ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల కోసం ఏడు అంశాలపై ఆచరణాత్మక వ్యూహాల తీర్మానాన్ని ఆమోదిస్తూ విజయవంతంగా ముగిసిన 'పీఎస్‌బీ కాన్‌ఫ్లూయెన్స్ 2026'


2026 అక్టోబర్ 2 నుంచి యువత కోసం ప్రత్యేకంగా ఒక నెల రోజుల పాటు సాగే కార్యక్రమాన్ని చేపట్టాలని పీఎస్‌బీలను కోరిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

యువ వినియోగదారులతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని, వారి మారుతున్న ఆర్థిక అవసరాలకు మద్దతు ఇవ్వాలని బ్యాంకులను కోరిన కేంద్ర ఆర్థిక మంత్రి

యువతను బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అవకాశాలతో అనుసంధానించడానికి ఒక సాధారణ డిజిటల్ ప్లాట్‌ఫామ్ రూపకల్పన

వికసిత్ భారత్ 2047 దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో సంస్థాగత సామర్థ్యాలను మెరుగైన పోటీతత్వంగా, నాయకత్వంగా మలచాలని పీఎస్‌బీలు, పీఎఫ్‌ఐలకు విన్నపం

प्रविष्टि तिथि: 18 AUG 2026 7:52PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) నిర్వహించిన రెండు రోజుల 'పీఎస్‌బీ కాన్‌ఫ్లూయెన్స్ 2026' నేడు విజయవంతంగా ముగిసింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల తదుపరి వృద్ధి దశకు సంబంధించిన ఏడు కీలక అంశాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ), ప్రభుత్వ ఆర్థిక సంస్థల (పీఎఫ్ఐ) నాయకులు.. సీనియర్ ప్రభుత్వ అధికారులు, రంగ నిపుణుల మధ్య విస్తృత చర్చల అనంతరం ఈ ముగింపు సమావేశం జరిగింది.

రెండో రోజు సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన విలువ గొలుసు మౌలిక సదుపాయాలు, ప్రాధాన్య రంగ రుణాలు, క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆ తర్వాత జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ఏడు అంశాలపై జరిగిన చర్చల ద్వారా రూపుదిద్దుకున్న ఆచరణాత్మక వ్యూహాలు, వినూత్న పరిష్కారాల గురించి వివిధ బృందాలు వివరించాయి. 

ముగింపు సదస్సులో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ఈ సమావేశంలో జరిగిన చర్చలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా స్పష్టమైన ఫలితాలుగా మార్చాల్సిన ఆవశ్యకతను ప్రధానంగా చెప్పారు. భారతదేశంలో మారుతున్న ఆర్థిక అవసరాలకు తగినట్లుగా పీఎస్‌బీలు, పీఎఫ్‌ఐలు సంస్థాగత బలాలను పెంపొందించుకోవాలని.. భవిష్యత్ అవకాశాలను ముందుగానే అంచనా వేసి తగిన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

వ్యవస్థీకృత ఆర్థిక రంగంలోకి వస్తున్న యువజనులతో అనుబంధాన్ని మరింత బలపరచుకోవడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సమన్వయంతో 16 సంవత్సరాలు నిండిన యువత కోసం 2026 అక్టోబర్ 2 నుంచి ఒక నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని పీఎస్‌బీలను ఆర్థిక మంత్రి కోరారు. దీని ద్వారా యువ వినియోగదారులతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా విద్య, ఉపాధి, వ్యవస్థాపకత, పెట్టుబడులు, సంపద సృష్టిలో వారు ముందుకు సాగుతున్న కొద్దీ మారుతున్న ఆర్థిక అవసరాలకు మద్దతుగా నిలవడానికి బ్యాంకులకు వీలవుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా యువత కోసం ఒక సాధారణ ఆన్‌లైన్ పోర్టల్ లేదా అప్లికేషన్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా బ్యాంకింగ్ సేవలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా ఒకే చోట పొందచ్చు. దీనికి అనుబంధంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలు, ఇతర క్యాంపస్‌లలో ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

