అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ సైన్స్, గణిత ఒలింపియాడ్స్–2026లో భారత యువశక్తిని చాటిన డీఏఈ ఒలింపియాడ్ కార్యక్రమం

అంతర్జాతీయ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, మ్యాథమాటిక్స్ ఒలింపియాడ్స్–2026లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారతీయ విద్యార్థులు: శాస్త్రీయ నైపుణ్యంలో అంతర్జాతీయంగా భారత స్థానం బలోపేతం

అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్, కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో గోల్డెన్ స్వీప్‌తో సహా 2026లో 12 స్వర్ణ, 7 రజత పతకాలు
అణు విద్యుత్ విభాగం (డీఏఈ) పరిధిలోని ఎయిడెడ్ సంస్థ అయిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్) జాతీయ కేంద్రమైన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్ఈ) నేతృత్వంలో సాగిన సైన్స్, గణిత నేషనల్ ఒలింపియాడ్ కార్యక్రమాల సామర్థ్యాన్ని ప్రదర్శించిన విజయాలు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్, గణిత పోటీల్లో రాణించేలా దేశంలోనే అత్యంత ప్రతిభావంతులను గుర్తించడానికి, వారికి మార్గదర్శకత్వం అందించి, సిద్ధం చేయడానికి సంస్థాగత పునాదిని అందించిన అణు విద్యుత్ విభాగం

నాడు పోస్టు చేయడమైనది: 22 JUL 2026 11:52AM by PIB Hyderabad

నేషనల్ ఒలింపియాడ్ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు అంతర్జాతీయ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్–2026లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇది భారతదేశంలో శాస్త్రీయ ప్రతిభను ప్రోత్సహించడంలో అణు విద్యుత్ విభాగం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధిని మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ విజయాలు భారతీయ యువతకున్న అసాధారణ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే దేశంలోనే అత్యంత ప్రతిభావంతులను గుర్తించి వారికి మార్గనిర్దేశం, స్ఫూర్తిని అందించడానికి దశాబ్దాల తరబడి నిర్మించిన జాతీయ వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. భారత దేశ యువతకున్న సామర్థ్యాన్ని ఒలింపియాడ్ బృందాలు సాధించిన ఈ విజయం తెలియజేస్తోంది. అదేవిధంగా అంతర్జాతీయ వేదికపై ప్రతిభను చాటుకొనే అవకాశాలను ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించేలా దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న పెట్టుబడి ప్రయత్నాలను కూడా వివరిస్తోంది. 2026 అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాలుగు ఒలింపియాడ్‌ల్లోనూ.. భారత బృందం 12 స్వర్ణ, 7 రజత పతకాలను గెలుచుకుంది. వాటిలో భౌతిక, రసాయన శాస్త్ర ఒలింపియాడ్స్‌లో పాల్గొన్నవారంతా బంగారు పతకాలు సాధించడం చరిత్రాత్మకం. జీవ, గణిత శాస్త్రాల్లోనూ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులతో పోటీపడిన భారతీయ విద్యార్థులు అసాధారణ శాస్త్రీయ నైపుణ్యాన్ని, పట్టుదలను, సృజనాత్మకతను ప్రదర్శించారు. దేశానికి గర్వకారణంగా నిలిచారు. సైన్స్, గణితంలో ప్రపంచ శక్తిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేశారు.

 

International Olympiads in 2026

 

India's Performance

 

International Physics Olympiad

 

All 5 Gold, Joint World No. 1

 

International Chemistry Olympiad

 

All 4 Gold, Joint World No. 1

 

International Biology Olympiad

 

1 Gold, 3 Silver

 

International Mathematical Olympiad

 

2 Gold, 4 Silver

 

 

 

అసాధారణ విజయం సాధించిన విద్యార్థులను అణు విద్యుత్ విభాగం కార్యదర్శి, అణు విద్యుత్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మహంతి అభినందించారు. ‘‘అంతర్జాతీయ ఒలింపియాడ్‌ల్లో భారత విద్యార్థులు కనబరిచిన అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణం. ఇది భారత దేశ శాస్త్రీయ స్ఫూర్తికి వేడుకలాంటిది. ఈ విజయాలు విద్యార్థుల అంకితభావాన్ని, వారికి మార్గదర్శకులు, ఉపాధ్యాయులు అందించిన అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని, దశాబ్దాల తరబడి ఎంతో శ్రమకోర్చి నిర్మించిన సంస్థాగత వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి’’ అన్నారు.

