సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరీక్షల నిర్వహణలో అవకతవకలు నివారించే చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయనున్న ప్రభుత్వ పరీక్షల సవరణ బిల్లు


విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడానికి, ప్రభుత్వ పరీక్షల సమగ్రత, పారదర్శకత, విశ్వసనీయతలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయత బలోపేతం, ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా చేయడం ఈ సవరణ బిల్లు లక్ష్యం: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 28 JUL 2026 5:58PM by PIB Hyderabad

'ప్రభుత్వ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు-2026' పరీక్షలకు సంబంధించిన అక్రమాలను అరికట్టే, దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ప్రయోజనాలను పరిరక్షించే చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కీలక ముందడుగు అవుతుందని కేంద్ర శాస్త్ర-సాంకేతికత, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ చట్టం పునరుద్ఘాటిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దేశ యువత ఆశయాలకు భంగం కలిగించేలా ఎవరినీ అనుమతించకూడదనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వ పరీక్షల వ్యవస్థ విశ్వసనీయత బలోపేతంలో ఈ చట్టం కీలక ముందడుగు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షలకు సంబంధించిన అక్రమాలు గత కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్నాయనీ... దీని కోసం జాతీయ స్థాయి చట్టపరమైన సమగ్ర విధానం అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు దేశంలోనే తొలి సమగ్ర చట్టంగా ప్రభుత్వ పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం-2024'ను ప్రభుత్వం రూపొందించిందని ఆయన గుర్తుచేశారు. ఈ చట్టాన్ని మరింత కఠినంగా, సమర్థంగా మార్చేందుకు గానూ దీని అమలు ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా మరిన్ని సవరణలను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్‌బీలు), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) వంటి ప్రధాన నియామక సంస్థలు... ఉన్నత విద్య ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షలను ఈ చట్టం పరిధిలోకి తీసుకువస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 2024 చట్టం తన పరిధిలోని నేరాలను కఠినమైన శిక్షా నిబంధనలతో విచారణార్హమైనవిగా, బెయిల్ పొందడానికి వీలుకానివిగా, రాజీపడటానికి వీలుకానివిగా చేసిందని ఆయన గుర్తు చేశారు.

సవరణ బిల్లులోని కీలక అంశాలను వివరిస్తూ, అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే 3-5 ఏళ్ల జైలు శిక్షను 5-10 ఏళ్లకు పెంచడం సహా, గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇటువంటి నేరాల్లో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్లకు విధించే గరిష్ట జరిమానాను రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్లకు పెంచడం సహా, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ నుంచి వారిని నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. సర్వీస్ ప్రొవైడర్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులకు విధించే శిక్షనూ 3-10 ఏళ్ల జైలు శిక్ష నుంచి 5-10 ఏళ్లకు పెంచాలని, గరిష్ట జరిమానాను రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. వ్యవస్థీకృత నేరాలకు విధించే శిక్షను 5-10 ఏళ్ల జైలు శిక్ష నుంచి 7-10 ఏళ్లకు పెంచాలని, గరిష్ట జరిమానాను రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్లకు పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

త్వరిత న్యాయం ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రభుత్వ పరీక్షలకు సంబంధించిన నేరాలను విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఈ సవరణ బిల్లు వీలు కల్పిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఛార్జిషీట్ దాఖలు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లోగా దర్యాప్తును, మూడు నెలల్లోగా విచారణను పూర్తి చేయడం ద్వారా ఇటువంటి కేసులను వేగంగా పరిష్కరించేలా ఈ బిల్లు నిర్దేశిస్తుందని ఆయన తెలిపారు. ఈ చట్టం కింద నేరాల దర్యాప్తును, ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు అప్పగించే అధికారాన్నీ ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తుంది. దీని ద్వారా పరీక్షలకు సంబంధించిన వ్యవస్థీకృత నేరాల విషయంలో వేగవంతమైన, సమర్థమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.

ఇలాంటి కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా, పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని కేంద్ర మంత్రి సభకు తెలియజేశారు. ప్రభుత్వ పరీక్షల వ్యవస్థను "లీక్-ప్రూఫ్"గా మార్చేందుకు ప్రముఖ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి చేసిన ప్రకటననూ ఆయన ప్రస్తావించారు. పరీక్షల వ్యవస్థ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో ఇప్పటికే గణనీయ పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయత, పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పెంచుతూనే... విద్యార్థుల నిజాయతీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం అందేలా చూడటమే ఈ సవరణల లక్ష్యమని ఆయన అన్నారు.

ప్రతిపాదిత సవరణలు పరీక్షలకు సంబంధించిన వ్యవస్థీకృత నేరాల నియంత్రణను బలోపేతం చేస్తాయని, వేగవంతమైన న్యాయాన్ని అందిస్తాయని... దేశంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమగ్రత, పారదర్శకత, నిష్పక్షపాత నిర్వహణ పట్ల ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొంటూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2290843) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Gujarati , Tamil