పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2015లో... 523 ఆసియా సింహాలు, 2025 నాటికి 891

అటవీ అధికారులు, సంరక్షకులు, స్థానిక ప్రజల అంకిత భావానికి సూచిక: శ్రీ భూపేందర్ యాదవ్

‘ప్రపంచ సింహాల దినోత్సవం’ సందర్భంగా వన్యప్రాణి, జీవవైవిధ్య సంరక్షణ పట్ల భారత్ నిబద్ధతను

పునరుద్ఘాటించిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 12:02PM by PIB Hyderabad

‘2026 ప్రపంచ సింహాల దినోత్సవం’ సందర్భంగా సింహాల సంరక్షణలో భారత్ సాధిస్తున్న అసాధారణ ప్రగతిని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రశంసించారు. వన్యప్రాణులనీ, జీవ వైవిధ్యాన్నీ పరిరక్షించడానికి దేశం కనబరుస్తున్న తిరుగులేని నిబద్ధతను మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2015
లో 523 ఆసియా సింహాలు ఉంటే, 2025లో అవి 891కి వృద్ధి చెందాయని సామాజిక మాధ్యమ సందేశంలో మంత్రి తెలిపారు. ఈ ఘనత అటవీ అధికారులు, సంరక్షకులు, స్థానిక ప్రజలతో పాటు సింహ జాతులను సంరక్షించడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిదీ అని ఆయన అన్నారు.
ఆసియా సింహాల సంరక్షణలో భారత్ సాధించిన ఈ విజయం వన్యప్రాణి, జీవవైవిధ్య సంరక్షణ పట్ల భారత్ కనబరుస్తున్న నిబద్ధతకు నిదర్శనమని శ్రీ యాదవ్ అన్నారు. భారత ప్రాకృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తామన్న సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటిస్తూ, ఆసియా సింహాల జాతుల సంరక్షణ దిశగా రాబోయే తరాల వారికి కూడా స్ఫూర్తిని అందిస్తుందన్నారు.
కీలక ఆవాసాలను పరిరక్షించడం, సంరక్షణ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడం, వన్యప్రాణుల మనుగడకు భద్రత కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధితో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని ప్రపంచానికి భారత్ చాటిచెప్పిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ అన్నారు. ఈమేరకు ఆయన ఒక సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచారు.  

పులులు, సింహాల సంరక్షణను దీర్ఘకాలిక ప్రాతిపదికన నిర్ధారించడానికి ‘ప్రాజెక్ట్ లయన్’ను అమలు చేయనున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 15న ప్రకటించారు. సింహాలు సంచరిస్తున్న వన్య ప్రాంత పరిధి 2020లో సుమారు 30,000 చ.కి.మీ. ఉండగా, ప్రస్తుతం దాదాపు 35,000 చ.కి.మీ. కి విస్తరించింది.

జీవవైవిధ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టులో భాగంగా విస్తృత, సమగ్ర దృష్టికోణాన్ని అనుసరిస్తున్నారు. దీనిలో.. సింహాలు సంచరించే ప్రాంతాల సంరక్షణ, వ్యాధుల గుర్తింపు, పశువైద్య సహాయం, శాస్త్రీయ పద్ధతుల్లో వన్యప్రాణుల పర్యవేక్షణ, సాంకేతికత ఆధారిత కార్యకలాపాలు, జీవవైవిధ్య పరిరక్షణ, రాబడుతున్న ఫలితాలను ఇతరులకు కూడా తెలియజేయడం, స్థానికుల సహకారాన్ని తీసుకోవడంపై శ్రద్ధ వహిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2297028) సందర్శకుల సూచీ సంఖ్య : : 107
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Malayalam