హోం మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల సంపూర్ణ నిర్మూలనలో కీలక ముందడుగు
పరారీలో ఉన్న డ్రగ్ కింగ్‌పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి రప్పించడంలో విజయం సాధించిన ఎన్‌సీబీ
బసోయా అరెస్టు వివరాలను పంచుకున్న కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
విదేశాల్లో దాక్కున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల ఆచూకీ కనిపెట్టి భారత్‌కు రప్పిస్తున్న మోదీ ప్రభుత్వం
కఠిన విధానంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తున్న మోదీ ప్రభుత్వం
'ఆపరేషన్ గ్లోబల్-హంట్' ద్వారా భారత్‌కు అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లర్ వీరేందర్ సింగ్ బసోయా
మాదకద్రవ్యాల స్మగ్లర్లు ఎక్కడ దాక్కున్నా, సమగ్ర సమాచారంతో వారి ఆచూకీ కనిపెడుతున్న ఏజెన్సీలు
భారత చట్టాల పంజా నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు తప్పించుకోలేరని మరోసారి నిరూపించిన భారత ఏజెన్సీలు
प्रविष्टि तिथि:
14 AUG 2026 12:31PM by PIB Hyderabad
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కీలక ముందడుగు వేసింది. ఢిల్లీలోని సరోజినీ నగర్, పిల్లంజి ప్రాంతానికి చెందిన... వీరేందర్ సింగ్ బసోయా (అలియాస్ వీరూ, అలియాస్ బసోయా)ను భారత్‌కు రప్పించడంలో ఈ సంస్థ విజయం సాధించింది. వీరూ.. మాదకద్రవ్యాల కేసులో పరారీలో ఉన్న నిందితుడిని ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి చేరుకోగానే సంబంధిత అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఎన్‌సీబీ అభ్యర్థన మేరకు జారీ చేసిన ఇంటర్‌పోల్ 'రెడ్ నోటీసు' ఆధారంగా, జూన్ 2026లో బసోయాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అరెస్టు చేశారు. యూఏఈ అధికారులతో భారతీయ ఏజెన్సీల నిరంతర సమన్వయం ద్వారా అతన్ని తిరిగి భారత్ తీసుకురావడం సాధ్యమైంది.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్టులో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు... “మోదీ ప్రభుత్వం విదేశాల్లో దాక్కున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లను వెతికి పట్టుకుంటూ, వారి వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తోంది. మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించే విధానంలో ముందడుగు వేస్తూ, పరారీలో ఉన్న డ్రగ్ కింగ్‌పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యూఏఈ నుంచి తిరిగి భారత్‌కు రప్పించడంలో ఎన్‌సీబీ విజయం సాధించింది. ఈ నేరస్థుని గురించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, అదుపులోకి తీసుకోవడం ద్వారా... మాదకద్రవ్యాల స్మగ్లర్లు ఎక్కడ దాక్కున్నా, భారత చట్టం బారి నుంచి వాళ్లుతప్పించుకోలేరని మన ఏజెన్సీలు మరోసారి నిరూపించాయి.”
కేసు గురించి
2024 ఫిబ్రవరి నెలలో పూణే నగర పోలీసులు 500 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసు పూణేలో ప్రారంభమైంది. ఆ తర్వాత, సమగ్ర దర్యాప్తు పద్ధతిని అనుసరించి మొత్తం మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను గుర్తించి, నిర్మూలించడం లక్ష్యంగా దర్యాప్తును విస్తరించారు. తదుపరి దర్యాప్తు, అనుసరణ చర్యల ఫలితంగా పూణేలో సుమారు 867 కిలోల మెఫెడ్రోన్, ఢిల్లీలో 970 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్వాధీనం చేసుకున్న మొత్తం మెఫెడ్రోన్ పరిమాణం సుమారు 1,837 కిలోలకు చేరింది. తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసును ఎన్‌సీబీ ముంబయి జోనల్ యూనిట్‌కు బదిలీ చేశారు.