ప్రాధాన్య రంగ రుణాల (పీఎస్ఎల్) ప్రాముఖ్యతను.. వ్యక్తిగత లక్ష్యాలు, ఉప-లక్ష్యాల విషయంలో లోపాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రముఖంగా చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు నిజమైన, ఉత్పాదకమైన రుణ ప్రవాహం అందేలా చూడాలని తద్వారా రుణ కొరతను తగ్గించాలని సూచించారు. నిశితమైన పర్యవేక్షణ, రానున్న అంతరాలను ముందుగానే గుర్తించడం, తగిన వ్యాపార వ్యూహాల ద్వారా పీఎస్‌బీలు తమ దృష్టిని ప్రాధాన్య రంగ రుణాలపై నిలపాలని కోరారు. 

రెండో రోజు జరిగిన చర్చల్లో భాగంగా ఎఫ్‌పీఓలు, శీతల నిల్వ కేంద్రాలు, ప్రాసెసింగ్, రవాణా, మార్కెట్ అనుసంధానాలతో సహా వ్యవసాయ, ఉద్యానవన విలువ గొలుసులన్నింటిలోనూ రుణాలు అందించడాన్ని బలోపేతం చేసే అవకాశాలను గుర్తించారు. క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించడంపై జరిగిన చర్చల్లో డిజిటల్ ఆన్‌బోర్డింగ్, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు మరిన్ని ఉత్పత్తులను విక్రయించడం, రూపే-యూపీఐ అనుసంధానం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి వ్యూహాలపై దృష్టి సారించారు.  ఈ సదస్సులో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన విలువ గొలుసు మౌలిక సదుపాయాలపై వీఎన్‌ఆర్ గ్రూప్ డైరెక్టర్ సీ.ఏ. అరవింద్ అగర్వాల్, ప్రాధాన్య రంగ రుణాలపై 'టాయ్ జోన్' డైరెక్టర్ శ్రీ సంజయ్ మెహ్‌దిరత్తా తమ తమ వ్యాపార ప్రయాణాల్లోని వాస్తవ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఈ చర్చలకు మరింత ఆచరణాత్మక దృక్పథాన్ని తీసుకొచ్చారు. 

ఈ కాన్‌ఫ్లూయెన్స్ ద్వారా ఏడు అంశాలపై ప్రాధాన్యతలను మరింత స్పష్టంగా గుర్తించగలిగామని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి పేర్కొన్నారు. పీఎస్‌బీలు, పీఎఫ్‌ఐలు ఇప్పుడు స్పష్టమైన బాధ్యతలు, వాస్తవిక కాలపరిమితితో వీటిని అమలులోకి తీసుకురావాలని, విజయవంతమైన సంస్థాగత నమూనాలను విస్తృతంగా ఆచరించటాన్ని పరిశీలించాలని సూచించారు.

పీఎస్‌బీలు, పీఎఫ్‌ఐలు, ప్రభుత్వం, రంగ నిపుణుల సమష్టి అనుభవాలను, సామర్థ్యాలను 'పీఎస్‌బీ కాన్‌ఫ్లూయెన్స్ 2026' ఒకచోట చేర్చింది. ఈ సదస్సులో రూపుదిద్దుకున్న ఆచరణాత్మక వ్యూహాలను ఇకపై సంబంధిత సంస్థలు తగిన అనుసరణ (ఫాలో-అప్), అమలు ద్వారా ముందుకు తీసుకెళ్తాయి. 'వికసిత్ భారత్ 2047' దిశగా దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ఆర్థిక సమ్మిళితత్వాన్ని మరింత లోతుగా విస్తరించడంలో, అభివృద్ధి చెందుతున్న అవకాశాలకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో, దేశం తదుపరి వృద్ధి దశకు మద్దతు ఇవ్వడంలో పీఎస్‌బీలు, పీఎఫ్‌ఐలు తమ కీలక పాత్రను కొనసాగిస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2301198) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada