రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేపాల్ చేరిన భారత్ తొలి ప్రత్యక్ష వాణిజ్య కంటైనర్ సరుకు రవాణా రైలు... సరిహద్దు వాణిజ్యం, అనుసంధానంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం


కోల్‌కతా పోర్టు నుంచి బిరాట్‌నగర్‌కు 40 వ్యాగన్ల సరుకు రవాణా రైలు.. భారత్-నేపాల్ సవరించిన రైలు రవాణా ఒప్పందం అమలు

ప్రతక్ష రైలు సరుకు రవాణా సేవ వల్ల తగ్గనున్న రవాణా సమయం, లాజిస్టిక్‌ ఖర్చులు, నిర్వహణ వ్యయం

మరింత బలపడనున్న భారత్-నేపాల్ వాణిజ్య ద్వైపాక్షిక బంధం

प्रविष्टि तिथि: 28 JUL 2026 4:16PM by PIB Hyderabad

 భారత్-నేపాల్ మధ్య సరుకు రవాణా సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ రైల్వే కీలక మైలురాయిని సాధించింది. కోల్‌కతా ఓడరేవు నుంచి నేపాల్‌లోని బిరాట్‌నగర్ కస్టమ్స్ యార్డు‌ వరకు తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య కంటైనర్ సరుకు రవాణా రైలును విజయవంతంగా నడిపించింది. కనోలా సరుకును మోసుకెళ్లే 40 వ్యాగన్లతో కూడిన ఈ రైలు.. సవరించిన భారత్-నేపాల్ రైలు రవాణా నిబంధనల ప్రకారం తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సరిహద్దు వద్ద రైలు ఆధారిత సరుకు రవాణా ప్రయాణంలో ఇది ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.

 

ఈ విజయవంతమైన సర్వీసు వల్ల కోల్‌కతా ఓడరేవు నుంచి బిరాట్‌నగర్‌కు కంటైనర్ సరుకును నేరుగా తీసుకెళ్లడానికి వీలవుతుంది. సరిహద్దు వద్ద సరుకును ఒక రైలు నుంచి మరొక రైలుకు మార్చాల్సిన అవసరం లేదు. ఈ కొత్త ఏర్పాటు వల్ల ప్రయాణ సమయం, లాజిస్టిక్స్ ఖర్చులు, సరుకు నిర్వహణ భారం గణనీయంగా తగ్గుతాయి. ఇరు పొరుగు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం సామర్థ్యం, విశ్వసనీయత పెరగనున్నాయి. సవరించిన భారత్-నేపాల్ రైలు రవాణా ఒప్పందం అమలు చేయడం వల్లే రెండు దేశాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేని రైలు రవాణా సాధ్యమైంది.

 

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నాటి నేపాల్ ప్రధాని కలిసి 2023 జూన్‌లో ప్రారంభించిన జోగ్బాని (భారత్)-బిరాట్‌నగర్ (నేపాల్) బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఆధారంగా ఈ సాధన సాధ్యపడింది. 2025 నవంబర్‌లో సవరించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత బిరాట్‌నగర్‌కు నేరుగా వాణిజ్య రైళ్ల రాకపోకలు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. ఇది దైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారానికి కొత్త అవకాశాలను తెరిచింది.

 

ఈ ప్రతక్ష సరుకు రవాణా సర్వీసు వల్ల వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణహితమైన రవాణా మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇది దిగుమతి, ఎగుమతి సరుకుల రాకపోకలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. రవాణా మధ్యలో సరుకును పదే పదే దించడం, ఎక్కించడం వంటి శ్రమ తగ్గుతుంది. సరఫరా వ్యవస్థలో పనితీరు మెరుగవడంతో ఎగుమతిదారులు, దిగుమతిదారులు, లాజిస్టిక్స్ నిర్వాహకులు, సరిహద్దు వ్యాపారంలో ఉన్న పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

 

అంతర్జాతీయ రైలు అనుసంధానం విస్తరించడం, సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంపై భారతీయ రైల్వే నిరంతరం దృష్టి సారిస్తోంది. ఆధునిక రవాణా మౌలిక సదుపాయాల ద్వారా వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు ఈ విజయం అద్దం పడుతోంది. రైలు ఆధారిత సరుకు రవాణా పెరగడం వల్ల రవాణా వ్యయం తగ్గి, సరుకు సురక్షితంగా చేరుతుంది. ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు పొరుగు దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.

 

నేపాల్‌కు మొదటిసారిగా నడిపిన ఈ ఉచిత వాణిజ్య కంటైనర్ సరుకు రవాణా రైలు ప్రయాణం భారతీయ రైల్వేల ప్రయాణంలో మరో కీలక విజయంగా నిలిచింది. ప్రాంతీయ వ్యాపారానికి, ఆర్థిక వృద్ధికి, అడ్డంకులు లేని అంతర్జాతీయ అనుసంధానానికి మద్దతుగా ఒక సమగ్రమైన, సమర్థవంతమైన, భవిష్యత్తు అవసరాలకు సరిపోయే సరుకు రవాణా వ్యవస్థను నిర్మించే దిశగా రైల్వే శ్రమిస్తోంది. 

 

***


(रिलीज़ आईडी: 2290846) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Odia , Kannada , Malayalam