హోం మంత్రిత్వ శాఖ
విపత్తుల ముప్పు తగ్గింపుపై మూడో బ్రిక్స్ మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్
ప్రపంచవ్యాప్తంగా విపత్తు నిరోధకతను బలోపేతం చేసే బ్రిక్స్ సంయుక్త ప్రకటనకు ఆమోదం
प्रविष्टि तिथि:
24 JUL 2026 5:37PM by PIB Hyderabad
భారత్ బ్రిక్స్ అధ్యక్షత - 2026లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) 2026 జూలై 24న న్యూఢిల్లీలో విపత్తు ప్రమాదాల తగ్గింపు (డీఆర్ఆర్)పై మూడో బ్రిక్స్ మంత్రివర్గ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహించగా, బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొన్నారు. పరస్పర సహకారం, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి ద్వారా విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో బ్రిక్స్ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ప్రాతిపదికగా నిలిచింది. సమావేశం ముగింపులో విపత్తు ప్రమాదాల తగ్గింపుపై బ్రిక్స్ సంయుక్త ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించారు. విపత్తు ప్రమాదాల తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక (2025–2028) అమలును వేగవంతం చేయడంతో పాటు, విపత్తులను తట్టుకునేందుకు పరస్పర సహకారాన్ని మరింతగా బలోపేతం చేయాలన్న బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ సంయుక్త ప్రకటన పునరుద్ఘాటించింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ… ఉదయ్‌పూర్ డిక్లరేషన్ (2016) నుంచి కజాన్ డిక్లరేషన్ (2024) వరకు బ్రిక్స్ భాగస్వామ్యం ఎదిగిన తీరును వివరించారు. బ్రిక్స్ విపత్తు ప్రమాదాల తగ్గింపు బృందం (డీఆర్ఆర్జీ) ఏర్పాటు, సుస్థిరాభివృద్ధికీ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యానికీ, మానవ భద్రతకూ విపత్తు తీవ్రతను తగ్గించడం అత్యంత కీలకమనే అవగాహన క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. బ్రిక్స్ కు భారత అధ్యక్ష కాలంలో “స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత పెంపు” లక్ష్యంతో బ్రిక్స్ విపత్తు ప్రమాదాల తగ్గింపు బృందం (డీఆర్ఆర్జీ) ఆచరణాత్మక, కార్యాచరణ ఆధారిత విధానాన్ని అవలంబించిందని ఆయన తెలిపారు. డీఆర్ఆర్జీని మంత్రిత్వ స్థాయికి పెంచినందుకు బ్రెజిల్ దేశాన్ని ఆయన అభినందించారు.
విపత్తు ముప్పుల తగ్గింపులో భారత నాయకత్వ ప్రాముఖ్యతను వివరిస్తూ, విపత్తు తీవ్రత తగ్గింపుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 10 అంశాల కార్యాచరణ ఆధారంగానే భారత ప్రజా కేంద్రిత ప్రజోపయోగ విధానం కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. బ్రిక్స్ డిఆర్ఆర్ ప్రణాళిక (2025–2028) అమలును వేగవంతం చేసేందుకు భారత్ అధ్యక్షతన కేటాయించిన ఐదు వ్యూహాత్మక ప్రాధాన్యతలను ఆయన ఉదహరించారు. విపత్తు ప్రమాదాల తగ్గింపును సుస్థిరాభివృద్ధిలో అంతర్భాగం చేయడానికి శాస్త్ర సాంకేతిక రంగాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు సమాజ స్థాయి ప్రతిఘటన సామర్ధ్యం వంటి అంశాల్లో సభ్య దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో భాగంగా వాతావరణ అనుకూల, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల వ్యవస్థల అభివృద్ధి - సుస్థిరాభివృద్ధి కోసం భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, నిధుల సమీకరణ అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి విధానపరమైన చర్చ జరిగింది. పెరుగుతున్న విపత్తులు, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన ఆర్థిక వనరుల సమీకరణ, ఆధునిక సాంకేతికతలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల సాధనపై ఈ సమావేశంలో మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.
విపత్తు ముప్పుల తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక (2025–2028) అమలును వేగవంతం చేయడంపై నిర్వహించిన బ్రిక్స్ మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం సభ్య దేశాలు తమ అనుభవాలను పంచుకోవడానికీ, వ్యవస్థాగత సహకారం, సామర్థ్య పెంపు, విజ్ఞాన మార్పిడి, అంగీకరించిన ప్రాధాన్యతల అమలును బలోపేతం చేయడానికి అవసరమైన ఆచరణాత్మక మార్గాలను గుర్తించడానికి దోహదపడింది.
బ్రిక్స్ కు భారత్ అధ్యక్షత వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిక్స్ సభ్య దేశాల్లో విపత్తు తీవ్రత తగ్గింపు చర్యలను శాస్త్రీయ ఆధారాలతో రూపకల్పన చేయడానికీ, వ్యవస్థాగత బలోపేతానికీ, సామర్థ్య పెంపునకూ, ఆచరణాత్మక అమలుకూ తోడ్పడేలా ఆరు ప్రధాన వైజ్ఞానిక ఉత్పత్తులను ఆవిష్కరించారు.
భవిష్యత్ కార్యాచరణలో భాగంగా విజ్ఞాన మార్పిడి, నూతన ఆవిష్కరణలు విపత్తు నిరోధకతలో స్పష్టమైన ఫలితాలను ప్రోత్సహించడం కోసం సాంకేతిక మార్పిడులు, ఉమ్మడి ప్రాజెక్టులు, నమూనా అభ్యాసాలు, నిపుణుల మార్పిడి, వార్షిక ఇతివృత్త ఆధారిత కార్యాచరణల ద్వారా ఆచరణాత్మక, ఫలితాల ఆధారిత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రులు పునరుద్ఘాటించారు.
విపత్తు ప్రమాదాల తగ్గింపుపై విజయవంతంగా ముగిసిన మూడో బ్రిక్స్ మంత్రిత్వ స్థాయి సమావేశం ద్వారా, విపత్తు ప్రమాదాల తగ్గింపులో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ విపత్తులను తట్టుకునే, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధత మరింత బలపడింది.
***
(रिलीज़ आईडी: 2289101)
आगंतुक पटल : 12