ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని రెండో ఉన్నత స్థాయి సమావేశం


ఆర్థిక, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమలు, సాంకేతికత రంగాలపైచర్చ

ప్రభుత్వ వ్యవస్థలోని విభాగాల మధ్య అడ్డంకులను తొలగించి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన ప్రధానమంత్రి

కీలక రంగాలలో సాంకేతిక ఆధారిత ఆత్మనిర్భరత, దేశీయ సామర్థ్యాల పెంపు ప్రాముఖ్యతను వివరించిన ప్రధానమంత్రి

సైబర్ భద్రతా వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మరింత పెరగాలి: ప్రధానమంత్రి

తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక రంగాలపై క్రియాశీల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: ప్రధానమంత్రి

ప్రభుత్వం ఎల్లప్పుడూ యువతరంలా చురుకుగా, చైతన్యవంతంగా, భవిష్యత్ దృష్టితో ఉండాలి: ప్రధానమంత్రి

కొత్త సవాళ్లు, అవకాశాలకు అనుగుణంగా వేగంగా, సృజనాత్మకంగా నిరంతరం మార్పులు చేసుకోవాలి: ప్రధానమంత్రి

ప్రధాన కార్యక్రమాలు, కొత్త అవకాశాలు, అమలులో ఎదురవుతున్న సవాళ్లపై అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్న కార్యదర్శులు

प्रविष्टि तिथि: 28 JUL 2026 8:48PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో భారత ప్రభుత్వ కార్యదర్శులతో రెండో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్యం - పరిశ్రమలు, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి సమీక్షించారు. వికసిత భారత్ లక్ష్యాల సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానమంత్రి సూచించారు. అధికారులు ఉమ్మడి లక్ష్యంతో, సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. ప్రభుత్వంలోని విభాగాల మధ్య అంతరాలను తొలగించి అన్ని విభాగాలు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని, సమగ్ర ఫలితాలను అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ప్రజా కేంద్రిత పాలన ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, దేశ పాలనా వ్యవస్థలో భారత ప్రజలే కేంద్ర బిందువుగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి నిర్ణయం, ప్రతి విధానం సామాన్య పౌరుల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని ఆయన అన్నారు. 

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక స్వావలంబన సాధించడం, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. 

ఇంధన భద్రత జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం, పౌరుల సంక్షేమంతో సన్నిహితంగా ముడిపడి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆవిష్కరణలు, ఇంధన వనరుల వైవిధ్యీకరణ, ఉత్పత్తి సామర్థ్యాల వేగవంతమైన విస్తరణ ద్వారా ఇంధన రంగంలో భారత్ స్వావలంబన సాధించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సంస్కరణలు అంటే కేవలం ప్రాచుర్యం పొందిన పదం మాత్రమే కాదని, సమర్థవంతమైన పాలన కోసం అవి నిరంతరం కొనసాగాల్సిన అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రక్రియల్లో సంస్కరణలు తీసుకురావడం, పని సంస్కృతిని మెరుగుపరచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. 

సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రక్షణకు సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎదురవుతున్న కొత్త సైబర్ ముప్పులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. సైబర్ భద్రతా వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించాలని, ఇది దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశం చేపడుతున్న కీలక కార్యక్రమాలకు సంబంధించిన వ్యూహాత్మక రంగాలపై ముందస్తు, సమర్థవంతమైన ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ఈ రంగాలకు సంబంధించి వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం, ఆధారంలేని భయాలను ఎదుర్కొనేందుకు ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. 

అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో మానవ వనరులను సిద్ధం చేసేందుకు కొత్త విద్యా కోర్సులను పరిశ్రమల భాగస్వామ్యంతో రూపొందించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వం ఎల్లప్పుడూ యువతరంలా చురుకుగా, చైతన్యవంతంగా, భవిష్యత్ దృష్టితో ఉండాలని ఆయన అన్నారు. కొత్త సవాళ్లు, అవకాశాలకు అనుగుణంగా వేగంగా స్పందిస్తూ, ఆవిష్కరణలతో నిరంతరం మార్పులను స్వీకరించేలా ప్రభుత్వం పనిచేయాలని ప్రధానమంత్రి సూచించారు.

ఈ సమావేశంలో ఆయా విభాగాలకు సంబంధించిన పురోగతి, ప్రాధాన్యతలు, అమలులో ఎదురవుతున్న అంశాలపై కార్యదర్శులు విస్తృతంగా చర్చించారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

 

***


(रिलीज़ आईडी: 2290852) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Khasi , Marathi , हिन्दी , Gujarati , Tamil