రైల్వే మంత్రిత్వ శాఖ
దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్‌లోని పర్భాణి-ముద్ఖేడ్ సెక్షన్‌లో రూ.163 కోట్లతో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే ఆమోదం
అధిక సరుకు రవాణాను నిర్వహించడానికి, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణకు మద్దతుగా 164 కి.మీ. ట్రాక్షన్ వ్యవస్థ ఆధునికీకరణ
प्रविष्टि तिथि:
28 JUL 2026 1:39PM by PIB Hyderabad
రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ... నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పర్భాణి–ముద్ఖేడ్ డబుల్ లైన్ సెక్షన్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో అనుబంధ విద్యుత్ సరఫరా వ్యవస్థల ఏర్పాటు పనులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.163 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా పెరిగిన విద్యుత్ లోడ్‌ను తట్టుకొనేలా ఆధునిక విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల తోడ్పాటుతో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1x25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ స్థానంలో అధునాతనమైన 2x25 కేవీ వ్యవస్థను 164 కిలోమీటర్ల వరకూ ఏర్పాటు చేస్తారు.
పర్భాణి - ముద్ఖేడ్ విభాగం వ్యూహాత్మక ప్రాధాన్యమున్న, అత్యధికంగా వినియోగించే నెట్వర్క్ (హెచ్‌యూఎన్) రూట్–9లో భాగంగా ఉంది. ఇది అజ్మీర్ - ఇండోర్ - ఖాండ్వా - అకోలా - పూర్ణ - ముద్ఖేడ్ - సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ - ధోన్‌లను కలుపుతుంది.
మెరుగుపరిచిన ట్రాక్షన్ వ్యవస్థ రైళ్ల కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్ సరఫరాను బలోపేతం చేస్తుంది. ఫలితంగా అధిక పరిమాణంలో సరకు రవాణానూ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణకూ వీలు కల్పిస్తుంది. ఇది 2029–30 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరకు రవాణా లక్ష్యాన్ని సాధించాలన్న భారతీయ రైల్వే లక్ష్యానికి కూడా తోడ్పడుతుంది.
దేశవ్యాప్తంగా అధిక రద్దీ ఉండే కారిడార్లలో విద్యుత్ మౌలిక వసతులను ఆధునికీకరించడానికి, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రైల్వేలు చేపడుతున్న నిరంతర ప్రయత్నాలను ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2290447)
आगंतुक पटल : 8