అణు విద్యుత్ విభాగం పరిధిలోని ఎయిడెడ్ సంస్థ అయిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్) జాతీయ కేంద్రమైన హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్ఈ) ఈ విజయంలో ప్రధాన భూమిక పోషించింది. భారత సైన్స్, గణిత ఒలింపియాడ్ కార్యక్రమాలకు జాతీయ నోడల్ కేంద్రంగా హెచ్‌బీసీఎస్ఈ ఉంది. ఇది బహుళ దశల ప్రక్రియ ద్వారా ప్రతిభను గుర్తించడం, అవగాహన పెంపొందించడం, మెరుగైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించడం ద్వారా ప్రీయూనివర్శిటీ స్థాయి విద్యార్థులను అత్యున్నత అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా సన్నద్ధం చేస్తుంది. డీఏఈ అందిస్తున్న సంస్థాగత మద్దతు, శాస్త్రీయ నైపుణ్యం పెంపొందించడంలో నిబద్ధత కారణంగా ఈ కార్యక్రమం ప్రపంచంలోనే గౌరవప్రదమైన ఒలింపియాడ్ వ్యవస్థగా మారింది.

 

భారత ఒలింపియాడ్ కార్యక్రమాన్ని ప్రోత్సహించేలా డీఏఈ అందిస్తున్న మద్దతును హెచ్‌బీసీఎస్ఈ సెంటర్ డైరెక్టర్ ప్రొపెసర్ అర్ణబ్ భట్టాచార్య ప్రశంసించారు. ‘‘హెచ్‌బీసీఎస్‌ఈకి అందిస్తున్న అమూల్యమైన సహకారానికి, దేశంలో శాస్త్రీయ ప్రతిభను ప్రోత్సహించాలన్న సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నందుకు అణు విద్యుత్ విభాగానికి కృతజ్ఞతలు. తర్వాతి తరం యువ మేధావులను గుర్తించడం, ప్రోత్సహించడం, స్ఫూర్తి నింపడం అనే మా లక్ష్యాన్ని మా విద్యార్థులు సాధించిన అద్భుతమైన ప్రదర్శనలు బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా సైన్స్, గణితంలో నెపుణ్యాలను పెంపొందించుకొనే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి’’ అని తెలియజేశారు.

 

అణు విద్యుత్ విభాగం అందిస్తున్న సాయం కేవలం ఆర్థిక తోడ్పాటుకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు, సబ్జెక్టు నిపుణులను ఒక్కచోట చేర్చి శాస్త్రీయ ప్రతిభను ప్రోత్సహించే ఉమ్మడి జాతీయ వ్యవస్థను తయారు చేయడంలో టీఐఎఫ్ఆర్, హెచ్‌బీసీఎస్ఈలకు డీఏఈ సహకారం అందించింది. భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, శాస్త్రీయ నాయకత్వంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒలింపియన్లను ఈ సహకారాత్మక విధానం తీర్చిదిద్దుతోంది.

పతక విజేతలకు, బృంద నాయకులకు, సైంటిఫిక్ అబ్జర్వర్లకు, హెచ్‌బీసీఎస్‌ఈలోని ఒలింపియాడ్ విభాగాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, దేశవ్యాప్తంగా ఉన్న రిసోర్స్ పర్సన్ వ్యవస్థకు అణు విద్యుత్ విభాగం అభినందనలు తెలియజేసింది. వీరందరి అంకితభావంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపింది. అలాగే భారత దేశ జాతీయ ఒలింపియాడ్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో శాస్త్ర, సాంకేతిక విభాగం, అంతరిక్ష విభాగం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అందిస్తున్న నిరంతర సహకారాన్ని కూడా డీఏఈ ప్రశంసించింది.

 

శాస్త్రీయ విద్య, ప్రతిభకు ప్రోత్సాహం అందించేందుకు పెడుతున్న పెట్టుబడుల సానుకూల ప్రభావాన్ని 2026లో భారత ఒలింపియాడ్ బృందాలు సాధించిన విజయాలు తెలియజేస్తున్నాయి. అంతర్జాతీయ విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో యువ శాస్త్రీయ మేధకు స్ఫూర్తిని అందించాలనే, నైపుణ్య సంస్థలను బలోపేతం చేయాలనే, సైన్స్, ఆవిష్కరణ, మానవ సామర్థ్యంతో కూడిన భవిష్యత్తును నిర్మించాలనే నిబద్ధతకు అణు విద్యుత్ విభాగం కట్టుబడి ఉంది.

 

  

 

image.png

కొలంబియాలోని బుకారామాంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐపీహెచ్‌వో)--2026లో భారత జట్టు

 

 

 

image.png

 ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన 58వ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారత జట్టు

 

 

 

image.png

లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ బయోలజీ ఒలింపియాడ్–2026లో భారత జట్టు

 

 

 

image.png

చైనాలోని షాంఘైలో జరిగిన 67వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత జట్టు

***


(రిలీజ్ ఐడి: 2288273) సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Gujarati , English , Manipuri , Urdu , Marathi , हिन्दी , Punjabi