వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ష్ట్రాల తోతాపురి మామిడి రైతులకు ఉపశమనాన్ని కలిగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
రైతుల ఫిర్యాదుల విషయంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పణ
క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి పొలాలు, మార్కెట్లు, కర్మాగారాలను సందర్శించిన కమిటీ
రైతులు, వినియోగదారుల ప్రయోజనం కోసం మామిడి పానీయాలలో 22-25 శాతం నిజమైన గుజ్జును తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
తోతాపురి మామిడి తోటలలో కొత్త రకాలు, టాప్-వర్కింగ్ పద్ధతుల ద్వారా ఉద్యానవన రంగాన్ని మెరుగుపరచడానికి భారీ ప్రణాళిక: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
రైతు ప్రయోజనాల కోసం జోనల్ కొనుగోలు, ఫ్రూట్ బ్యాగులు, ఎఫ్‌పీఓ ఆధారిత ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలన్న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
కేంద్రం, రాష్ట్రాలు, ఐకార్, అపెడా కలిసి తోతాపురి విలువకు ఒక కొత్త దిశను నిర్దేశిస్తాయి: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
प्रविष्टि तिथि:
22 JUL 2026 6:26PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తోతాపురి మామిడిని పండించే రైతుల ఆదాయాలు తగ్గడం, మార్కెట్లలో ధరలు పడిపోవడంపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ- గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తాను స్వయంగా ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులపై విస్తృతంగా చర్చించిన అనంతరం తోతాపురి మామిడి సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలో సమగ్ర మార్పుల కోసం ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ఢిల్లీలోని కృషి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా తోతాపురి మామిడి విలువను బలోపేతం చేసేందుకు ఈ సందర్భంగా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కమిటీ స్వయంగా పొలాలు, మార్కెట్లు, గుజ్జు తయారుచేసే యూనిట్లను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక అందించింది. కేవలం నివేదిక తయారు చేయడంతోనే సరిపెట్టుకోకుండా విధానపరమైన, సాంకేతికపరమైన, మార్కెట్ అనే మూడు స్థాయిలలోనూ స్పష్టమైన, నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించేందుకు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐకార్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్.ఎల్. జాట్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కమిటీ ఛైర్మన్, ఐకార్–సీఐఎస్‌హెచ్ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్, లక్నో) డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ టీ నివేదికను సమర్పించారు. తోతాపురి మామిడి సాగు విస్తీర్ణం, ధరల్లో తగ్గుదలకు సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కారాలను సూచించేందుకు ఐకార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికపైనే ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. 2026 జూలై 2 నాటి ఉత్తర్వు ద్వారా ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఐకార్- సీఐఎస్‌హెచ్, ఐకార్–ఐఐహెచ్ఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, బెంగళూరు) శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు ఈ కమిటీ జూలై 8 నుంచి 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇందులో భాగంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ), మార్కెట్ ప్రతినిధులు, గుజ్జు తయారుచేసే యూనిట్లు, ఎగుమతిదారులు, జిల్లా యంత్రాంగంతో సమావేశమై తోతాపురి మామిడి విలువ గొలుసుకు సంబంధించిన అన్ని దశలను సమీక్షించింది.
సమావేశంలో నివేదికను సమర్పించిన కమిటీ.. ఈ ఏడాది తోతాపురి మామిడి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణాలను వివరించింది. ప్రాసెసింగ్ సామర్థ్యం, కొనుగోలు ఏర్పాట్లలో సమయానికి సరైన సమన్వయం లేకపోవడం.. దేశీయ మార్కెట్‌లో మామిడి ఆధారిత పానీయాలలో నిజమైన గుజ్జు (రాయల్ పల్ప్) పరిమాణం తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఇందుకు ముఖ్య కారణాలని పేర్కొంది. చాలా చోట్ల సీజన్ ప్రారంభంలో ఫ్యాక్టరీలు కొనుగోళ్లు చేపట్టలేకపోతున్నాయని.. అదే సమయంలో రైతుల పంట ఒకేసారి మార్కెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లకు చేరుతుండటంతో ఒక్కసారిగా ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నారని కమిటీ స్పష్టం చేసింది.
మామిడి ఆధారిత పానీయాల విషయానికి వస్తే ప్రతి పానీయంలోనూ 22 నుంచి 25 శాతం వరకు నిజమైన, సహజసిద్ధమైన మామిడి గుజ్జు ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ గుజ్జు ఉన్న పానీయాలను మాత్రమే 5 శాతం రాయితీ జీఎస్టీ విభాగంలో ఉంచి తక్కువ గుజ్జు ఉండే ఉత్పత్తులపై అధిక పన్ను రేట్లను వర్తింపజేస్తే.. ఒకవైపు తోతాపురి మామిడి గుజ్జు వినియోగం పెరుగుతుందని, మరోవైపు వినియోగదారులకు మరింత పోషకమైన- నిజమైన పండ్ల ఆధారిత పానీయాలు లభిస్తాయని కమిటీ అభిప్రాయపడింది.
