ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సమర్థ పాలన.. లబ్ధిదారులకు సముచిత లబ్ధి దిశగా కచ్చితమైన సమాచారం అవశ్యం: ఉపరాష్ట్రపతి

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం డిజిటల్ లావాదేవీలను వేగిరపరచి సమాంతర ఆర్థిక వ్యవస్థ అదుపులో దోహదం చేసింది”

“సామాజిక వాస్తవాలపై అవగాహనలో గణాంకవేత్తలకు క్షేత్రస్థాయి అనుభవం కీలకం”

సమాచార ఆధారిత పాలన వ్యవస్థ రూపకల్పనలో ‘ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్’ అధికారులదే ప్రధాన పాత్ర:
‘ఐఎస్ఎస్ ఓటీ’లతో ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 18 AUG 2026 7:27PM by PIB Hyderabad

   పరాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్‌ను ఇవాళ ఆయన సచివాలయంలో ‘ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్’ (ఐఎస్‌ఎస్‌) 2026 బ్యాచ్‌ శిక్షణార్థి అధికారులు కలుసుకున్నారు. ఈ బృందంలోని 34 మందిలో 16 మంది మహిళలున్నారు. ఈ సందర్భంగా యువ అధికారులతో మాట్లాడుతూ- ఈ ప్రతిష్టాత్మక సర్వీస్‌లో చేరినందుకు ఉపరాష్ట్రపతి వారిని అభినందించారు. ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగడమన్నది వారి సాధికారత నుంచి మహిళల సారథ్యంలో ప్రగతి వైపు భారత్‌ ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

నిర్దిష్ట, విశ్వసనీయ సమాచారం కీలక పాత్రను స్పష్టం చేస్తూ- “సమాచారం కచ్చితంగా లేకపోతే ఏ అంశంపైనా సరైన నిర్ణయం సాధ్యం కాదు” అని శ్రీ సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అంటే- విశ్వసనీయ సమాచారం లేకుండా సమర్థ ప్రణాళిక, సముచిత వనరుల కేటాయింపు, ప్రభుత్వ పథకాల అమలు వంటివి అసాధ్యమని ఆయన ప్రస్ఫుటం చేశారు. అర్హులైన లబ్ధిదారులను సవ్యంగా గుర్తించలేని పక్షంలో అమూల్య వనరులు కూడా వృథా అయ్యే ముప్పుందని వివరించారు. కాబట్టి, “నిర్దిష్ట, విశ్వసనీయ సమాచారాన్ని సేకరించి, సరైన సమయంలో అందుబాటులోకి తేవాలి” అని స్పష్టం చేశారు. ప్రాథమిక సమాచారం లోపభూయిష్టమైతే, జాతీయ సమస్యలకు సరైన పరిష్కారాన్వేషణ అసాధ్యమని ఆయన హెచ్చరించారు.

అధికారిక గణాంకాలు కేవలం సంఖ్యలకు పరిమితం కాదని, దేశం-ప్రజలు, వివిధ సామాజిక వర్గాల స్థితిగతులపై అవగాహన దిశగా పరిపాలనకు అవి ఉపకరణాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలు కోసం క్షేత్రస్థాయి అనుభవం, కచ్చితమైన సమాచార సేకరణ, సముచిత నిర్వహణ, సకాల సమర్పణ అత్యావశ్యకాలని ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఉద్దేశించిన ప్రయోజనం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడటంలో గణాంకవేత్తల కీలక పాత్రను వివరించారు. ఈ మేరకు “ఒక పథకం విజయం లేదా వైఫల్యం సమాచార నాణ్యతపైనే గణనీయంగా ఆధారపడి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

డిజిటల్ డేటాబేస్‌లు, జీఎస్టీ డేటా, హై-ఫ్రీక్వెన్సీ ఆర్థిక సమాచారం సహా దేశ గణాంక, పరిపాలన సమాచార వ్యవస్థ బలోపేతాన్ని శ్రీ సి.పి.రాధాకృష్ణన్ ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ లావాదేవీలలో పరిణామశీల మార్పులను ప్రస్తావిస్తూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దార్శనిక నాయకత్వం వాటి వ్యాప్తికి ఎంతగానో దోహదం చేసిందన్నారు. తద్వారా సమాంతర ఆర్థిక వ్యవస్థ అదుపు సాధ్యమైందని ఆయన అన్నారు. ఆర్థిక గణనకు సరైన ఆధార సంవత్సరాల ప్రాధాన్యాన్ని, దేశ వాస్తవ వృద్ధిని కచ్చితంగా అంచనా వేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్ఫుటం చేశారు. అంతేకాకుండా, కేవలం ఆర్థిక సూచీలు మాత్రమే మానవ శ్రేయస్సు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేవని, జీవితానందం-నాణ్యత వంటి అంశాలు కూడా కీలకమేనని విశదం చేశారు.

“విశ్వసనీయ సమాచారం ద్వారానే గణాంకాలకు విలువ ఏర్పడుతుంది” అని ఉద్ఘాటిస్తూ-  యువ అధికారులు వృత్తిగత-నైతిక సమగ్రతతో పాటు రాజకీయ తాటస్థ్యం, గోప్యత, నిష్పాక్షికతలను అనుసరించాలని ఉపరాష్ట్రపతి ఉద్బోధించారు. కేవలం సంప్రదాయబద్ధ సంకేతాలు కాకుండా సామర్థ్యం-బాధ్యతలను చిత్తశుద్ధితో మేళవించాలని సూచించారు.  ఉన్నతాధికార స్థానాలపై వాస్తవిక గౌరవానికి అధికారులు ప్రతీకలని ఆయన అన్నారు. నిరంతర అభ్యాసాన్ని అలవాటుగా మార్చుకుంటూ, క్షేత్రస్థాయి అనుభవంతో ప్రయోజనం పొందాలని చెప్పారు. ఆ మేరకు ఉన్నతాధికారులు, సహోద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

వృత్తిగత స్వేచ్ఛపై ఎన్నడూ రాజీ పడవద్దని చెబుతూ- జిజ్ఞాస, పట్టుదలతో నవ్యావిష్కరణలకు యువ అధికారులు సిద్ధం కావాలని శ్రీ సి.పి.రాధాకృష్ణన్ కోరారు. వికసిత భారత్-2047 కోసం పటిష్ట గణాంక వ్యవస్థ రూపకల్పన దిశగా “ప్రగతి సమాచారం, సమాచార ఆధారిత” నిర్ణయాలు కీలకమన్నారు. ప్రస్తుత బ్యాచ్ అధికారులు ‘ఐఎస్‌ఎస్‌’ ఉత్తమ సంప్రదాయాలను నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు విస్పష్ట ప్రయోజనాలు అందించే సమాచార ఆధారిత వ్యవస్థకు అర్థవంతంగా దోహదపడగలరని విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గణాంక-కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్‌ సౌరభ్ గార్గ్, డేటా గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ పి.ఆర్.మేష్రామ్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2301046) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam