ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం: అంతర్జాతీయంగా పోటీతత్వానికి ఊతమివ్వడం, దేశీయంగా ప్రతి దశనూ విస్తరించడమే లక్ష్యం


2027 మధ్య నాటికి భారతదేశ మొదటి ప్రభావవంతమైన స్వదేశీ మొబైల్ బ్రాండ్‌: శ్రీ అశ్వినీ వైష్ణవ్

ప్రత్యక్షంగా 60 వేల ఉద్యోగాల కల్పనతోపాటు... మొత్తంగా దాదాపు రూ. 39 లక్షల కోట్ల ఉత్పత్తిని సాధించేలా మొబైల్ ఫోన్ తయారీ పథకం

प्रविष्टि तिथि: 21 AUG 2026 7:14PM by PIB Hyderabad

రూ. 62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని (ఎంపీఎంఎస్) కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉత్పత్తి పరిమాణాన్ని మరింత పెంచడం, దేశీయంగా విలువను పెంచే కార్యక్రమాల ద్వారా మొబైల్ తయారీ సరఫరా వ్యవస్థను విస్తరించడం, దేశ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా.. అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఉద్యోగ కల్పనతోపాటు.. భారత్‌కు చెందిన మొబైల్ బ్రాండ్లు సాంకేతిక సార్వభౌమత్వాన్ని సాధించడానికి, ఆర్థిక విలువను పెంచుకోవడానికి, అలాగే రూపకల్పనలో, పరిశోధన-అభివృద్ధి లో భారత పేటెంట్లను ప్రోత్సహించడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది.

భారతీయుల యాజమాన్యంలో మొబైల్ బ్రాండ్లతోపాటు.. మేధో సంపత్తి, డిజైన్ల అభివృద్ధిలో మొబైల్ ఫోన్ తయారీ పథకం విశేషమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ అన్నారు. వాస్తవిక భారతీయ యాజమాన్యం ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. ఉత్పత్తుల రూపకల్పన, మేధో సంపత్తి, బ్రాండ్ తప్పనిసరిగా భారతీయుల యాజమాన్యంలోనే ఉండాలని, ఆయా మార్కెట్ విభాగాల్లోని అత్యుత్తమ ఉత్పత్తులతో పోటీపడేలా ఉండాలని స్పష్టం చేశారు. మేధో సంపత్తి భారతీయుల యాజమాన్యంలోనే ఉందని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందని, పరిశ్రమ వర్గాలతో సంప్రదించి ఆర్థికేతర, ఇతర సహాయక చర్యలను కూడా రూపొందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

నేపథ్యం

ప్రధానమంత్రి మేకిన్ ఇండియా సంకల్పంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ ఏడు రెట్లు, ఎగుమతులు పదకొండు రెట్లు పెరిగాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం.. ముఖ్యంగా సుదూర గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు ప్రధాన ఉపాధి వనరుగా అవతరించింది. అనేక తయారీ కేంద్రాల్లో ఒకే చోట 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. కొన్ని చోట్ల ఈ సంఖ్య 20,000కు చేరింది. ప్రధానంగా మొబైల్ ఫోన్ల తయారీయే ఈ వృద్ధికి చోదకశక్తిగా నిలిచింది. ప్రస్తుతం దేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లదే ప్రధాన వాటా. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఈ రంగానికి సంబంధించిన ప్రతీ దశలోనూ భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

పరిమాణం పరంగా.. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా భారత్ నిలిచింది. నేడు దేశంలో వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లలో 99.2 శాతం ‘మేడ్ ఇన్ ఇండియా’ ఫోన్లే కావడం విశేషం. సాంప్రదాయకంగా ప్రధాన ఎగుమతులుగా ఉన్న డీజిల్ ఇంధనం, మెరుగుపెట్టిన వజ్రాల స్థానాన్ని అధిగమించి.. 2025లో భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఏకైక అతిపెద్ద ఉత్పత్తి విభాగంగా స్మార్ట్‌ఫోన్లు నిలిచాయి.

పీఎల్ఐ పథకాలన్నింటిలోనూ అత్యంత విజయం సాధించిన ‘విస్తృత స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ-ఎల్ఎస్ఈఎం)’.. మొబైల్ ఫోన్ల తయారీ, ఎగుమతుల్లో దేశాన్ని అంతర్జాతీయ కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పథకం గడువు 2026 మార్చి 31తో ముగిసింది. ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించడంతోపాటు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచడం లక్ష్యంగా.. ప్రభుత్వం తాజాగా మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రకటించింది.

