కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖతార్ పోస్ట్ కేంద్రాల్లో భారత్ కు యూపీఐ ఆధారిత పోస్‌ట్రాన్స్‌ఫర్ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చిన పోస్టల్‌ నగదు బదిలీ సౌకర్యం


కొత్త డిజిటల్ తపాలా నిధుల బదిలీ సేవ ద్వారా ఖతార్ నుంచి భారత్ కు వేగంగా, సురక్షితంగా, సులభంగా డబ్బు పంపే అవకాశం

प्रविष्टि तिथि: 17 AUG 2026 4:20PM by PIB Hyderabad

యుపిఐ ఆధారిత పోస్‌ట్రాన్స్‌ఫర్ వ్యవస్థపై పనిచేసే ఖతార్ - భారత్ నిధుల బదిలీ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ఖతార్‌లోని వినియోగదారులు ఖతార్ పోస్ట్ అవుట్‌లెట్ల నుంచి నేరుగా భారతదేశంలోని యుపిఐ సదుపాయం ఉన్న బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు పంపవచ్చు. 

ఖతార్ పోస్ట్, ఇండియా పోస్ట్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇంటర్ కనెక్షన్ ప్లాట్‌ఫామ్ (యూపీయూ - ఐపీ), ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్)ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సర్వీసును అభివృద్ధి చేశారు. ఈ కార్యక్రమం విస్తృతమైన పోస్టల్‌ నెట్‌వర్క్‌ను భారత డిజిటల్‌ మౌలిక వసతులతో అనుసంధానించడం ద్వారా అంతర్జాతీయ నగదు బదిలీలకు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన మార్గాన్ని అందిస్తుంది.

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 15న ఖతార్‌లో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయ ఛార్జ్‌ డి అఫైర్స్‌ హెచ్‌.ఈ. సందీప్‌ కుమార్‌ దోహాలోని లులు మాల్‌లో ఉన్న ఖతార్‌ పోస్టు కేంద్రాన్ని సందర్శించి, సంబంధిత భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్‌ - ఖతార్ తార్‌ మధ్య డిజిటల్‌ ఆర్థిక అనుసంధానాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ చొరవ ప్రాధాన్యాన్ని వివరించారు.  

 

  

 

ఖతార్‌లో యూపీఐ ఆధారిత పోస్‌ట్రాన్స్‌ఫర్‌ నగదు బదిలీ సేవ

ఈ సేవ కింద, ఖతార్‌ పోస్టు కేంద్రంలో కస్టమర్లు భారత్‌లోని నగదు స్వీకర్తకు సంబంధించిన యూపీఐ ఐడీతో పాటు అవసరమైన గుర్తింపు వివరాలను అందించి నగదు బదిలీని ప్రారంభించవచ్చు. విదేశాల నుంచి యూపీఐ ద్వారా నగదు స్వీకరించేందుకు గ్రహీత తాను ఉపయోగిస్తున్న యూపీఐ యాప్‌లో ఈ సదుపాయాన్ని యాక్టివేట్‌ చేసుకోవాలి. సదుపాయం యాక్టివేట్‌ అయిన వెంటనే, నగదు గ్రహీతకు చెందిన యూపీఐ సదుపాయం ఉన్న బ్యాంకు ఖాతాలో తక్షణమే జమ అవుతుంది.

ఒక్కో  లావాదేవీకి కనిష్ఠంగా 10 ఖతార్‌ రియాల్స్‌ నుంచి గరిష్ఠంగా 4,000 ఖతార్‌ రియాల్స్‌ వరకు నగదు బదిలీ చేయవచ్చు. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ.1,00,000కు సమానమైన మొత్తంగా ఉంటుంది. ప్రతి లావాదేవీపై 15 ఖతార్‌ రియాల్స్‌ స్థిర సేవా రుసుము వర్తిస్తుంది.

ఖతార్‌లో పెద్ద సంఖ్యలో భారతీయులకు ఈ సేవ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భారత్‌లోని తమ కుటుంబాలకు నగదు పంపేందుకు విశ్వసనీయమైన, సులభంగా అందుబాటులో ఉండే, తక్కువ వ్యయంతో కూడిన మార్గాన్ని ఇది అందిస్తుంది. పోస్టల్‌ నెట్‌వర్క్‌ల అందుబాటును యూపీఐ సాంకేతిక సామర్థ్యాలతో అనుసంధానించడం ద్వారా ఈ చొరవ ఆర్థిక సమ్మిళితత్వాన్ని మరింత పెంచడంతో పాటు, భారత్‌ - ఖతార్‌ మధ్య సులభతరమైన డిజిటల్‌ ఆర్థిక అనుసంధానానికి దోహదం చేస్తుంది.

ఖతార్ - భారత్‌ నగదు బదిలీ సదుపాయం అంతర్జాతీయ పోస్టల్‌ ఆర్థిక సేవల ఆధునికీకరణలో, అలాగే భారత్‌ - ఖతార్ మధ్య డిజిటల్‌ ఆర్థిక సహకారంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. యూపీయూ - ఐపీని యూపీఐతో అనుసంధానించడం -  అందరికీ అందుబాటులో ఉండే సమర్థవంతమైన , అంతర్జాతీయ ఆర్థిక సేవలు అందించడంలో పోస్టల్‌ నెట్‌వర్క్‌లు, డిజిటల్‌ మౌలిక సదుపాయాల అపారమైన సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది. 

యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ ఇంటర్‌కనెక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ (యూపీయూ - ఐపీ)ను భారత యూపీఐ వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా యూపీఐ ఆధారిత పోస్‌ట్రాన్స్‌ఫర్‌ సేవ అందుబాటులోకి వచ్చింది. ఈ సేవ ద్వారా భాగస్వామ్య పోస్టల్‌ సంస్థలు, భారత్‌లోని యూపీఐ సదుపాయం ఉన్న బ్యాంకు ఖాతాలకు సులభంగా, సురక్షితంగా నగదు పంపే సదుపాయాన్ని తమ వినియోగదారులకు అందించగలుగుతాయి.

ఇతర దేశాల పోస్టల్‌ సంస్థలతో  కలిసి యూపీఐ ఆధారిత పోస్‌ట్రాన్స్‌ఫర్‌ సేవను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు భారత తపాలా శాఖ కృషి చేస్తోంది. తద్వారా విదేశాల్లోని భారతీయ ప్రవాసులకు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుంది.

***


(रिलीज़ आईडी: 2300549) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Urdu , Marathi , Bengali , Gujarati