విచారణలో బసోయాను కీలక విదేశీ ఆపరేటివ్‌గా, కుట్రదారుడిగా గుర్తించారు. విదేశాల నుంచి సిండికేట్ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, భారత్ నుంచి ఇతర దేశాలకు మెఫెడ్రోన్ సరుకు ఎగుమతిని బసోయా సులభతరం చేశాడు. ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న సుమారు 970 కిలోల మెఫెడ్రోన్, అతనితో సంబంధం ఉన్న కొరియర్ మార్గాల ద్వారా ఎగుమతి చేయడానికి సంబంధించినదనే ఆరోపణలు ఉన్నాయి. దేశీయ అక్రమ తయారీ, అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దాని విదేశీ పంపిణీ మార్గాలతో అనుసంధానించడంలో బసోయా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆధారాలు లభించాయి.
అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణాకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వద్ద గల మరో కేసులోనూ బసోయా పేరు ఉంది. అక్టోబర్ 2024లో, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఒక ప్రధాన మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను ఛేదించింది. దీని ఫలితంగా ఢిల్లీ, హాపూర్, ఘజియాబాద్‌లోని పలు గోదాములు, ఇతర ప్రాంగణాలతో పాటు గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీ నుంచి పలుమార్లు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమన్వయ కార్యకలాపాల ఫలితంగా 1,300 కిలోగ్రాములకు పైగా కొకైన్, మెఫెడ్రోన్, హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై చేసిన దర్యాప్తులో... ఈ కొకైన్, ఇతర మాదకద్రవ్యాల సేకరణ, రవాణా, నిల్వ, పంపిణీని సమన్వయం చేయడంలో బసోయా పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
విదేశీ అధికార పరిధుల్లో పనిచేస్తున్న ప్రధాన మాదకద్రవ్యాల స్మగ్లర్లు, పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, వారి ఆచూకీ కనుగొని, అదుపులోకి తీసుకోవడం కోసం ప్రారంభించిన 'ఆపరేషన్ గ్లోబల్-హంట్' కింద... ఎన్‌సీబీ నిరంతర కృషితో బసోయాను భారత్‌కు రప్పించగలిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు సహా అంతర్జాతీయ సహకార యంత్రాంగాలనూ ఉపయోగించుకున్నారు. చట్టాలను అమలు చేసే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కార్యాచరణ సమన్వయాన్నీ ఇది బలపరించింది. ఇంతకుముందు టర్కీ నుంచి మహమ్మద్ సలీం డోలా, మలేషియా నుంచి నవీన్ చిచ్కర్ వంటి ఇతర వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్లను విజయవంతంగా భారత్‌కు రప్పించడం ఈ కార్యక్రమం కింద సాధించిన ముఖ్యమైన విజయాలే.
గౌరవ కేంద్ర హోంమంత్రి ఆవిష్కరించిన మాదక ద్రవ్యాల నియంత్రణ సంబంధిత విజన్ డాక్యుమెంట్ (2026–2029)కు అనుగుణంగా... పరారీలో ఉన్న నేరస్థులు వారి నేరాలకు తగిన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొనేలా వారిని తిరిగి భారత్‌కు తీసుకువస్తున్నారు. ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా, ఇతర జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో సమన్వయ చర్యల ద్వారా... విదేశాల నుంచి పనిచేస్తున్న ఇతర ముఖ్యమైన మాదకద్రవ్యాల కేసులకు సంబంధించి పరారీలో ఉన్న నేరస్థులను గుర్తించి, వారి ఆచూకీ కనుగొని, వారిని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శనంలో... మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలనే భారత ప్రభుత్వ విధానం పట్ల ఎన్‌సీబీ దృఢమైన నిబద్ధతతో ఉంది.
భారత్‌లో గానీ, విదేశాల్లో గానీ పనిచేస్తున్న డ్రగ్ ముఠాలు, డబ్బు సమకూరుస్తున్నవాళ్లూ, మధ్య వర్తులు, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం ఎన్‌సీబీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2299378)
आगंतुक पटल : 9