పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో సంరక్షణ కేంద్రాల్లో గత 12 ఏళ్లలో పులుల సంఖ్య గణనీయమైన పెరుగుదల: శ్రీ భూపేందర్ యాదవ్
న్యూఢిల్లీలో ప్రపంచ పులుల దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.. ప్రకృతిని గౌరవించాలని ప్రజలకు పిలుపు
వన్యప్రాణి సంరక్షణ కథనాలు సమాచారానికి మాత్రమే పరిమితం కాదు.. సంప్రదాయ జ్ఞానం, భావోద్వేగాలు, అభిరుచి, ఎన్నో ఏళ్ల అనుభవాల మేళవింపు
2026 ప్రపంచ పులుల దినోత్సవ సందర్భంగా ఎన్టీసీఏ- పర్యావరణ హిత పర్యాటక వెబ్‌పేజీ ప్రారంభం.. పులుల సంరక్షణ, రక్షిత ప్రాంతాల నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి ఎన్టీసీఏ పురస్కారాలు
प्रविष्टि तिथि:
29 JUL 2026 12:21PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) నిర్వహించిన ప్రపంచ పులుల దినోత్సవం-2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు ప్రసంగించారు. ప్రకృతితో సామాజిక అనుబంధాన్నీ మరింత పెంపొందించుకోవాలనీ, పర్యావరణ పరిరక్షణ ఆధారిత జీవనశైలిని అలవర్చుకోవాలనీ ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్, సీనియర్ ప్రభుత్వాధికారులు, వన్యప్రాణి నిపుణులు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది, విద్యార్థులు, ఇతర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం.. పులుల సంరక్షణలో భారత్ విజయాలను చాటింది. పులులనూ, వాటి ఆవాసాలనూ పరిరక్షించే దిశగా సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించింది.
సంరక్షణ అంటే వన్యప్రాణులను రక్షించడం మాత్రమే కాదనీ, ప్రకృతితో గౌరవప్రదమైన అనుబంధాన్ని పెంపొందించుకోవడమనీ శ్రీ యాదవ్ స్పష్టం చేశారు. “ప్రకృతి అంటే కేవలం పర్యాటకమో, వినోదమో మాత్రమే కాదు.. ప్రకృతిని గౌరవించాలి. ప్రజలు దాని నుంచి ప్రశాంతతను పొందాలి” అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రకృతి నుంచి స్ఫూర్తిని పొంది, పర్యావరణ పరిరక్షణకు పునరంకితమయ్యేలా జీవనశైలిని అలవరచుకోవాలని ఆయన కోరారు.
పులుల సంరక్షణపరంగా భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో పులుల సంఖ్య (3,682), పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య (58) గణనీయంగా పెరిగాయని మంత్రి తెలిపారు. గత 12 ఏళ్లలో ఏనుగుల అభయారణ్యాలు, జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు, రక్షిత ప్రాంతాలు, కమ్యూనిటీ రిజర్వులు, చిత్తడి నేలల సంఖ్య కూడా పెరిగిందని వివరించారు.
ఎన్టీసీఏ పర్యావరణ హిత పర్యాటక (ఎకో టూరిజం) వెబ్‌పేజీని ప్రారంభిస్తూ.. అన్ని పులుల సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చిన ఎన్టీసీఏను శ్రీ యాదవ్ అభినందించారు. సఫారీ, వసతి సదుపాయానికి బుకింగుల కోసం అన్ని పులుల సంరక్షణ కేంద్రాల ప్రామాణిక వెబ్‌సైట్ల లింకులు ఇందులో అందుబాటులో ఉంటాయి. తద్వారా సమాచారం సులభంగా అందుబాటులోకి రావడమే కాకుండా.. బాధ్యతాయుతమైన, సుస్థిరమైన ప్రకృతి హిత పర్యాటకాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. (లింకు: https://ntca.gov.in/eco-tourism/)
అటవీ సంరక్షణ అనుభవాలను గ్రంథస్తం చేయాల్సిన ఆవశ్యకతపై మంత్రి మాట్లాడుతూ.. “అడవుల కథలు కేవలం సమాచారం మాత్రమే కాదు.. సంప్రదాయ విజ్ఞానం, భావోద్వేగాలు, వన్యప్రాణి సంరక్షణ పట్ల ఆకాంక్ష అందులో కనిపిస్తాయి. అటవీ/ వన్యప్రాణి అధికారులు, సంరక్షకుల అనుభవాలెన్నో వాటిలో ఉంటాయి” అని మంత్రి అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ గురించి అటవీ అధికారులు మరింతగా రాయాలనీ, ఆచరణాత్మకమైన, అమలు చేయదగిన విధాన నిర్ణయాలకు దోహదపడే విధంగా తమ అనుభవాలను పంచుకోవాలని ఆయన కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న అత్యుత్తమ విధానాలను అవలంబించడం ద్వారా అటవీ అధికారులు, సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను కూడా శ్రీ యాదవ్ ప్రస్తావించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయ బిగ్ క్యాట్ కూటమి (ఐబీసీఏ) కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
పులుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారి సేవలను గుర్తిస్తూ.. పులుల సంరక్షణ, రక్షిత ప్రాంతాల నిర్వహణలో విశేష కృషి చేసిన అటవీ/ వన్యప్రాణి అధికారులకు, ఇతర సహాయకులకు ఎన్టీసీఏ పురస్కారాలను అందించారు. వన్యప్రాణి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది కృషిని గుర్తించడానికి కూడా ఈ కార్యక్రమం ఒక వేదికను అందించింది.
‘పులులను కాపాడుదాం’ అన్న ఇతివృత్తంపై ఢిల్లీలోని బడి పిల్లలకు నిర్వహించిన పెయింటింగ్, స్కెచింగ్, నినాదాల రచన, మాస్కు తయారీ పోటీల్లో నుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ కృతులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి వీక్షించారు. అలాగే, పులుల సంరక్షణ కేంద్రాల సమీపంలోని పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. మంత్రిత్వ శాఖ పర్యావరణ విద్యా కార్యక్రమం కింద, ఎకో క్లబ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా పులుల సంరక్షణపై అవగాహన ప్రచారాన్ని కూడా చేపట్టారు.
శాస్త్రీయత ప్రాతిపదికగా పులుల సంరక్షణ, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ప్రజల్లో అవగాహనను పెంపొందించడంలో ఎన్టీసీఏ నిరంతర అంకితభావాన్ని ప్రతిబింబించేలా.. అయిదు ప్రచురణలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారు. వీటిలో ఎన్టీసీఏ ప్రజాప్రచార పత్రిక ‘స్ట్రైప్స్’ 2026 జూలై సంచిక, 24 పులుల సంరక్షణ కేంద్రాల భద్రతా ఆడిట్ నివేదిక, దేశంలోని పులుల ఆవాస ప్రాంతాల్లో ఎలుగుబంట్ల ఆవాస అనుకూలత అంచనాపై నివేదిక, ఐబీసీఏ, జీటీఎఫ్ ప్రచురించిన ‘టైగర్స్ ఆఫ్ ది వరల్డ్’, శ్రీ చంద్ర ప్రకాష్ గోయల్, శ్రీ సత్య ప్రకాష్ యాదవ్ రచించిన ‘ది రెహ్మాన్ ఖేరా టైగర్’ ఉన్నాయి.
ప్రతిభను గుర్తించడం, శాస్త్రీయ నిర్వహణ, సామర్థ్యాభివృద్ధి, బాధ్యతాయుతమైన పర్యావరణ హిత పర్యాటకం, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సుసంపన్నమైన దేశ సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా.. పులుల సంరక్షణకు భారత్ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ప్రపంచ పులుల దినోత్సవం- 2026 కార్యక్రమాలు స్పష్టం చేశాయి.
నేపథ్యం: ప్రపంచ పులుల దినోత్సవం- 2026
ఒక వందేళ్ల కిందట ఆసియాలో లక్ష పులులుండేవని అంచనా. చారిత్రకంగా వాటికి ఆవాస ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో నేడు పులుల సంఖ్య అందులో 8 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. అంతేకాదు.. బాలి, జావాన్, కాస్పియన్ అనే మూడు పులుల ఉప జాతులు అంతరించిపోయాయి. వేట, వన్యప్రాణుల అక్రమ రవాణా, ఆవాసాల నష్టం, విచ్ఛిన్నం, మానవ - వన్యప్రాణి ఘర్షణ, వాతావరణ మార్పులు పులుల సంఖ్య తగ్గడానికి కారణమయ్యాయి.
పులుల సంరక్షణ దిశగా సమష్టి కృషి ఆవశ్యకతను గుర్తించి.. 13 పులుల ఆవాస దేశాల నాయకులు 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సదస్సులో ఒక్కచోట చేరి ప్రపంచ పులుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని (జీటీఆర్పీ) ప్రారంభించారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న ప్రతిష్ఠాత్మక TX2 లక్ష్యంతో.. ఏటా జూలై 29న ‘ప్రపంచ పులుల దినోత్సవా’న్ని నిర్వహించాలని కూడా ఈ సదస్సులో నిర్ణయించారు.
నాటి నుంచి పులుల సంరక్షణ, అంతర్జాతీయ సహకార బలోపేతం, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై అవగాహనను పెంపొందించడంతోపాటు.. పులులూ, వాటి ఆవాసాలను కాపాడడంలో పురోగతిని సమీక్షించేందుకు ప్రపంచ పులుల దినోత్సవం ఒక వేదికను అందిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2291198)
आगंतुक पटल : 17