నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సహకారంతో జాతీయ స్థాయి క్లౌడ్, ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్


వికసిత్ భారత్–2047 లక్ష్యసాధనలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో యువతకు భవిష్యత్తు నైపుణ్యాలను అందించడమే కీలకం: శ్రీ జయంత్ చౌదరి

1,50,000 మందికి ప్రాథమిక క్లౌడ్ శిక్షణను, 10,000 మంది ఇంటెన్సివ్ ట్రైనీలకు ఉద్యోగానికి తగిన క్లౌడ్, ఏఐ నైపుణ్యాలను అందించాలని యోచన

ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ ప్రోగ్రామ్, ఇతర ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా శిక్షణ

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో యువతకు ప్రాధాన్యం

प्रविष्टि तिथि: 23 AUG 2026 4:27PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) మార్గదర్శకత్వంలో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) సహకారంతో దేశవ్యాప్త క్లౌడ్, ఏఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు  జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్‌డీసీ), కల్టస్ ఎడ్యుకేషన్ ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మందికి ప్రాథమిక ఏఐ, క్లౌడ్ శిక్షణ అందిస్తుంది. అలాగే 10,000 మందికి ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగ సాధనకు తగిన శిక్షణను అందిస్తుంది. బృందాల వారీగా అందించే ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమమే ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడటంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలను అందిస్తుంది. అర్హతలకు తగిన ఇంటర్వ్యూ అవకాశాలను పట్టభద్రులకు ఇస్తుంది.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలుగా ఏడబ్ల్యూఎస్, రీ/స్టార్ట్, ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంటును ఎన్ఎస్‌డీసీ, కల్టస్ ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శిక్షణ కార్యక్రమానికి పరిమిత స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉండటం, సాంకేతిక సంస్థలతో అనుసంధానం తక్కువగా ఉండటం, క్లౌడ్, ఏఐ ఉద్యోగాలకు పోటీ పడేందుకు అవసరమైన అర్హతలు లేకపోవడం లాంటి సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరించనున్నారు. ఎన్ఎస్‌డీసీ ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థ కల్టస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు ప్రాధాన్యం లభిస్తుంది. జాతీయ స్థాయి హ్యాకథాన్‌తో ఈ శిక్షణా కార్యక్రమం ముగుస్తుంది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాంతాలు, నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు అందించాలనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోంది. ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదుగుతున్న తరుణంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకొనే అవకాశాలను పొందడం చాలా అవసరం. సమ్మిళితమైన, నైపుణ్యాలున్న, భవిష్యత్తు అవసరాలకు తగిన శ్రామిక శక్తిని తీర్చిదిద్దడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో భాగంగా చేసే ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైనది’’ అని శ్రీ జయంత్ చౌదరి అన్నారు.

"ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్ కార్యక్రమం ప్రతిభావంతులను వెలికి తీసి ఉపాధి కల్పిస్తుంది. క్లౌడ్ సంస్థల్లో విజయవంతంగా కెరీర్ ప్రారంభించడానికి, తగిన ప్రతిభతో సంస్థలు తమ పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి, సమాజం వృద్ధి చెందడానికి ఈ వేదిక దోహదపడుతుంది. భవిష్యత్తుకు తగినట్లుగా వైవిధ్యమైన, విస్తృతమైన నైపుణ్యాలున్న క్లౌడ్ నిపుణులను తయారు చేసేందుకు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ద్వారా సంస్థలు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఎన్ఎస్‌డీసీ, కల్టస్ ఎడ్యుకేషన్‌తో కలసి పని చేస్తున్నందుకు గర్విస్తున్నాం’’ అని ఏడబ్ల్యూఎస్ స్కిల్లింగ్, సోషల్ ఇంపాక్ట్ ఏపీజేసీ లీడ్ రాణీ బర్చ్‌మోర్ అన్నారు.

‘‘ఆత్మవిశ్వాసాన్ని, అర్హతలను, సరైన ఉపాధి అవకాశాలను అందించే విద్యే నైపుణ్యానికి అసలైన కొలమానం. ప్రధాన మెట్రో నగరాల పరిధిని దాటి అంతర్జాతీయంగా అవసరమైన క్లౌడ్, ఏఐ నైపుణ్యాలను అందించి... నేర్చుకోవడం, శిక్షణ దగ్గరి నుంచి సర్టిఫికేషన్, ఉద్యోగ అవకాశాల వరకు ఫలితాల ఆధారిత ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేయడంపైనే దృష్టిని సారించాం’’ అని కల్టస్ ఎడ్యుకేషన్, గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నళిన్ సింగ్ తెలియజేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న యువతకు అత్యుత్తమ సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలను చేరువ చేస్తూ.. సామాజికంగా, ఆర్థికంగా అర్థవంతమైన ప్రభావం తీసుకొచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా నైపుణ్యాలు ఉండి వెనుకబడిన ప్రాంతాల్లోని యువతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ముఖ్యంగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న ప్రతిభా కేంద్రాల్లోని యువతకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా అర్థవంతమైన సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని తీసుకొచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పూర్తిగా 100 శాతం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని యువత శిక్షణ పొందవచ్చు. ఇది ప్రాథమిక డిజిటల్ అవగాహన నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అర్హతలు, ఉపాధి అవకాశాల వరకు మార్గాలను సృష్టిస్తుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని, ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్‌తో అభ్యర్థులు తమ శిక్షణను ప్రారంభించవచ్చు. తద్వారా తమకు అనుకూలమైన రీతిలో ప్రాథమిక ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. తగిన నైపుణ్యాలు సాధించినవారు ఏడబ్ల్యూఎస్ రీ/స్టార్ట్‌కు వెళ్లొచ్చు. ఇది క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్, ఏఐ ప్రాథమిక అంశాలలో నిర్మాణాత్మకమైన, నిపుణుల-నేతృత్వంలోని శిక్షణను అందిస్తుంది. వృత్తిపరమైన మార్గదర్శకులు, ప్రముఖ నిపుణులు అందించే తోడ్పాటుతో ప్రోగ్రామింగ్, నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ, రిలేషనల్ డేటాబేస్‌ల్లో అభ్యర్థులు శిక్షణ పొందుతారు. ఈ నైపుణ్యాలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా, ప్రయోగాత్మకంగా, కోర్సు వర్కు ద్వారా నేర్చుకుంటారు. కోర్సు పూర్తి చేసుకున్నవారు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ పొందుతారు. క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాల్లో పరిశ్రమ గుర్తింపు పొందిన ఈ అర్హతలతో పాటు, స్థానిక సంస్థలతో అనుసంధానం ద్వారా తమ అర్హతలకు తగిన ఇంటర్వ్యూ అవకాశాలను పొందుతారు. జాతీయ హ్యాకథాన్‌తో ఈ శిక్షణా కార్యక్రమం పూర్తవుతుంది. ఇది హైరింగ్ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలు, ఇతర ముఖ్యమైన భాగస్వాముల ముందు క్లౌడ్, ఏఐ పరిష్కారాలను ప్రదర్శించే అవకాశాన్ని శిక్షణ పొందినవారికి అందిస్తుంది.

ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎన్ఎస్‌డీసీ ఛీఫ్ ఆపరేటింగ్ అధికారి ప్రశాంత్ సిన్హా పాల్గొన్నారు.


(रिलीज़ आईडी: 2302640) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati , Odia , Tamil , Malayalam