మొబైల్ ఫోన్ తయారీ పథకం ప్రత్యేక లక్షణాలు

లక్ష్యాల వారీగా ఈ పథకంలో రెండు విభాగాలున్నాయి:

·         లక్ష్య నిర్దేశిత విభాగం 1 (టీఎస్ 1): మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించడం

·         లక్ష్య నిర్దేశిత విభాగం 2 (టీఎస్ 2): భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లకు దన్నుగా నిలవడం

ఈ పథకం వ్యవధి అయిదేళ్లు (2026-27 నుంచి 2030-31). టీఎస్ - 2 కింద దరఖాస్తు చేసుకునేవారికి ఏడాది విరామ సమయం మంజూరు చేసే అవకాశం ఉంది. టీఎస్ - 1 విభాగానికి ఈ పథకం 2.25 శాతం నుంచి 5 శాతం వరకు వివిధ స్థాయుల్లో ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇక టీఎస్ - 2 విభాగానికి సంబంధించి.. భారతీయ బ్రాండ్లకు 5 శాతం ప్రోత్సాహకంతోపాటు.. భారతీయ డిజైన్, పరిశోధన-అభివృద్ధికి అదనంగా 3 శాతం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అంతేకాకుండా భారతీయ బ్రాండ్లకు ఆర్థికేతర సహకారాన్ని కూడా ఈ పథకం కూడా అందిస్తుంది.

అంతేకాకుండా ఈ పథకం పరిధిలోని రెండు లక్ష్య నిర్దేశిత విభాగాలకు సంబంధించి.. కీలక విడిభాగాలు/ ఉపభాగాలను దేశీయ మార్కెటు నుంచే కొనుగోలు చేస్తే అదనంగా 1.5 శాతం వరకు ప్రోత్సాహకం అందుతుంది. మొబైల్ ఫోన్ తయారీదారు సంస్థలు (భారత్‌లో నమోదైన ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థలు సహా) ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విక్రయాలనూ, దరఖాస్తుదారుకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలనూ బ్రాండ్ల వారీగా లెక్కిస్తారు.

అర్హత ప్రమాణాలు

టీఎస్ 1 విభాగం కింద అర్హత సాధించడానికి... 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 10,000 కోట్ల టర్నోవర్ కలిగిన మొబైల్ ఫోన్ తయారీదారు సంస్థలు (భారత్‌లో నమోదైన ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల - ఈఎమ్‌ఎస్ సంస్థలు సహా) దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న బ్రాండ్లు.. 2025-26 అమ్మకాలకు అదనంగా ఏటా రూ. 5,000 కోట్ల వార్షిక పరిమితిని దాటాల్సి ఉంటుంది. కొత్త బ్రాండ్ విషయానికి వస్తే.. భారత్‌లో మొత్తం రూ. 10,000 కోట్ల వార్షిక విక్రయాలను చేరుకున్న తర్వాతే అర్హత పొందుతుంది. ఆపై ఏటా కనీసం రూ. 5,000 కోట్ల అదనపు విక్రయాలను చేరుకోవాల్సి ఉంటుంది.

ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 1,000 కోట్ల టర్నోవర్ కలిగిన మొబైల్ ఫోన్ తయారీదారులు (భారత్‌లో నమోదైన ఈఎమ్‌ఎస్ సంస్థలు సహా) టీఎస్ - 2 విభాగం కింద అర్హత పొందుతాయి. అయితే, వీరు భారత్‌లోనే నమోదై/ స్థాపించి ఉండడం, మేధో సంపత్తి - ట్రేడ్‌మార్కులు భారత్‌లోనే ఉండడం, నిర్వహణాధికారాలు భారత పౌరుల చేతుల్లోనే ఉండడం, 51 శాతానికి పైగా వాటా భారత పౌరుల వద్దే ఉండడం, భారత్‌లో సొంతంగా పరిశోధన - అభివృద్ధి, డిజైన్ సామర్థ్యాలు ఉండడం వంటి ‘భారతీయ బ్రాండ్’కు చెందిన అన్ని నిబంధనలను తప్పక నెరవేర్చాల్సి ఉంటుంది.

దేశంలోనే కొనుగోళ్లు చేస్తే అదనపు ప్రోత్సాహకం

ఒక ఆర్థిక సంవత్సరంలో తయారుచేసే మొత్తం మొబైల్ ఫోన్ యూనిట్లలో కనీసం 25 శాతం ఫోన్లలో ఉపయోగించే కీలక విడిభాగాలు, ఉప భాగాలను దేశీయ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తే.. ఈ పథకం కింద అదనంగా 1.5 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. దేశీయ తయారీని మరింత వేగవంతం చేయడంతోపాటు భారతీయ మొబైల్ ఫోన్ తయారీ వ్యవస్థలో ఆత్మనిర్భరతను సాధించడమే దీని ముఖ్య లక్ష్యం. వాస్తవిక, విస్తృత స్థాయి దేశీయ తయారీకి లబ్ధి చేకూర్చేలా, దానిని మరింత బలోపేతం చేసేలా ఈ అదనపు ప్రోత్సాహకాన్ని రూపొందించారు.

ఆశిస్తున్న ఫలితాలు

ఈ పథకం అమలులో ఉండే అయిదేళ్ల వ్యవధిలో.. దేశంలో మొత్తం మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దాదాపు రూ. 39 లక్షల కోట్లకు చేరుకుంటుందనీ, మొబైల్ ఫోన్ల ఎగుమతులు భారీగా పెరుగుతాయనీ అంచనా వేస్తున్నారు. మొబైల్ ఫోన్ తయారీ పథకం ద్వారా దాదాపు 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇది దేశ ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు తోడ్పడటంతోపాటు.. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత సుదృఢం చేస్తుందని ఆశిస్తున్నారు. 

 

***


(रिलीज़ आईडी: 2302309) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada