వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, సింగపూర్ మంత్రుల స్థాయి నాలుగో రౌండ్‌టేబుల్ సమావేశంతో పాటు భారత్, సింగపూర్ నాలుగో వాణిజ్య రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొనడానికి సింగపూర్‌కు బయల్దేరిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

బీ2బీ, జీ2బీ, సంస్థాగత స్థాయి మాటామంతీలో పాలుపంచుకోనున్న
సుమారు 70 మంది సభ్యుల భారతీయ వాణిజ్య ప్రతినిధి వర్గం

ఉన్నత స్థాయి ప్రభుత్వ, వాణిజ్య సమావేశాల్లో పాల్గొననున్న శ్రీ గోయల్..
భారతీయ వ్యావసాయిక ఎగుమతులను ప్రోత్సహించడానికి
‘అపెడా’-ఫేర్‌ప్రైస్ స్టోర్‌ను సందర్శించనున్న మంత్రి

प्रविष्टि तिथि: 19 AUG 2026 10:18AM by PIB Hyderabad

భారత్, సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ (ఐఎస్ఎమ్ఆర్) ప్రాథమిక ప్రణాళికలో భాగంగా ఉన్నత స్థాయి సహకారాన్ని నిరంతరాయంగా కొనసాగించడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేటి నుంచి ఈ నెల 21 వరకు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు.

భారత్, సింగపూర్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ రంగాలకు చెందిన దాదాపు 70 మంది సీనియర్ వాణిజ్య ప్రముఖులతో కూడాన ఒక భారతీయ ప్రతినిధి వర్గం శ్రీ పీయూష్ గోయల్‌తో కలిసి సింగపూర్ వెళ్తోంది. ప్రతినిధి వర్గంలో సాంకేతికత, సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధ (ఏఐ), తయారీ, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరత్వం, ఆర్థిక సహాయ సేవలు, ఫిన్‌టెక్, ఆరోగ్యసంరక్షణ, లైఫ్ సైన్సెస్, ఆహారం, వ్యవసాయం, ఆధునిక వస్తురవాణా వ్యవస్థ, నౌకావాణిజ్యం, వ్యాపార రంగాలకు చెందిన వారితో పాటు వృత్తిప్రధాన సేవల రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
ఈ ప్రతినిధి వర్గం బీ2బీ, జీ2బీ, సంస్థాగత స్థాయికి సంబంధించిన అనేక కార్యకలాపాల్లో పాలుపంచుకొంటుంది. ప్రముఖ ప్రావీణ్య కేంద్రాలు (సీఓఈ)తో మాటామంతీతో పాటు సింగపూర్ నైపుణ్య ప్రదాన సంస్థలను ప్రతినిధి వర్గం సందర్శిస్తుంది. భాగస్వామ్యం, పెట్టుబడి, మార్కెట్ లభ్యత, సాంకేతిక సహకారం, ప్రతిభకు పదును పెట్టడంపై దృష్టి సారించడం ఈ కార్యక్రమాల ముఖ్యోద్దేశం. ఈ పర్యటన కార్యక్రమాన్ని భారత్, సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం, భారత్ సింగపూర్ వాణిజ్య రౌండ్‌టేబుల్ సమావేశాలకు సమానాంతరంగా ఏర్పాటు చేశారు.  
పర్యటన కాలంలో శ్రీ పీయూష్ గోయల్ రేపు, అంటే ఈ నెల 20న భారత్, సింగపూర్ మంత్రుల స్థాయి నాలుగో రౌండ్‌టేబుల్ (ఐఎస్ఎమ్ఆర్) సమావేశంలో పాల్గొంటారు. భారత్, సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (సీఎస్‌పీ) ముందుకు తీసుకుపోవడానికి ఉద్దేశించిన మంత్రుల స్థాయి సర్వోన్నత యంత్రాంగమే ఐఎస్ఎమ్ఆర్. ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని భారత్, సింగపూర్ వాణిజ్య సంబంధిత నాలుగో రౌండ్‌టేబుల్ సమావేశం (ఐఎస్‌బీఆర్)తో పాటే నిర్వహిస్తారు. దీని తరువాత అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ)పై సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఇది పూర్తి అయ్యాక ఐఎస్ఎమ్ఆర్, ఐఎస్‌బీఆర్‌ ప్రతినిధులందరికీ సింగపూర్ ఉప ప్రధాని ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రితో పాటు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ కూడా పాల్గొంటారు. ఈ పర్యటన కాలంలో మంత్రులు సింగపూర్‌‌లో తమ శాఖల బాధ్యతలనే నిర్వహిస్తున్న మంత్రులతోనూ, ఇతర సీనియర్ నేతలతోనూ చర్చిస్తారు.
శ్రీ పీయూష్ గోయల్ ఇస్తానా‌లో సింగపూర్ ప్రధాని శ్రీ లారెన్స్ వోంగ్‌తోనూ భేటీ అవుతారు.
దీంతో పాటు శ్రీ గోయల్.. గ్లోబల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ నెట్‌వర్క్, వైపీఓ గ్లోబల్,  మిల్కెన్ ఇనిస్టిట్యూట్, కెప్పెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెమాసెక్ హోల్డింగ్స్, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌ల సీనియర్ ప్రతినిధులు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్‌బీఎఫ్) చైర్మన్ నాయకత్వంలోని ప్రతినిధి వర్గం, టర్నర్ అండ్ టౌన్‌సెండ్ , ఎస్‌టీటీ జీడీసీ, ఇంకా గవర్నమెంట్-టు-బిజినెస్ (జీ2బీ) సమావేశాలలో కూడా పాల్గొంటారు. ఈ సమావేశాలకు తరువాయిగా ఫ్యామిలీ ఆఫీస్ రౌండ్‌టేబుల్ కార్యక్రమం ఉంటుంది.
మంత్రి.. సింగపూర్‌ విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి అయిన గాన్ సియో హ్యువాంగ్‌తో పాటు సిటీ స్క్వేర్ మాల్‌లో
‘అపెడా’-ఫేర్‌ప్రైస్ స్టోర్‌ను సందర్శిస్తారు. భారతీయ వ్యావసాయిక ఆహార పదార్థాల ఎగుమతులను ప్రోత్సహించడం, సింగపూర్‌ రిటైల్ మార్కెట్టులో వాటి విస్తృతికి దోహదం చేయడం ఈ స్టోర్ ఉద్దేశం. రెండు దేశాల మధ్య వ్యవసాయ, వ్యాపార సంబంధాలను ఈ స్టోర్ పటిష్ఠపరుస్తోంది.
ఐఎన్‌ఎస్ఈఏడీ ఆసియా క్యాంపస్‌లో ఎఫ్ఐసీసీఐ ఏర్పాటు చేసే భారత్, సింగపూర్ బిజినెస్ ఫోరమ్‌లోనూ శ్రీ పీయూష్ గోయల్ పాల్గొంటారు. అక్కడ ‘‘కొత్త అంతర్జాతీయ అభివృద్ధి సమీకరణంలో భారత్: ఆసియాలోనూ, ప్రపంచంలోనూ వాణిజ్యనికి ఉన్న అవకాశం, అభివృద్ధి’’ అంశంపై ఇష్టాగోష్ఠిలో ఆయన పాలుపంచుకుంటారు. తరువాత, భారత్ సింగపూర్ వాణిజ్య సముదాయంతో నెట్‌వర్కింగ్ డిన్నర్ ఉంటుంది.
పర్యటన చివర్లో మెరీనా బే శాండ్స్ ఎక్స్‌పో అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ‘2026 ఐసీఏఐ ఆసియాన్ సమావేశం’లో మంత్రి కీలకోపన్యాసమిస్తారు.
భారత్‌కు సింగపూర్ కీలకమైన ఆర్థిక భాగస్వామి. ప్రధాన పెట్టుబడిదారు కూడా.  2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో సింగపూర్ 19.8 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) పెట్టింది. ఏదైనా విదేశం నుంచి భారత్‌కు భారీ స్థాయిలో తరలివచ్చిన ఎఫ్‌డీఐ ఇదే. 2000 ఏప్రిల్ మొదలు ఈ ఏడాది మార్చి నెల మధ్య కాలంలో సింగపూర్ నుంచి 194.68 బిలియన్ అమెరికా డాలర్ల  విలువైన ఎఫ్‌డీఐ వచ్చింది. ఇది భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలో 24.72 శాతం.
ఆసియాన్‌ పరిధిలో భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కూడా సింగపూర్‌యే. విదేశీ వాణిజ్య రుణాలే కాకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులకు కూడా సింగపూర్ ప్రధాన వనరుగా ఉంటోంది. భారత్, సింగపూర్ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈపీఏ) కుదిరిన తరువాత ద్వైపాక్షిక వాణిజ్యం చెప్పుకోదగిన స్థాయిలో విస్తరించింది. ఇది 2004-05 ఆర్థిక సంవత్సరంలో 6.7 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయి నుంచి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 36.1 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకొంది.
సింగపూర్‌తో వాణిజ్యం, పెట్టుబడితో పాటు రెండు దేశాల ప్రజల పరస్పర సంబంధాలను కూడా పటిష్ట పరుచుకోవడానికి భారత్ కనబరుస్తున్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. భారత్‌కు ఎఫ్‌డీఐల రంగంలో సింగపూర్ అతి పెద్ద వనరుగానే కాకుండా ఆధునిక తయారీ రంగం, డిజిటలీకరణ, నైపుణ్యాల అభివృద్ధితో పాటు హరిత ఆర్థిక వ్యవస్థలో ఓ కీలక భాగస్వామిగా కూడా ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2301193) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil