పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
శాస్త్రీయ నిర్ధారణ ఆధారంగా ఈ20 పెట్రోల్ భద్రత, పనితీరును ధ్రువీకరించిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
23 JUL 2026 3:05PM by PIB Hyderabad
ఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఈబీపీ) కార్యక్రమం పూర్తి స్థాయి శాస్త్రీయ విశ్లేషణ, క్రమబద్ధమైన సంప్రదింపులతో అమలులోకి వచ్చింది. నీతి ఆయోగ్, ఆటోమొబైల్ తయారీదారులు, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ), ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో దశలవారీగా ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
ఇథనాల్ కొత్త ఇంధనమేమీ కాదు. శతాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగం ఉనికిలో ఉంది. బ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా అత్యధిక శాతంలో ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో 2001లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. 2006లో ఈ5ను ప్రవేశపెట్టారు. 2013-14 నాటికి ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం వద్ద మాత్రమే ఉండేది. ఆ తర్వాత అవసరమైన ఉత్పాదక సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, నిబంధనల వ్యవస్థను బలోపేతం చేస్తూ క్రమంగా దీని శాతాన్ని పెంచుతూ వచ్చారు.
అధిక శాతం ఇథనాల్ మిశ్రమాల పంపిణీకి ముందే విస్తృత స్థాయి సమీక్షలు జరిగాయి. ఆటోమొబైల్ తయారీదారులు, ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ, వాహన విడిభాగాల తయారీదారులు, పరీక్షా సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ విధానాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.
ఈ-20 పెట్రోల్ వాడకం వల్ల ఇంధన సామర్థ్యం, ఇంజిన్ పనితీరు, నిర్వహణ ఖర్చులు, డ్రైవింగ్ అనుభవంపై వాహన తయారీదారులు, ఆటోమొబైల్ సంఘాలు, వినియోగదారుల సంస్థల నుంచి ఎలాంటి విస్తృతమైన లేదా ఆధారాలతో కూడిన ఫిర్యాదులూ ప్రభుత్వానికి అందలేదు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వ్యక్తమైన కొన్ని అనుమానాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా దీనిని పరిశీలించింది.
ఏఆర్ఏఐ, ఎస్ఐఏఎం, ఐఓసీఎల్,ఐఐపీ, వాహన తయారీ సంస్థలు కలసి విస్తృత స్థాయి ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించాయి. ఇంజిన్ మన్నిక, వాహన ప్రయాణ శైలి, స్టార్టింగ్ సామర్థ్యం, తుప్పు పట్టకుండా ఉండే గుణం, విడిభాగాల అనుకూలత, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశోధించాయి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఈ-20 పెట్రోల్ వాడకం పూర్తి సురక్షితమని ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి.
పాత తరం వాహనాల పనితీరులో తీవ్ర వ్యత్యాసాలు గానీ, విడిభాగాల అసాధారణ అరుగుదల గానీ జరగడం లేదని ఈ పరిశోధనలు తేల్చాయి. విస్తృత ప్రయోగశాల పరీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, నిజరూప వినియోగ అనుభవాలు... దేనిలోనూ ఈ-20 ఇంధనం వల్ల వాహనాల పనితీరుపై పెద్ద ప్రతికూల ప్రభావం పడలేదని స్పష్టమైంది.
ప్రభుత్వ అంచనాలు కేవలం ప్రయోగశాల పరిశోధనలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అమలు చేసిన తర్వాత కూడా లభించిన విస్తృత అనుభవం ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. దేశంలో ప్రతిరోజూ సుమారు 8 కోట్ల వాహనాలు పెట్రోల్ బంకులకు వస్తుంటాయి. వీటిలో దాదాపు 80 శాతం పెట్రోలు వాహనాలే ఉన్నాయి.
ఈ15 ప్లస్ మిశ్రమ పెట్రోలు గత మూడేళ్లన్నర కాలంగా, ఈ19-ఈ20 ఇంధనం రెండేళ్లన్నరగా వినియోగంలో ఉన్నాయి. దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ మిశ్రమ ఇంధనంతో నడుస్తున్నాయి. ఇథనాల్ మిశ్రమం వల్ల ఇంజిన్ వైఫల్యం లేదా వాహనాలు నిలిచిపోవడం వంటి ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఈ20 ఇంధనం వల్ల ఎలాంటి అసాధారణ తుప్పు, అరుగుదల లేదా వాహన జీవితకాలం తగ్గడం లేదని వాహన తయారీదారుల సర్వీస్ డేటా ధ్రువీకరించింది. ఈ20 ఇంధనాన్ని ఉపయోగిస్తున్న వాహనాలకు తయారీదారులు వారంటీ సదుపాయాన్ని కొనసాగిస్తుండటం ఈ ఇంధన సురక్షత, విశ్వసనీయతపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది.
ఒక ప్రముఖ వాహన తయారీ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ నిర్వహించింది. ఇందులో మొదట్లో ఈ20 రహితంగా తేలిన దాదాపు 1.5 కోట్ల వాహనాలు కూడా ఉన్నాయి. ఈ సర్వీసింగ్‌లో ఈ20 వల్ల తుప్పు పట్టడం, అసాధారణ అరుగుదల, విడిభాగాల జీవితకాలం తగ్గడం వంటి సమస్యలేవీ నమోదు కాలేదు. ఒక ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కూడా ఇలాంటి క్షేత్రస్థాయి అనుభవాన్నే నివేదించింది. దీర్ఘకాలంగా ఈ20 ఇంధనంతో నడుస్తున్న 1.4 కోట్ల వాహనాల డేటాను పరిశీలించగా... ఇథనాల్ వల్ల ఎలాంటి తుప్పు పట్టిన ఆధారాలు లేవని మరొక వాహన సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. వినియోగదారులకు చేరేముందు వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కఠినమైన పరీక్షలు పూర్తి చేసుకుంటాయని ఏఆర్‌ఏఐ స్పష్టం చేసింది.
మైలేజీ విషయానికి వస్తే... డ్రైవింగ్ పరిస్థితులు, డ్రైవింగ్ అలవాట్లు, వాహన నిర్వహణ వంటి పలు అంశాలు ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వ సంస్థలు, వాహన తయారీదారుల పరిశోధనలు వెల్లడించాయి. ఈ10 కోసం రూపొందించిన కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గుదల సాధారణంగా కేవలం 3 నుంచి 5 శాతం వరకు మాత్రమే పరిమితమవుతుంది. మరోవైపు ఈ20 ఇంధనం అత్యధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన యాంటీ నాక్ గుణాలు, స్వచ్ఛమైన దహన ప్రక్రియ, సున్నితమైన ఇంజిన్ పనితీరును అందిస్తుంది.
ఆటోమొబైల్ తయారీదారులు, విడిభాగాల సరఫరాదారులు, ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ, పరీక్షా ఏజెన్సీలు, చమురు మార్కెటింగ్ సంస్థలు ఈ20 శాస్త్రీయ మూల్యాంకనం, క్రమబద్ధమైన విస్తరణలోని ప్రతి దశలోనూ భాగస్వామ్యమయ్యాయి. ఇంధన వ్యవస్థలు, ఇంజిన్ మన్నిక, డ్రైవింగ్ అనుకూలత, భాగాల పొందిక, ఉద్గారాల పనితీరుపై విజయవంతమైన నిర్ధారణ తర్వాతే ఈ20 అందుబాటులోకి వచ్చింది. పాత తరం వాహనాలు సైతం ఈ20 వల్ల పనితీరులో ఎలాంటి తీవ్ర వ్యత్యాసాలు, అసాధారణ అరుగుదలను ప్రదర్శించడం లేదని ఈ పరిశోధనలు నిరూపించాయి.
ఈ20 ఇంధనం యాక్సిలరేషన్, ప్రయాణ సౌఖ్యాన్ని మెరుగుపరుస్తూనే కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ ధ్రువీకరించాయి. ఇథనాల్‌లోని అధిక ఆక్టేన్ సంఖ్య ఆధునిక హై కంప్రెషన్ ఇంజిన్లకు బాగా తోడ్పడుతుంది. దీనిలోని అధిక బాష్పీభవన వేడి దహన సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ20కి మారడం ద్వారా దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోలు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. దాదాపు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గాయి. సుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు నియంత్రణలోకి వచ్చాయి. అంతేకాకుండా రైతుల ఖాతాల్లోకి రూ.1.66 లక్షల కోట్లకు పైగా జమ అయ్యాయి.
చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) ఇంధన సేకరణ, మిశ్రమం, నిల్వ, రవాణా, పంపిణీ వంటి అన్ని దశల్లో కఠినమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను అనుసరిస్తున్నాయి. ఇంధన నాణ్యతను డిస్టిల్లరీ, డిపో, పెట్రోల్ బంకుల వద్ద నిరంతరం విశ్లేషిస్తున్నారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కల్తీని గుర్తించడానికి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఇంధనం మాత్రమే వినియోగదారులకు అందేలా చూసేందుకు సగటున గత 10, 20 రోజులలోనే చమురు సంస్థలు బంకుల్లో 30,000 కంటే ఎక్కువ నాణ్యతా తనిఖీలను నిర్వహించాయి. ఇంధన కల్తీ ఘటనలపై ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సైతం కోరింది.
ఈ20 ఇంధనానికి సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులు, సూచనలను స్వీకరించి వాటిపై విచారణ జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ సంస్థలు బలమైన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేశాయి. వినియోగదారులు ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాల ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉండే ఫిర్యాదుల రిజిస్టర్లు, ప్రత్యేక టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్లు, కంపెనీ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం) వ్యవస్థలు, సామాజిక మాధ్యమ వేదికలు, ఈ-మెయిల్, సీపీజీఆర్ఏఎంఎస్ ద్వారా సమస్యలను నివేదించవచ్చు. తక్షణ పరిష్కారం కోసం డీలర్లు, సంబంధిత క్షేత్రస్థాయి అధికారుల సంప్రదింపు వివరాలను పెట్రోల్ బంకుల్లో స్పష్టంగా ప్రదర్శించారు. ఈ మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఓఎంసీ నిబంధనల ప్రకారం విచారించి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తున్నారు.
అన్ని పెట్రోల్ వాహనాలకు ఈ20 ఇంధనం సాంకేతికంగా సరిపోతుందని, పనితీరులో సమస్యలు రావని వినియోగదారులకు వివరించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇథనాల్ మిశ్రమం ద్వారా చేకూరే పర్యావరణ మేలు, దేశ ఇంధన భద్రత ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ద్వారా వచ్చే వినియోగదారుల అభిప్రాయాలను చమురు సంస్థలు నిరంతరం పరిశీలిస్తున్నాయి. ఇథనాల్ మిశ్రమ పెట్రోలు (ఈబీపీ) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనే, వినియోగదారులలో నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైన సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి నేడు లోక్‌సభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2288653)
आगंतुक पटल : 7