మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవం
ఆరోగ్యకరమైన దేశ నిర్మాణం దిశగా.. కుటుంబాలు, సమాజం, ఆరోగ్య కార్యకర్తల్లో తల్లిపాలపై అవగాహనే లక్ష్యం
प्रविष्टि तिथि:
31 JUL 2026 11:11AM by PIB Hyderabad
2026 ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా నిర్వహించనుంది. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా.. తల్లిపాలను ఇవ్వడాన్ని త్వరగా ప్రారంభించడం, మొదటి ఆరు నెలలూ తల్లిపాలనే ఇవ్వడం, రెండేళ్లు వచ్చే వరకు తగిన అనుబంధ ఆహారంతోపాటు తల్లిపాలివ్వడం వంటి అంశాలపై కుటుంబాలు, సమాజం, ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
పిల్లల మనుగడ, ఆరోగ్యకరమైన పెరుగుదల, మేధో వికాసానికి అత్యంత ప్రభావవంతమైన చర్యల్లో తల్లిపాలివ్వడం ఒకటి. ప్రతి నవజాత శిశువుకూ పుట్టిన మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) తల్లిపాలను ఇవ్వాలని మంత్రిత్వశాఖ ప్రజలను కోరుతోంది. మొదటి స్తన్యమైన ముర్రుపాలు శిశువుకు మొదటి సహజమైన టీకా వంటివి. ప్రతిరక్షకాలూ, అవసరమైన పోషకాలూ అందులో సమృద్ధిగా ఉన్న ముర్రుపాలను తప్పకుండా శిశువుకు అందించాలి.
మొదటి ఆరు నెలలూ శిశువుకు తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. అంటే నీరు, తేనె, ఘుట్టి, గ్లూకోజ్ లేదా ఫార్ములా ఆహారం వంటివి ఇవ్వకూడదు. ఈ కాలంలో శిశువు పోషక, నీటి అవసరాలన్నింటికీ తల్లిపాలు సరిపోతాయి. ఆరు నెలల తర్వాత.. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు తల్లిపాలివ్వడాన్ని కొనసాగిస్తూనే, అనుబంధ ఆహారాలను శిశువుకు అలవాటు చేయాలి. ప్రసవానంతరం బిడ్డ – తల్లి శరీరానికి ఆనుకుని ఉండాలనీ, తరచూ తల్లిపాలు ఇవ్వాలనీ, అవసరమైన సమయంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తల నుంచి సలహాలు తీసుకోవాలనీ మంత్రిత్వశాఖ కోరుతోంది. ఉద్యోగం చేసే తల్లులు.. తల్లి పాలను సురక్షితంగా నిల్వ చేయవచ్చు. పిల్లలకు పాలివ్వడంతో తల్లులకూ ప్రయోజనాలున్నాయి. ప్రసవానంతరం కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్లు, టైప్-2 మధుమేహం, ప్రసవానంతర మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావు.
ప్రతి తల్లీ ఎలాంటి సంకోచమూ లేకుండా బిడ్డకు పాలిచ్చేలా, ప్రతీ బిడ్డ ఆరోగ్యకరంగా ఎదిగేలా... అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, కుటుంబాలు, ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రిత్వశాఖ పిలుపునిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2292252)
आगंतुक पटल : 40