ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘బ్రిక్స్‌’కు భారత్‌ అధ్యక్షత-2026 కింద ‘బ్రిక్స్’ ఆరోగ్య మంత్రుల 16వ సదస్సు విజయవంతం


బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల 16వ సదస్సు తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వాన భారత ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిణామాత్మక సంస్కరణలు: ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డా

భవిష్యత్ సహకారం దిశగా శాశ్వత సంస్థాగత యంత్రాంగాల ఏర్పాటుకు బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల 16వ సదస్సు తీర్మానం: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

ఆరోగ్య సమానత్వం.. ప్రజారోగ్య సహకారంపై కార్యాచరణ చట్రాలకు బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల 16వ శిఖరాగ్ర సదస్సు ఆమోదం

మానసిక ఆరోగ్యంపై బ్రిక్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్‌ సమన్వయ బాధ్యత ‘నిమ్హాన్స్’కు అప్పగింత

प्रविष्टि तिथि: 23 JUL 2026 3:02PM by PIB Hyderabad

   ‘బ్రిక్స్’ కూటమికి భారత్ అధ్యక్షత-2026 కింద చండీగఢ్‌లో ఈ రోజు నిర్వహించిన ఆరోగ్య మంత్రుల 16వ శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. సభ్యదేశాల్లో సమష్టి ప్రజారోగ్య ప్రాధాన్యాలపై దృష్టి సారించడంతోపాటు పటిష్ట ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు రూపకల్పనలో సహకార విస్తృతి లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. ఇందులో ‘బ్రిక్స్’ ఆరోగ్య మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు, సీనియర్ అధికారులు, ప్రజారోగ్య నిపుణులు పాల్గొన్నారు.

భారత్‌ నిర్దేశిత ఇతివృత్తం “పటిష్ట, వినూత్న, సహకారాత్మక, సుస్థిర వ్యవస్థ కోసం కృషి” ప్రాతిపదికన ఈ సదస్సు అనేక కీలక ప్రజారోగ్య సమస్యలపై లోతుగా చర్చించింది. అలాగే, “ఆరోగ్య వ్యవస్థల బలోపేతం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మహమ్మారి నిరోధక సంసిద్ధత పెంపు, నిరంతర సహకారంతో సార్వత్రిక ఆరోగ్య భద్రత విస్తృతి” తదితరాలపై సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించే దిశగా సభ్య దేశాలకు ఒక వేదికగా నిలిచింది.

ప్రారంభోపన్యాసం

ఈ సదస్సుకు హాజరైన వారినుద్దేశించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ప్రధానోపన్యాసం చేశారు. ముందుగా బ్రిక్స్ సభ్యత్వ-భాగస్వామ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు, సీనియర్ అధికారులను చండీగఢ్‌కు స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్‌కు భారత్‌ అధ్యక్షత వహించిన కాలమంతటా నిరంతర సహకారంపై ధన్యవాదాలు తెలిపారు. వర్ధమాన దేశాల మధ్య సహకార విస్తృతికి తోడ్పడే వేదికగా బ్రిక్స్ నిరంతర ప్రభావశీలతను సభ్య దేశాల చురుకైన భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు.

భారత్‌లో ఆరోగ్య సంరక్షణ రంగం పురోగమనాన్ని ప్రస్తావిస్తూ- “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వాన కేంద్ర ప్రభుత్వం ఈ రంగం బలోపేతానికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. ప్రజారోగ్య అవసరాలే పరమావధిగా విధానాల రూపకల్పన, ఆరోగ్య సంరక్షణ సేవల మెరుగుదల, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, సేవా ప్రదాన వ్యవస్థల విస్తరణ వంటి అనేక చర్యలు తీసుకుంది” అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరించారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య రంగ సుస్థిర ప్రగతి దిశగా పటిష్ట ప్రజారోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య భద్రత అత్యంత అవశ్యమనే అంశాన్ని భారత్ అనుభవం మరింత ప్రస్ఫుటం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

రెండు దశాబ్దాలుగా బ్రిక్స్ సాధించిన ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- వర్ధమాన దేశాల గళాన్ని శక్తిమంతంగా వినిపించిన కూటమిగా ఇది ఆవిర్భవించిందని శ్రీ నడ్డా గుర్తుచేశారు. మరింత సమ్మిళిత, సమాన ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో ప్రభావశీల వేదికగా రూపొందిందని ఆయన పేర్కొన్నారు. అంటువ్యాధులు, అసాంక్రమిక వ్యాధుల భారం, వాతావరణ సంబంధిత ఆరోగ్య ముప్పులు, సాంకేతిక పురోగమన వేగం తదితర అంశాల్లో బహుపాక్షిక సహకారం సహా బలమైన సంస్థాగత భాగస్వామ్యాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. “పటిష్ట, వినూత్న, సహకారాత్మక, సుస్థిర వ్యవస్థ కోసం కృషి” ఇతివృత్తంగా భారత్‌ ఈ సదస్సు నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ- మున్ముందు తలెత్తే ప్రజారోగ్య సవాళ్లను ముందుగానే పసిగట్టి, సమర్థంగా స్పందించే పటిష్ట ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపైనే ప్రపంచ ఆరోగ్య భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా “సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః” (అందరూ సుఖంగా ఉండాలి... అందరూ ఆరోగ్యంగా ఉండాలి) అనే ప్రాచీన భారత శ్లోకాన్ని శ్రీ నడ్డా ఉటంకించారు. అనారోగ్యానికి చికిత్సతో సరిపెట్టడం కాకుండా, వ్యాధి నివారణ, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ప్రజారోగ్య వ్యవస్థ పరమోద్దేశంగా ఉండాలన్నారు.

‘బ్రిక్స్’ అధ్యక్ష హోదాలో ఆరోగ్య రంగంలో భారత్‌ ప్రాథమ్యాలను వివరిస్తూ- ప్రపంచవ్యాప్త  క్షయ వ్యాధి భారంలో దాదాపు సగం ఈ కూటమి దేశాలపైనే ఉందని శ్రీ నడ్డా గుర్తుచేశారు. అందువల్ల ‘బ్రిక్స్ టీబీ రీసెర్చ్ నెట్‌వర్క్’ను మరింత బలోపేతం చేస్తే ఉమ్మడి పరిశోధనలు, నవ్యావిష్కరణలు, ఆచరణాత్మక అధ్యయనాలు వేగం పుంజుకోగలవని చెప్పారు. తద్వారా వినూత్న రోగనిర్ధారణ విధానాలు, చికిత్సలు, టీకాలు అందరికీ సమానంగా లభిస్తాయని, ప్రపంచ క్షయ నిర్మూలన లక్ష్య సాధనకు ఎంతగానో తోడ్పాటు లభిస్తుందని స్పష్టం చేశారు.

బ్రిక్స్ కూటమి దేశాల్లోని వైద్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థల మధ్య సహకార బలోపేతం ఆవశ్యకతను ఆయన వివరించారు. ఇందులో భాగంగా బ్రిక్స్‌ దేశాల్లో ఉత్తమ పద్ధతులపై (‘బ్రిక్స్ జీఎక్స్‌పీ’) శ్వేతపత్రం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నియంత్రణ నాణ్యత పెంపు, సమన్వయం, సామర్థ్య వికాసం సహా వైద్య ఉత్పత్తుల నాణ్యత-భద్రత-సమర్థతకు భరోసా దిశగా ఇదొక కీలక మలుపని ఆయన అభివర్ణించారు. భవిష్యత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై సన్నద్ధత ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- అంటువ్యాధుల నివారణ-ప్రతిస్పందన దిశగా బ్రిక్స్ సమీకృత ముందస్తు హెచ్చరికల వ్యవస్థపై ఉప కార్యవర్గం ఏర్పాటు సహా  దాని విధివిధానాలకు ఆమోద ముద్ర వేయడాన్ని మంత్రి స్వాగతించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ఆరోగ్య భద్రత పటిష్టత దిశగా ఇదొక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటల్ సాంకేతికతల విప్లవాత్మక పాత్రను ప్రస్తావిస్తూ-ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ‘ఈ-సంజీవని’ దూరవైద్య సంప్రదింపుల వేదిక ద్వారా భారత్‌ సముపార్జించిన అనుభవం సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల అపార సామర్థ్యాన్ని నిరూపించిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు. ముఖ్యంగా సుదూర, వైద్య సేవలు సవ్యంగా అందని ప్రాంతాల్లో అందరికీ ఆరోగ్య సేవల ప్రదానం-విస్తరణలో ఈ సదుపాయాల పాత్ర కీలకమని చెప్పారు.

