సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఢిల్లీ.. ఎర్రకోటలో 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ‘విశిష్ట అతిథులు’గా రండి
పీఎమ్ విశ్వకర్మ లబ్ధిదారులకు ఆహ్వానం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని తిలకించనున్న 100 మంది ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంత లబ్ధిదారులు
प्रविष्टि तिथि:
14 AUG 2026 10:45AM by PIB Hyderabad
రేపు, అంటే 2026 ఆగస్టు 15న ఢిల్లీ.. ఎర్రకోటలో నిర్వహించే 80వ స్వాతంత్య్ర దినోత్సవంలో ‘విశిష్ట అతిథులు’గా కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా పీఎమ్ విశ్వకర్మ పథకానికి చెందిన 100 మంది ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంత లబ్ధిదారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
విశిష్ట అతిథులుగా ఆహ్వానించిన వారిలో వివిధ సాంప్రదాయిక వృత్తులను అనుసరిస్తున్న మహిళా కళాకారులు కూడా ఉన్నారు. ఇది మహిళలకు ఆర్థిక సాధికారతను కల్పించడం, ఉపాధి కల్పనలో వారి భాగస్వామ్యం అంతకంతకూ పెరుగుతుండడంతో పాటు భారత సుసంపన్న హస్తకళలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో మహిళల భూమికను పటిష్ఠపరచడంలో పీఎమ్ విశ్వకర్మ పథకం అందిస్తున్న తోడ్పాటును సూచిస్తోంది.
లబ్ధిదారులకు గుర్తింపు, అభినందనలు
పీఎమ్ విశ్వకర్మ పథకంలో లబ్ధిదారుల భాగస్వామ్యంలో భాగంగా భారత సాంప్రదాయ హస్తకళలు, సాంస్కృతిక వారసత్వానికి వారు చేస్తున్న సేవలకు గుర్తిస్తూ, 2026 ఆగస్టు 14న ఢిల్లీ.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ (ఎమ్ఎస్ఎమ్ఈ) అధికారులతో మాటామంతీని నిర్వహించనున్నారు. ఆ తరువాత, లబ్ధిదారులకు ప్రశంసపూర్వకంగా సావనీర్లను అందజేస్తారు.
పీఎమ్ విశ్వకర్మ పథకం గురించి..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో పీఎమ్ విశ్వకర్మ పథకం ఒకటి. సాంప్రదాయిక హస్తకళ వృత్తులలో నిమగ్నమై, చేతులను ఉపయోగించి కళాఖండాలను రూపొందించే, అలంకరణ వస్తువులను తీర్చిదిద్దే మహిళా కళాకారులకు విస్తృత సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం నైపుణ్యాలను పెంపొందించడం, ఆధునిక పనిముట్లను అందించడం, ఆర్థికసాయం చేయడం, డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడమెలాగో నేర్పించడం, మార్కెట్టుతో సంబంధాలను బలోపేతం చేయడం వంటి వాటి ద్వారా తోడ్పాటును అందిస్తుంది. చేతివృత్తి కళాకారుల సామాజిక, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం, సాంప్రదాయిక హస్తకళలను పటిష్ఠపరచడం, దీర్ఘకాల ప్రాతిపదికన జీవనోపాధికి మార్గాన్ని సుగమం చేయడం ఈ పథకం లక్ష్యాలు. ఇప్పటి వరకూ 30 లక్షల మంది సాంప్రదాయిక చేతివృత్తి కళాకారులను ఈ పథకంలో చేర్చుకున్నారు.
భారతదేశ సాంప్రదాయిక చేతివృత్తి కళాకారుల సేవలకు గౌరవం
పీఎమ్ విశ్వకర్మ యోజన పరిధిలోకి వచ్చే 18 భారత సాంప్రదాయిక చేతివృత్తులతో ముడిపడిన వారికి ఆహ్వానాలను పంపించారు. వారిలో కుట్టుపనివారు, వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరులు, తాళాల తయారీదారులు సహా ఇతర వృత్తులకు చెందిన వారు ఉన్నారు. వీరు ఈ పథకంలో నమోదై మౌలిక నైపుణ్య శిక్షణ, ఉపకరణాలను అందుకోవడం సహా ఇతర ప్రయోజనాలనూ అందుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవంలో పీఎమ్ విశ్వకర్మ లబ్ధిదారులు పాల్గొనడం భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి సాంప్రదాయిక చేతివృత్తిదారులు అందిస్తున్న అమూల్య సేవలను గౌరవించుకొనే సందర్భమని చెప్పవచ్చు. అంతేకాదు, వారిని ఎర్రకోటకు ఆహ్వానించడమంటే అది దేశ 80వ స్వాతంత్య్రదినోత్సవ గొప్పదనాన్ని కనులారా చూసేందుకూ, ఈ చరిత్రాత్మక జాతీయ ఉత్సవంలో పాలుపంచుకొనేందుకూ ఒక చక్కని అవకాశాన్ని వారికి అందజేసినట్లు కూడా అవుతుంది.
పీఎమ్ విశ్వకర్మ పథకాన్ని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ కింది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగలరు:
***
(रिलीज़ आईडी: 2299379)
आगंतुक पटल : 3