కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత తపాలా ద్వారా తొలి డ్రోన్ ఆధారిత డెలివరీని ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

తొలి డెలివరీగా తిరంగాను డెలివరీ చేసిన డ్రోన్

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా... హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ప్రధాన తపాలా కార్యాలయం నుంచి రెహార్ధర్ శాఖా కార్యాలయానికి డ్రోన్ ద్వారా త్రివర్ణ పతాకాన్ని చేరవేసిన తపాలా శాఖ

प्रविष्टि तिथि: 14 AUG 2026 7:46PM by PIB Hyderabad

దేశభక్తి, ప్రజాసేవ, సాంకేతిక ఆవిష్కరణల అద్వితీయ కలయికగా తపాలా శాఖ... హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ప్రధాన తపాలా కార్యాలయం నుంచి రెహార్ధర్ శాఖా కార్యాలయానికి డ్రోన్ ద్వారా జాతీయ జెండా (తిరంగా)ను చేరవేసింది. భారత తపాలా శాఖ డ్రోన్ ద్వారా చేసిన తొలి డెలివరీ ఇదే.

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజున... కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈ కార్యక్రమాన్ని వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారు. మండీ ప్రధాన తపాలా కార్యాలయం నుంచి డ్రోన్ టేకాఫ్ అవ్వడాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన కేంద్ర మంత్రి... తపాలా అధికారులు, డ్రోన్ ఆపరేటర్‌తో సంభాషించారు. అనంతరం ఆ డ్రోన్ రెహర్ధర్ శాఖా కార్యాలయంలో దిగింది. అక్కడి తపాలా బృందం ఈ త్రివర్ణ పతాకం ఉన్న పార్సిల్‌ను స్వీకరించి, దానిని మాజీ సైనికునికి లాంఛనంగా అందజేశారు. ఈ కార్యక్రమం ఆ సందర్భానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను జోడించింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్ ఆకాశంలో సాగిన ఈ 'తిరంగా' (జాతీయ జెండా) ప్రయాణం, భౌగోళిక పరిమితులను అధిగమించి ప్రతి పౌరుడినీ చేరుకోవాలనే సంకల్పంతో ఉన్న నవ భారత స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఇది జాతీయ గౌరవం, సేవా భావం, 'వికసిత్ భారత్'  పట్ల భారత ఆకాంక్షలను ఏకం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిలో మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడి హృదయంలోనూ నిలిచి ఉండాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో, దేశవ్యాప్తంగా పౌరులకు జాతీయ పతాక డెలివరీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారతీయ తపాళా శాఖ 'హర్ ఘర్ తిరంగా' ప్రచారానికి తన వంతు తోడ్పాటునందిస్తోంది. తద్వారా ప్రజలు తమ ఇళ్ల నుంచే ఈ జాతీయ గౌరవానికి సంబంధించిన వేడుకల్లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తోంది.

మండీ నుంచి రెహార్ధర్ వరకు జరిగిన డ్రోన్ డెలివరీ... అభివృద్ధి చెందుతున్న సాంకేతికత విస్తృతమైన భారతీయ తపాలా నెట్‌వర్క్‌కు ఎలా తోడ్పడగలదో... ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, చేరుకోవడానికి కష్టతరమైన భూభాగాలకూ అనుసంధానాన్ని ఎలా బలోపేతం చేయగలదో నిరూపిస్తుంది. డ్రోన్ ఆధారిత మెయిల్ డెలివరీని ఉపయోగించడం ద్వారా... సాంప్రదాయిక రవాణా మార్గాలు సవాళ్లను ఎదుర్కొంటున్న చోట తపాలా, ప్రజా సేవలను పౌరులకు చేరవేసేందుకు తపాలా శాఖ వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తోంది.

సాంకేతికంగా అభివృద్ధి చెందిన, సమ్మిళితమైన, అనుసంధానితమైన వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా... హిమాచల్ ప్రదేశ్, అస్సాంలో గుర్తించిన 150 మార్గాల్లో డ్రోన్ ఆధారిత మెయిల్ డెలివరీని అమలు చేయడానికి తపాలా శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమం, చేరుకోవడం కష్టతరమైన భూభాగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, సమర్థమైన మెయిల్ డెలివరీని సులభతరం చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది "డాక్ సేవ, జన సేవ" శాశ్వత స్ఫూర్తిని... పౌరులను అనుసంధానించడానికి, దేశానికి సేవ చేయడానికి ఆవిష్కరణలు, సాంకేతికతను ఉపయోగించే దాని నిరంతర ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2299651) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Gujarati , Tamil