సుదూర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం సహా నిరంతర సేవల దిశగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థపై బ్రిక్స్ సంకలనం ఆవిష్కరణపైనా శ్రీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. కూటమి దేశాల మధ్య సహకారం, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం, పరస్పర అభ్యసన సౌలభ్యంలో ఇదొక విలువైన విజ్ఞాన వనరుగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. జీవనశైలి వ్యాధులు, అసాంక్రమిక వ్యాధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణపై నిశితంగా దృష్టి సారించాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ‘ఆరోగ్యకర జీవనశైలి కోసం బ్రిక్స్ మిషన్’తో పాటు ‘ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సాహకాల సంయుక్త కార్యాచరణపై బ్రిక్స్ ప్రణాళికకు (2026-2029)’ శ్రీకారం చుట్టడాన్ని ఆయన అభినందించారు. బ్రిక్స్ దేశాల్లో పౌష్టికాహారం, క్రమబద్ధ వ్యాయామం, సంప్రదాయ ఆహార సంస్కృతి పరిరక్షణ, నిదర్శనాధారిత ప్రవర్తనా మార్పును ఇవి ప్రోత్సహిస్తాయని స్పష్టం చేశారు.

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యాన్ని అత్యంత కీలక స్తంభంగా శ్రీ నడ్డా పేర్కొన్నారు. సభ్య దేశాలలో పరిశోధనలను ముమ్మరం చేయడం, మానసిక ఆరోగ్యం దిశగా ప్రోత్సాహం, చికిత్స ప్రక్రియలలో అంతరాల తగ్గింపు లక్ష్యంగా ‘నిమ్‌హాన్స్’కు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ ‘బ్రిక్స్ మానసికారోగ్య విశిష్ట కేంద్రాల నెట్‌వర్క్’ ఏర్పాటును ఆయన ప్రకటించారు. దీంతోపాటు ఆరోగ్య సమానత్వం దిశగా శాస్త్రీయ సహకారం, ప్రజారోగ్య సమాచారం, బహుళ రంగ చర్యలకు ఉద్దేశించిన శాశ్వత సంస్థాగత చట్రం ‘ఆపరేషనల్ ఫ్రేమ్‌వర్క్ టు ఫైట్ ఎగైనెస్ట్ డిసీజెస్ డ్రివెన్ బై సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్’కు ఆమోదం తెలపడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ‘బ్రిక్స్ నెట్‌వర్క్ ఆఫ్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్స్’ పేరిట ఒక ఆచరణాత్మక చట్రానికి కూడా ఆమోదముద్ర పడిందని పేర్కొన్నారు. సహకారాత్మక పరిశోధనల బలోపేతం, అత్యావశ్య వైద్య ఉత్పత్తుల సమాన లభ్యత మెరుగుదల, బ్రిక్స్ న్యూక్లియర్ మెడిసిన్‌లో సహకారంపై చర్చలు, టీకాల పరిశోధన-అభివృద్ధి కేంద్రం కార్యకలాపాలకు నిరంతర చేయూత తదితరాలను కూడా  మంత్రి ప్రస్తావించారు.

నిర్దిష్ట ప్రాధాన్య రంగాల్లో కూటమి దేశాల మధ్య ఉత్తమ విధానాల ఆదానప్రదానాన్ని శ్రీ నడ్డా అభినందించారు. అలాగే, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ, ఆరోగ్యకర జీవనశైలి, మానసిక ఆరోగ్యం, ప్రజారోగ్యంపై సామాజికాంశాల ప్రభావంతో సంక్రమించే వ్యాధులు, జాతీయ ప్రజారోగ్య సంస్థలు వంటివాటిపై బ్రిక్స్ సంకలనాల పరంపర ఆవిష్కరణను స్వాగతించారు. ఈ విజ్ఞాన వనరులతో కూటమి దేశాల మధ్య పరస్పర అభ్యసన సౌలభ్యం కలుగుతుందని, దీంతోపాటు విస్తృత ప్రజారోగ్య చర్యలకు మద్దతు కూడా లభించగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.

చిరవగా- బ్రిక్స్‌ ఆరోగ్య మంత్రుల 16వ శిఖరాగ్ర సదస్సు ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రస్తావిస్తూ- ఇది ఏకాభిప్రాయంతో రూపొందిన పత్రానికి పరిమితం కాదని, అంతకన్నా అమూల్యమైనదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డా అభివర్ణించారు. బ్రిక్స్ దేశాల మధ్య భవిష్యత్‌ సహకార విస్తృతి దిశగా శాశ్వత సంస్థాగత యంత్రాంగాల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుందన్నారు. వర్ధమాన దేశాల ఆకాంక్షలను గుర్తుచేస్తూ- మానవాళి శ్రేయస్సుకు తోడ్పడే సమ్మిళిత, సహకారాత్మక, సమానత్వ సహిత అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థ దిశగా భారత్‌ దృక్కోణాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

యావత్‌ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించే ప్రాచీన భారత తాత్త్విక సూత్రం “వసుధైవ కుటుంబకం” గురించి వివరిస్తూ- సకలజన ఆరోగ్య సౌభాగ్యం దిశగా సంఘీభావం, భాగస్వామ్యం, సమష్టి కర్తవ్య స్ఫూర్తితో ఏకతాటిపై కృషి చేయాలని బ్రిక్స్ దేశాలకు పిలుపునిస్తూ శ్రీ నడ్డా తన ప్రసంగం ముగించారు.

నేటి కార్యక్రమ విశేషాలు

‘బ్రిక్స్‌’కు భారత్‌ అధ్యక్షత కింద గుర్తించిన తొమ్మిది ప్రాధాన్య రంగాలపై మంత్రుల స్థాయి చర్చలు కేంద్రీకృతమయ్యాయి. సహకారం, విజ్ఞాన ఆదానప్రదానం ద్వారా ఆరోగ్య వ్యవస్థల బలోపేతం సహా కొత్త ప్రజారోగ్య సమస్యల పరిష్కారంపై సమష్టి నిబద్ధతను ఈ చర్చలు ప్రతిబింబించాయి.

క్షయ వ్యాధి నిర్మూలన కృషిని వేగిరపరచడంలో భాగంగా ఉమ్మడి పరిశోధన, నవ్యావిష్కరణలు, విజ్ఞాన ఆదానప్రదానాన్ని ప్రోత్సహించే ‘బ్రిక్స్ టీబీ రీసెర్చ్ నెట్‌వర్క్’కు తమ చేయూతను సభ్య దేశాలు పునరుద్ఘాటించాయి.

నియంత్రణ వ్యవస్థల బలోపేతం, చర్యల సమన్వయం సహా సురక్షిత, ప్రభావశీల, నాణ్యతకు భరోసా గల వైద్య ఉత్పత్తుల లభ్యత మెరుగుదల లక్ష్యంగా కూటమి వైద్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థల మధ్య సహకార విస్తృతిపైనా మంత్రులు దృష్టి సారించారు.

ప్రపంచ ఆరోగ్య భద్రత ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ- అంటువ్యాధుల నివారణ-ప్రతిస్పందనపై బ్రిక్స్ సమీకృత ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై ప్రత్యేక ఉప కార్యవర్గం ఏర్పాటును మంత్రులు స్వాగతించారు. సభ్య దేశాలన్నిటా సహకారం, వ్యాధులపై నిఘా, సమాచార భాగస్వామ్యం, సమన్వయ సహిత ప్రజారోగ్య సంసిద్ధత, సత్వర ప్రతిస్పందన బలోపేతం తదితరాలకు ఉద్దేశించిన విధివిధానాలకు ఆమోదముద్ర వేశారు.

ఇక ప్రతినిధి బృందాల స్థాయి చర్చల సందర్భంగా- నిరంతర సంరక్షణ లక్ష్యంగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, పరస్పర సంధానిత వ్యవస్థలకు శ్రీకారం, సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా మారుమూల-సవ్యంగా సేవలందని జనాభాకు నాణ్యమైన ఆరోగ్య సేవల ప్రదాన అవకాశాలపై దృష్టి సారించారు.

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యాన్ని అంతర్భాంగా గుర్తిస్తూ- మానవాళి మానసిక శ్రేయస్సు లక్ష్యంగా ‘బ్రిక్స్ నెట్‌వర్క్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుపై మంత్రులు హర్షం వెలిబుచ్చారు. ఈ వ్యవస్థకు భారత్‌లోని ‘నిమ్హాన్స్’ సంస్థ సమన్వయ నైపుణ్య కేంద్రంగా వ్యవహరిస్తుంది. మరోవైపు శిక్షణ, విజ్ఞాన-ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం ద్వారా మానవ వనరుల సామర్థ్య బలోపేతంపై బ్రిక్స్ శిక్షణ కేంద్రం నెట్‌వర్క్ ఏర్పాటును కూడా సభ్య దేశాలు ఆమోదించాయి. కూటమి దేశాలన్నిటా సహకారాత్మక పరిశోధన, విధాన చర్చలు, నిదర్శానాధారిత మానసిక ఆరోగ్య కార్యక్రమ వ్యూహాల రూపకల్పనకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

నిదర్శనాల సమీకరణ, సహకారాత్మక పరిశోధన, విజ్ఞాన ఆదానప్రదానాల ద్వారా సంప్రదాయ, అనుబంధ, సమగ్ర వైద్య విధానాన్ని ప్రోత్సాహించే అంశాన్ని కూడా ఈ సదస్సు పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో ‘బ్రిక్స్ హెల్త్ ట్రాక్’ కింద ప్రాచీన, సంప్రదాయ వైద్య విధానాల (టిసీఐఎం)పై బ్రిక్స్ నిపుణుల కార్యవర్గం ఏర్పాటు ప్రతిపాదనను సభ్య దేశాలు స్వాగతిస్తూ, దాని విధివిధానాలను ఆమోదించాయి. కూటమి దేశాల మధ్య చర్చలు, సహకారం సహా ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానంలో ఇదొక కీలక వేదిక కాగలదని అభిప్రాయపడ్డాయి.

కూటమి దేశాల్లోని స్థానిక పరిస్థితులకు తగిన విధంగా ఆరోగ్య సమానత్వం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల దిశగా సామూహిక కార్యాచరణను బలోపేతం ప్రాధాన్యాన్ని మంత్రులు గుర్తించారు. తదనుగుణంగా ప్రతిపాదించిన “సామాజికాంశాల ప్రభావిత వ్యాధులపై పోరుకు బ్రిక్స్ కార్యాచరణ చట్రా”నికి (డీడీ-ఎస్‌డీహెచ్‌) ఆమోద ముద్ర వేశారు. దీంతోపాటు పరస్పర గౌరవం, సమ్మిళితత్వం, సహకారం, సుస్థిరత సూత్రానుగుణంగా రూపొందించిన “బ్రిక్స్ జాతీయ ప్రజారోగ్య సంస్థల నెట్‌వర్క్ కార్యాచరణ చట్రా”న్ని కూడా ఆమోదించారు. దీనికింద విజ్ఞాన ఆదానప్రదానం, నిదర్శనాధారిత విధాన రూపకల్పన, సామర్థ్య వికాసం, సాంకేతిక తోడ్పాటుతో సంస్థాగత సహకార విస్తృతికి వీలుంటుంది.

‘బ్రిక్స్ న్యూక్లియర్ మెడిసిన్‌’ చట్రం అమలులో ప్రస్తుత సహకారాన్ని ప్రతినిధుల బృందాలు కూడా స్వాగతించాయి. సహకారాత్మక పరిశోధనల బలోపేతం, సురక్షిత, ప్రభావశీల టీకాల సార్వత్రిక లభ్యత మెరుగుదల కోసం ‘బ్రిక్స్ టీకాల పరిశోధన-రూపకల్పన కేంద్రా’నికి మద్దతును పునరుద్ఘాటించాయి.

ఈ సదస్సులో భాగంగా ‘ఈట్ రైట్ ఇండియా’ కార్యక్రమం కింద ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ చిరుధాన్యాల వినియోగంపై నిర్వహించిన ప్రత్యక్ష ప్రదర్శన సహా ‘ఎన్‌హెచ్‌ఏ’, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఎగ్జిబిషన్ కేంద్రాలను ఆరోగ్య మంత్రులు, ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గోష్ఠిలో డిజిటల్ ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, ఆహార భద్రత, ఆరోగ్యకర జీవనశైలి తదితరాల్లో భారత్‌ అమలు చేస్తునన కార్యక్రమాలను కూడా ప్రదర్శించారు.

బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల తీర్మానం ఏకగ్రీవ ఆమోదం

ఆరోగ్య రంగంలో సహకార విస్తృతి, పటిష్ట-సార్వత్రిక, ప్రజా కేంద్రక ఆరోగ్య వ్యవస్థల బలోపేతం తదితరాలపై బ్రిక్స్ దేశాల సమష్టి నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తూ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల 16వ సదస్సు తీర్మానం ఏకగ్రవ ఆమోదం పొందడం ఒక విశిష్ట ఘట్టం.

ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన అనేక అంశాల్లో కూటమి సభ్యదేశాల నిబద్ధతను ఈ తీర్మానం పునరుద్ఘాటించింది. ఈ మేరకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కొనసాగింపు, మహమ్మారి ముప్పు నివారణ-సంసిద్ధత- ప్రతిస్పందన వ్యవస్థ బలోపేతం, డిజిటల్ ఆరోగ్య విధానాలకు ప్రోత్సాహం ఆవశ్యకతను స్పష్టం చేసింది. నియంత్రణ వ్యవస్థల మధ్య సహకారం మెరుగుదల, సంయుక్త పరిశోధనల విస్తరణ, సాంక్రమిక-అసాంక్రమిక వ్యాధులపై పోరు, మానసిక ఆరోగ్యం-ఆరోగ్యకర జీవనశైలికి మద్దతును విశదీకరించింది. సంప్రదాయ వైద్య రంగ బలోపేతం, చౌకధరతో మందులు-టీకాలు-రోగ నిర్ధారణ ఉపకరణాల లభ్యత, వైద్య సాంకేతికతల సమాన సౌలభ్యం తదితరాల ప్రాధాన్యాన్ని కూడా ప్రస్ఫుటం చేసింది.

జాతీయ ప్రకటనలు - ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం

బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు తమతమ జాతీయ ప్రజారోగ్య ప్రాథమ్యాలు, విజయాలు, విధానపరమైన కార్యక్రమాలను వివరిస్తూ ఈ సదస్సులో అధికారిక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా కూటమి దేశాల్లో పటిష్ట ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ విస్తరణకు, మహమ్మారి సంసిద్ధత-ప్రతిస్పందన మెరుగుకు, డిజిటల్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, చౌక- నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ విస్తరణకు, పరిశోధన-ఆవిష్కరణ, సామర్థ్య వికాసంలో సహకారం పెంచేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. అలాగే, సాంక్రమిక-అసాంక్రమిక వ్యాధులపై పోరాటానికి, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి, ఔషధ నియంత్రణ మెరుగుదలకు, సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతినిధి బృందాలు వివరించాయి.

బ్రిక్స్ ఆరోగ్య రంగ చట్రం సమర్థ అమలులో భారత్‌ నాయకత్వాన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. ఈ మేరకు భారత్‌ అధ్యక్షతన గుర్తించిన 9 నిర్దిష్ట ప్రాధాన్య రంగాలపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించడాన్ని ప్రశంసించాయి. బ్రిక్స్‌ క్షయ పరిశోధన నెట్‌వర్క్‌బలోపేతం, వైద్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థల మధ్య సహకార విస్తృతి, అంటువ్యాధుల నివారణ-ప్రతిస్పందన కోసం బ్రిక్స్‌ సమీకృత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అమలుకు మద్దతు ప్రకటించాయి. అలాగే, నిరంతర ఆరోగ్య సంరక్షణ కోసం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ రూపకల్పనతోపాటు ఆరోగ్యకర జీవనశైలిపై బ్రిక్స్‌ కార్యక్రమానికి ప్రోత్సాహం దిశగానూ భరోసా ఇచ్చాయి. మానసిక ఆరోగ్యంపై సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్, జాతీయ ప్రజారోగ్య సంస్థల నెట్‌వర్క్, సామాజికాంశ ప్రభావిత వ్యాధి నివారణ కార్యక్రమాల ద్వారా సంస్థాగత సహకారానికి తోడ్పాటునిస్తామని ప్రతినిధి బృందాలు ప్రకటించాయి. సహకార విస్తృతికి దోహదం చేసే సంకలనాలను, కార్యాచరణ చట్రాలను సభ్యదేశాలకు కీలక విజ్ఞాన వనరులుగా బ్రిక్స్ అందించడాన్ని అభినందించాయి.

అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో సత్ఫలితాల సాధన కోసం సమష్టి కార్యాచరణతో సభ్య దేశాలు ఎలా ముందడుగు వేయాలో విజయవంతంగా ముగిసిన బ్రిక్స్‌ ఆరోగ్య మంత్రుల 16వ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించింది. ఈ మేరకు భాగస్వామ్యం, ఆవిష్కరణలు, పునరుత్థాన సామర్థ్యం తదితరాలకు మరింత మెరుగుపెడుతూ సుస్థిర ప్రగతికి సామూహికంగా కృషి చేయాలని పిలుపునిచ్చింది.

 

***


(रिलीज़ आईडी: 2288649) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Urdu , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil