నది సరి చూస్తారు. నీరు వృథాపోకుండా నివారించడానికి అవసరమయ్యే దిద్దుబాటు చర్యలను తీసుకుంటారు.
తాగునీటిని బయటకు తోడటానికి చేతి పంపులను, బోర్‌వెల్స్‌ను ఉపయోగిస్తున్న స్థలాల వద్ద ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. ఈ వ్యవస్థల వద్ద నీరు కలుషితం కాకుండా తాగడానికి ఉపయోగపడేదిగా ఉండేటట్లుగా జోనల్ రైల్వే బాధ్యత తీసుకుని పనిచేయవలసి ఉంటుంది.
పక్కాగా నీటి నాణ్యత నిర్వహణ
ఒక విస్తృత కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వాటర్ కూలర్లను, నీటి శుద్ధి వ్యవస్థలను సమగ్రంగా తనిఖీ చేస్తూ ఉండాల్సిందిగా జోనల్ రైల్వేలకు రైల్వో బోర్డు సలహాను ఇచ్చింది. కూలర్లలోని నీళ్ల ట్యాంకులను బాగా శుభ్రపరిచి, కూలర్లు, గొట్టపుమార్గాలు, నల్లాల్లో లీకేజీలు ఉంటే వాటిని వెంటనే సరి చేస్తారు. వాటర్ కూలర్ చుట్టూరా ఉండే ప్రదేశాలు శుభ్రంగా ఉండేటట్లు చూస్తారు.
వాటర్ కూలర్ల కోసం యూవీ/ఆర్ఓ శుద్ధీకరణ వ్యవస్థలను తనిఖీ చేస్తూ అవి సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించి, అవసరాలను బట్టి తగు చర్య తీసుకుంటారు. ఎక్కడైనా పాడైపోయిన దాఖలాలు కనపడితే తదనుగుణంగా అక్కడ నిర్వహణ, సర్వీసింగ్, మరమ్మతు, ఫిల్టర్ క్యాండిల్స్, ఇతర విడిభాగాలను ఎప్పటికప్పుడు నెలకొల్పుతారు. కొత్త, లేదా మార్చవలసిన అవసరం ఉండే యూవీ/ఆర్ఓ వ్యవస్థలను వాటి స్థితి, అవసరాల ఆధారంగా వెనువెంటనే సమకూరుస్తారు.
వాటర్ వెండింగ్ మెషిన్ల  వద్ద కూడా పరిశుభ్రపరిచే పనులను, శుద్ధి, నాణ్యత పర్యవేక్షణలకు సంబంధించిన  పనులను చేపడుతుంటారు. ఆ తరహా సదుపాయాల నుంచి సరఫరా అయ్యే తాగునీరు సురక్షితంగా, స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేటట్లు చూస్తారు.
నిర్దేశిత ప్రదేశాల్లో జల నమూనాలను అధికారులు సేకరించి భౌతిక, రసాయనిక, బాక్టీరియాకు సంబంధించిన పరీక్షలను చేపడతారు.  నీటి మూలాలు, శుద్ధి అనంతరం నీటిని అందజేసే వ్యవస్థలు, ట్యాంకులు, కూలర్లు, నీటి విక్రయ యంత్రాలు, నల్లాలు, వాటర్ బూత్‌ల నుంచి కూడా నమూనాలను సేకరిస్తారు. మిగిలిపోయే క్లోరిన్‌ను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తారు. అవసరమైనప్పుడు వెనువెంటనే తిరిగి క్లోరిన్‌ను వినియోగించడం గాని, లేదా ఇతర దిద్దుబాటు చర్యలను గాని చేపడతారు.
మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, దిద్దుబాటు చర్యలు
కొత్త ఓవర్‌హెడ్ ట్యాంకులు, భూగర్భ ట్యాంకుల నిర్మాణం, లేదా పాతబడ్డ వాటిని మార్చడానికి అనుమతించిన చోట్ల అందుకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తూ, ఆ పనులను త్వరగా పూర్తి చేసేటట్లు చూడాల్సిందిగా జోనల్ రైల్వేలను రైల్వే బోర్డు ఆదేశించింది. ఆమోద ముద్ర వేసిన పనులు ఎంతవరకు వచ్చిందీ నివేదికను రూపొందించడంతో పాటు, అవసరమనుకున్న చోట్ల తాజాగా పనులకు అనుమతిని ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతారు.
తాగునీటి సరఫరా వ్యవస్థ వివిధ దశల్లో కాలుష్య కారకాలను గుర్తింపు, నివారించడానికి మూలాలు, నల్లాలు సహా వివిధ పరిస్థితులకు తగినట్లుగా వడపోత, శుద్ధీకరణలకు ఏర్పాట్లు చేయడంపైనా కసరత్తు జరుగుతోంది.
జోనల్ రైల్వేలు తాము గుర్తించిన లోపాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన దిద్దుబాటు చర్యలపై స్టేషన్‌వారీ వివరాలను అందిస్తాయి. లోటుపాట్లను వ్యవస్థాగతంగా పర్యవేక్షించడానికి మార్గాన్ని ఈ యంత్రాంగం సుగమం చేస్తుంది. అంతే కాక, ప్రత్యేక కార్యక్రమాల వేళ పసిగట్టిన సమస్యలను కాలబద్ధ పద్ధతిలో పరిష్కరించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
కార్యాచరణ ప్రణాళికలో రైల్వే కాలనీలు, పని ప్రదేశాల్లో తాగునీటి మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని ఇదే విధమైన చర్యలను తీసుకోవాలని సంకల్పించారు. దీంతో ఒక్క ప్రయాణికులతో సంబంధం ఉండే ప్రాంతాలనే కాకుండా, ఇతర చోట్ల కూడా సురక్షిత, స్వచ్ఛ తాగునీటిని అందజేసే విషయంలో శ్రద్ధ వహించినట్లు అవుతుంది.
ఈ సమష్టి చర్యలను తీసుకోవడం ద్వారా, భారతీయ రైల్వేలకు సంబంధించిన తాగునీటి సరఫరా వ్యవస్థ అంతటా నివారణ ప్రధాన తనిఖీలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, స్వచ్ఛత, వ్యాధికారక క్రిమికీటకాలు, సూక్ష్మజీవులను నశింపచేసే పద్ధతి, నీటి నాణ్యతను నిర్ధారించే పరీక్షలను, దిద్దుబాటు చర్యలను తీసుకొనే దిశగా పక్కా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాణికులకు, అలాగే రైల్వే సిబ్బందికి సురక్షిత, స్వచ్ఛ, ఆరోగ్యవర్ధక తాగునీరు ఎల్ల వేళలా అందుబాటులో ఉండేటట్లు  చూడడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

 

***


(रिलीज़ आईडी: 2302809) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada