రైల్వే మంత్రిత్వ శాఖ
దేశంలో తొలిసారి దాత సజీవ హృదయాన్ని రైలు ద్వారా విజయవంతంగా రవాణా చేసిన భారతీయ రైల్వే
సూరత్ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రాణరక్షక మిషన్‌ను సాధ్యం చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రాణాలను రక్షించే ఆరోగ్య సేవల్లో విస్తరిస్తున్న రైల్వేల పాత్రను చాటిన... భారతీయ రైల్వేలు, ఆర్.పి.ఎఫ్, గుజరాత్ పోలీసులు, వైద్య బృందాల అద్భుత సమన్వయం
प्रविष्टि तिथि:
31 JUL 2026 5:20PM by PIB Hyderabad
దేశంలోనే తొలిసారిగా దాత సజీవ గుండెను రైలులో విజయవంతంగా రవాణా చేయడం ద్వారా భారతీయ రైల్వే ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక చరిత్రాత్మక విజయం సాధించింది. ప్రాణాలను కాపాడే ఈ అవయవాన్ని సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు 20901 నంబర్ గల ముంబయి సెంట్రల్-గాంధీనగర్ క్యాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో రవాణా చేశారు. అహ్మదాబాద్‌లోని యు.ఎన్. మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్‌లో గుండె మార్పిడి కోసం దానిని సురక్షితంగా, సకాలంలో చేర్చారు.
ఈ చరిత్రాత్మక యాత్ర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం, సమయపాలన, విశ్వసనీయతను ప్రదర్శించడంతో పాటు... కీలకమైన ఆరోగ్య సంరక్షణ సేవలు, అత్యవసర వైద్య రవాణాకు మద్దతునివ్వడంలో పెరుగుతున్న భారతీయ రైల్వేల పాత్రనూ స్పష్టం చేసింది.
అవయవ మార్పిడి, సమయంతో ముడిపడిన అత్యంత సున్నితమైన ప్రక్రియ. ఈ ఆపరేషన్ కోసం పకడ్బందీ ప్రణాళికతో పాటుగా ఇండియన్ రైల్వేస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గుజరాత్ రాష్ట్ర పోలీసులు, వైద్య బృందాల మధ్య సజావైన సమన్వయం అవసరమైంది. దాత గుండెను నిర్దేశించిన కాలపరిమితిలోగా గ్రహీత ఆసుపత్రికి చేరేలా చూసేందుకు, రవాణాలోని ప్రతి దశనూ జాగ్రత్తగా సమన్వయం చేశారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గుజరాత్ రాష్ట్ర పోలీసులు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లోని 1వ ప్లాట్‌ఫారమ్ నుంచి యు.ఎన్. మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ వరకు ఒక ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఇది దాత గుండె నిరాటంకమైన రవాణాకు వీలు కల్పించడంతో పాటు, మార్పిడి ప్రక్రియ ఆలస్యం లేకుండా ప్రారంభమయ్యేలా నిర్ధారించింది.
ఈ సందర్భంగా అహ్మదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ వేద్ ప్రకాష్ మాట్లాడుతూ, "ఇది భారతీయ రైల్వేకు ఎంతో గర్వకారణమైన, సంతృప్తినిచ్చే క్షణం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు దాత సజీవ గుండెను విజయవంతంగా రవాణా చేయడం... సంప్రదాయికమైన ప్రయాణికుల, సరుకు రవాణాకు అతీతంగా సమాజ సేవ పట్ల మా నిబద్ధతను చాటింది. ఇటువంటి ప్రాణరక్షక కార్యక్రమాల్లో ప్రతి నిమిషం కీలకం. భారతీయ రైల్వే, ఆర్‌పిఎఫ్, గుజరాత్ రాష్ట్ర పోలీసులు, వైద్య బృందాల మధ్య అద్భుతమైన సమన్వయం ఈ మిషన్ విజయానికి దోహదపడింది. ఒక మానవ ప్రాణాన్ని కాపాడటంలో పాలుపంచుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు... సేవ, మానవత్వం పట్ల మన అత్యున్నత కర్తవ్యం కూడా" అని అన్నారు.
తన హై-స్పీడ్ కనెక్టివిటీ, కార్యాచరణ విశ్వసనీయత, సమయపాలన ద్వారా సమయ-సంబంధిత కార్యకలాపాలకు మద్దతునివ్వగల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామర్థ్యాన్ని ఈ విజయవంతమైన మిషన్ మరింత బలోపేతం చేస్తుంది. దేశ అత్యవసర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఎంత కీలక పాత్ర పోషించగలవో ఇది నిరూపిస్తుంది.
వారి సమన్వయ ప్రయత్నాలతో ఈ సవాలుతో కూడిన మిషన్‌ను విజయవంతం చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గుజరాత్ రాష్ట్ర పోలీసులు, వైద్యులు, అవయవ మార్పిడి కోఆర్డినేటర్లు, రైల్వే అధికారులు సహా సంబంధిత సిబ్బందికి భారతీయ రైల్వే అభినందనలు తెలిపింది.
ఈ చరిత్రాత్మక విజయం, సురక్షితమైన, నమ్మకమైన, సమర్థమైన రవాణా సేవలను అందించడంలో భారతీయ రైల్వే నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. అదే సమయంలో ప్రాణాలను కాపాడే మానవతా కార్యక్రమాలకు మద్దతునిస్తూ, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూ తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2292878)
आगंतुक पटल : 20