ఈ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. అవసరమైన ప్రమాణాలు, పన్ను విధానాలపై పరస్పర ఏకాభిప్రాయం సాధించేందుకు వీలుగా సంబంధిత అధికార యంత్రాంగాలైన భారతీయ ఆహార భద్రత- ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), జీఎస్టీ కౌన్సిల్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖల మధ్య అంతర్-మంత్రిత్వ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తోతాపురి మామిడి విలువను స్థిరీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల కోసం ఒక అత్యున్నత సంస్థాగత వ్యవస్థగా వ్యవహరించేలా ‘కేంద్ర సమన్వయ, ధరల స్థిరీకరణ కమిటీ’ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రతి మామిడి సీజన్‌కు ముందు ఈ కమిటీ దిగుబడి అంచనాలు, ప్రాసెసింగ్, ఎగుమతి డిమాండ్, వ్యవసాయ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులను సమీక్షిస్తుంది. ఇది రైతులకు సూచనాత్మక లాభదాయక ‘పొలం వద్ద (ఫార్మ్-గేట్)’ కొనుగోలు ధరలను, మామిడి గుజ్జు కోసం రెఫరెన్స్ ధరలను నిర్ణయించడంలో సహాయపడుతుంది. దీనివల్ల రైతులు, ప్రాసెసింగ్ పరిశ్రమ ఇద్దరికీ ముందుగానే స్పష్టమైన అంచనాలు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని తోతాపురి మామిడి సాగు విస్తీర్ణంలో ఎక్కువ భాగం పాత తోటలతో కూడుకుని ఉందనే విషయాన్ని కూడా ఈ సమావేశంలో తెలియజేశారు. ఈ పాత తోటల వల్ల దిగుబడితో పాటు నాణ్యత కూడా గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు 'టాప్-వర్కింగ్' (ఉన్నత స్థాయి రకాలతో అంటుకట్టడం) సాంకేతికత ద్వారా తోటలను పునరుద్ధరించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ పద్ధతి ద్వారా ప్రస్తుతం ఉన్న చెట్లపై నీలం, అల్ఫోన్సో, హిమాయత్, బంగినపల్లి వంటి అధిక విలువ కలిగిన రకాలను అంటుకట్టడం ద్వారా రెండు నుంచి మూడు సంవత్సరాలలోనే మరింత లాభదాయకమైన దిగుబడిని పొందొచ్చు. దీనితో పాటు క్లస్టర్ స్థాయిలో మంచి వ్యవసాయ పద్ధతులను(జీఏపీ) అమలు చేయడంపై.. రైతులకు శిక్షణ, ప్రదర్శన తోటలు, సాంకేతిక సహాయాన్ని అందించడంపై సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించారు.
మామిడి పండ్ల నాణ్యతను మెరుగుపరచడం, దేశీయ మార్కెట్ ప్రీమియం విభాగంలో వినియోగాన్ని పెంచడం కోసం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని సుమారు 23,333 హెక్టార్ల విస్తీర్ణంలో తొలి విడతగా 'పండ్లకు వేసే రక్షణ తొడుగులు’ (ఫ్రూట్ బ్యాగ్స్) అందించాలని కమిటీ సూచించింది. దీనివల్ల పండ్ల బాహ్య రూపం మెరుగ్గా ఉండటమే కాకుండా పురుగుల ఉద్ధృతి తగ్గి తోతాపురి మామిడి పండ్లకు మంచి ధర లభించే మార్కెట్లకు తరలించడానికి వీలవుతుంది. దీనితో పాటు జోనల్ సేకరణ, ప్రాథమిక ప్రాసెసింగ్ ఏర్పాట్లను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేశారు. ఈ వ్యవస్థ కింద ఉద్యానవన శాఖ, ప్రాసెసింగ్ పరిశ్రమ, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) సంయుక్తంగా వార్షిక కొనుగోలు ప్రణాళికను సిద్ధం చేస్తాయి.
ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక ముఖ్యమైన సిఫార్సు చేసింది. ప్రతీ సంవత్సరం మే 15 నుంచే కొనుగోళ్లు, గుజ్జు ఉత్పత్తిని ప్రారంభించడాన్ని అన్ని నమోదు చేసుకున్న ప్రాసెసింగ్ యూనిట్లకు తప్పనిసరి చేస్తూ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ని (ఎస్ఓపీ) జారీ చేయాలని రాష్ట్రానికి సూచించింది.
ఈ సమావేశంలో రైతుల నాయకత్వంలో నడిచే ప్రాసెసింగ్ యూనిట్లు, ఎఫ్‌పీఓ ఆధారిత విలువ జోడింపు నమూనాలపై కూడా చర్చించారు. ఐకార్- సీఐఎస్‌హెచ్, ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మామిడి టెంకల నుంచి ‘మామిడి బటర్', ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసే అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీని ద్వారా తోతాపురి మామిడి పిక్కలు, ఉప ఉత్పత్తులు కూడా రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారతాయి.
తోతాపురి, ఇతర భారతీయ మామిడి రకాల కోసం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అపెడా (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రతినిధులు ఈ సమావేశంలో వివరించారు. ముఖ్యంగా రవాణా ఖర్చులను తగ్గించడానికి, కొత్త గమ్యస్థానాలకు రవాణాను పెంచడానికి సముద్ర మార్గాల ద్వారా ఎగుమతి చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ విషయంపై శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. అపెడా, ఐకార్, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తోతాపురి ఆధారిత ప్రాసెస్డ్ ఉత్పత్తులు, తాజా మామిడి పండ్ల కోసం ఒక సమీకృత ఎగుమతి, మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు.
తోతాపురి మామిడి విలువ గొలుసు మొత్తాన్ని రైతు కేంద్రీకృతంగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐకార్, అపెడా, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), ప్రాసెసింగ్ పరిశ్రమలన్నీ సంయుక్తంగా బాధ్యత వహిస్తాయని.. జీఎస్టీ, ఆహార భద్రతా ప్రమాణాలు, రాష్ట్ర విధానాలను సమన్వయం చేస్తూ ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. సూచించిన చర్యలను సమగ్రంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని తోతాపురి మామిడి రైతులకు శాశ్వత ప్రతిపాదికన ఆదాయం పెరుగుతుందని.. ప్రపంచ మార్కెట్‌లో భారతీయ మామిడి పండ్లకు మరింత బలమైన గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2288086)
आगंतुक पटल : 8