హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద వరద ప్రభావిత రాష్ట్రాలకు ₹2,117.85 కోట్ల నిధుల ముందస్తు విడుదలకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఆమోదం

“సమర్థ సహాయక-రక్షణ-పునరావాస చర్యల దిశగా రాష్ట్రాలకు అన్నివిధాలా సాయపడేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉంది”

· “అవసరమైన ప్రతి సందర్భంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల ముందస్తు మోహరింపు.. రవాణా-వనరుల మద్దతు సహా అన్నివిధాలా సాయం చేస్తోంది”

· “నష్టంపై అంచనా నిమిత్తం అరుణాచల్ ప్రదేశ్.. అస్సాం రాష్ట్రాలకు అంతర-మంత్రిత్వ శాఖ కేంద్ర బృందాలను ఇప్పటికే పంపాం”

· “వరద తీవ్రత దృష్ట్యా అస్సాంలో ఈ బృందాలు రెండుసార్లు పర్యటించగా.. నాగాలాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రం కోసం ఒక బృందం ఏర్పాటవుతోంది”

· “ఏడు వరద ప్రభావిత రాష్ట్రాలకుగాను హిమాచల్ ప్రదేశ్.. నాగాలాండ్‌.. ఒడిషాలకు 2026-27 ‘ఎస్‌డీఆర్‌ఎఫ్‌’ తొలివిడత నిధులు ఇప్పటికే అందాయి”

प्रविष्टि तिथि: 01 AUG 2026 5:46PM by PIB Hyderabad

  ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వేళ వరద బారినపడిన రాష్ట్రాలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి’ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)లో కేంద్ర వాటా నుంచి ₹2,117.85 కోట్ల ముందస్తు విడుదలకు కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్థ సహాయక, రక్షణ, పునరావాస చర్యల దిశగా రాష్ట్రాలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పరిస్థితులపై నిశిత పర్యవేక్షణను కూడా కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

రుతుపవనాలు ప్రవేశించిన నాటినుంచీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సన్నిహిత సమన్వయంతో వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన ప్రతి సందర్భంలోనూ ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను ముందుగానే మోహరిస్తోంది. అంతేగాక రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రవాణా-వనరుల మద్దతు వంటి సాధ్యమైన అన్నిరకాల సాయాన్నీ కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఇందులో భాగంగా నష్టంపై అంచనా నిమిత్తం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు అంతర-మంత్రిత్వ శాఖ కేంద్ర బృందాలను కేంద్రం ఇప్పటికే పంపింది. వరదల తీవ్రత దృష్ట్యా అస్సాంలో రెండుసార్లు ఈ బృందాలు పర్యటించాయి. అలాగే, నాగాలాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రభావిత 7 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌, ఒడిషాలకు 2026-27 సంవత్సరం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) తొలి విడత నిధులు ఇప్పటికే అందాయి. అంతేకాకుండా సహాయ చర్యల కోసం నిధులు సకాలంలో అందుబాటులో ఉండేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కేంద్ర వాటా సంబంధిత రెండో విడత నిధుల ముందస్తు విడుదలకు కేంద్ర హోం మంత్రి ఆమోదం తెలిపారు. అంతేగాక సహాయక చర్యలకు వనరుల అత్యవసరమనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్లకూ వర్తించే మార్గదర్శకాలలోని పత్రాల సమర్పణ నిబంధనలను సడలించారు. దీంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కేంద్ర వాటాలో తొలివిడత నిధులను ముందగానే విడుదల చేసేందుకు ఆమోదం లభించింది.

ప్రభావిత రాష్ట్రాలకు 2026-27కుగాను ఆమోదిత సహాయం కింద ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కేంద్ర వాటాలో తొలివిడతగా అరుణాచల్ ప్రదేశ్‌కు ₹44.55 కోట్లు విడుదల చేశారు. అలాగే అస్సాం రాష్ట్రానికి ₹379.35 కోట్లు, గుజరాత్‌కు ₹500 కోట్ల మేర విడుదలకు ఆమోదం లభించింది. ఇక ఈ నిధులను ఇప్పటికే పొందిన హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రం కేంద్ర వాటాలో రెండో విడతగా ₹193.95 కోట్లు మంజూరు కాగా, మహారాష్ట్రకు తొలివిడతగా ₹500 కోట్ల ముందస్తుగా విడుదలకు ఆమోదముద్ర పడింది. మరోవైపు తొలి విడత నిధులు అందుకున్న ఒడిశాకు రెండో విడతగా ₹500 కోట్ల ముందస్తు విడుదలకు ఆమోదం లభించింది. దీంతో వరద ప్రభావిత రాష్ట్రాలు చేపట్టే సహాయక-ప్రతిస్పందన చర్యల బలోపేతం కోసం మొత్తం ₹2,117.85 కోట్లు అందుబాటులోకి వచ్చాయి.


(रिलीज़ आईडी: 2293113) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam