వ్యవసాయ మంత్రిత్వ శాఖ
జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ఎన్ఎస్‌పీ - డీబీటీ ద్వారా 6,000 మందికి పైగా వ్యవసాయ విద్యార్థులకు రూ.21.35 కోట్ల ఉపకార వేతనాలు
వ్యవసాయ విద్యలో ఆచరణాత్మక శిక్షణ, సకాలంలో సహకారం, ఆవిష్కరణలకు ప్రాధాన్యం: శ్రీ చౌహాన్
పరీక్షలు, ప్రవేశాలు, చెల్లింపులు అన్నీ సకాలంలో జరగాలి - సమర్థవంతమైన వ్యవస్థకు అదే అసలైన పరీక్ష : శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యవసాయ రంగంలో అసలైన నైపుణ్యం తరగతి గదుల్లోనే కాకుండా ఆచరణాత్మక శిక్షణ ద్వారా కూడా లభిస్తుంది: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
పొలాలు, రైతులు, శాస్త్రవిజ్ఞానం సమన్వయంతోనే భారత ఆహార భద్రత, స్వావలంబన మరింత బలోపేతం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో ఆహార భద్రత, పోషకాహారం, రైతుల ఆదాయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం కొనసాగుతోంది: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
హరియాలి అమావాస్య సందర్భంగా దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ సంస్థల్లో మొక్కల నాటే కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ విద్యార్థులకు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి
నాడు పోస్టు చేయడమైనది:
10 AUG 2026 8:42PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పూసాలోని ఐసీఏఆర్-ఐఏఆర్ఐలో జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పీ) ద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫెలోషిప్ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద 6,000 మందికి పైగా విద్యార్థులకు మొత్తం రూ.21.35 కోట్లను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానం ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
విద్యార్థులకు సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక సహాయం అందేలా కొత్త కార్యక్రమం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతి నెలా స్కాలర్‌షిప్ మొత్తాన్ని డీబీటీ విధానం ద్వారా నేరుగా అందించనున్నారు.
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ చౌహాన్ మాట్లాడుతూ, స్కాలర్‌షిప్‌లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వ్యవసాయ విద్యను బలోపేతం చేయడంతో పాటు దానిని ఆచరణాత్మక శిక్షణ, మరిన్ని అవకాశాలతో అనుసంధానించేందుకు అవి కీలక సాధనాలని అన్నారు. డీబీటీ విధానం ద్వారా విద్యార్థులకు సకాలంలో ఆర్థిక సహాయం అందుతుందని, సంప్రదాయ విధానాల్లో ఉండే జాప్యాలను తొలగించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి శ్రీ చౌహాన్ మాట్లాడుతూ, వ్యవసాయ విద్యలో ఆచరణాత్మక శిక్షణ ప్రాధాన్యాన్ని వివరించారు. కేవలం తరగతి గదుల్లో బోధించే విద్యతోనే మంచి రైతులు, శాస్త్రవేత్తలు లేదా వ్యవసాయ పారిశ్రామికవేత్తలను తయారు చేయలేమని, వ్యవసాయ రంగంలో అసలైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్షేత్రస్థాయి శిక్షణ ఎంతో అవసరమని అన్నారు. వ్యవస్థలో మరింత మెరుగుదలకు సూచనలు, ఆలోచనలను పంచుకోవాలని ఆయన విద్యార్థులను కోరారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో వ్యవసాయ రంగంలో ఆహార భద్రత, పోషకాహారం, రైతుల ఆదాయ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని శ్రీ చౌహాన్ అన్నారు. ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సేవలను ప్రశంసిస్తూ, వారి పరిశోధనలతో పాటు రైతుల కృషి కూడా దేశ ఆహార ధాన్యాల నిల్వలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.
యువత తమ కెరీర్‌కే పరిమితం కాకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశానికి అర్థవంతమైన సేవ చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. వ్యవసాయ విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, పరిశోధనలకు నాయకత్వం వహించాలని ఆయన సూచించారు.
ఎన్ఎస్‌పీ - డీబీటీ విధానం ద్వారా స్కాలర్‌షిప్‌ల పంపిణీ మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా జరుగుతుందని శ్రీ చౌహాన్ అన్నారు. సకాలంలో ఆర్థిక సహాయం అందడం వల్ల విద్యార్థులు తమ విద్యపై మరింత సమర్థవంతంగా దృష్టి కేంద్రీకరించగలరని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ విద్యను సాంకేతికత, శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
హరియాలి అమావాస్య సందర్భంగా దేశవ్యాప్తంగా ఐసీఏఆర్ సంస్థల్లో మొక్కల నాటే కార్యక్రమాల్లో పాల్గొనాలని వ్యవసాయ విద్యార్థులకు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ రెండింటి పట్ల సమష్టి బాధ్యతలో భాగంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్, ఐసీఏఆర్ కార్యదర్శి శ్రీ జ్ఞానేంద్ర త్రిపాఠి, డీడీజీ డాక్టర్ యశ్‌పాల్ సింగ్ మాలిక్, ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఐసీఏఆర్, ఐఏఆర్ఐకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. వేలాది మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2297437)
సందర్శకుల సూచీ సంఖ్య : : 90