సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆర్థిక సాయం, అంతర్జాతీయ భాగస్వామ్యం, ప్రచారం ద్వారా భారతీయ చలనచిత్ర నిర్మాతలకు ప్రభుత్వం ప్రోత్సాహం
భారతీయ చిత్ర రంగంలోని అవకాశాలు, సవాళ్ల పరిశీలనకు ఉన్నత స్థాయి అధ్యయన బృందం ఏర్పాటు
प्रविष्टि तिथि:
22 JUL 2026 4:15PM by PIB Hyderabad
డెవలప్మెంట్, కమ్యూనికేషన్ అండ్ డిస్సెమినేషన్ ఆఫ్ ఫిల్మిక్ కంటెంట్ (చలనచిత్ర కంటెంట్ అభివృద్ధి, ప్రసారం, వ్యాప్తి-డీసీడీఎఫ్‌సీ) పథకం కింద ప్రాంతీయ చిత్రాల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలకు ఈ కార్యక్రమాలు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. అలాగే
దేశీయ చలనచిత్ర రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా పోటీతత్వాన్ని పెంచడానికి దోహదపడతాయి.
భారతీయ సినీ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయిలో విస్తరించేలా చూడటానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) ద్వారా అర్హులైన చిత్రనిర్మాతలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, ప్రచారాన్ని కల్పించేందుకు ప్రముఖ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, సినీ మార్కెట్లలో భారతీయ చిత్రనిర్మాతల భాగస్వామ్యానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, విదేశీ భాగస్వామ్యాలకు అవకాశాలు సృష్టించడం కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వంటి పరిశ్రమల సంస్థలతో మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తోంది.
భారతీయ సినిమాను ప్రోత్సహించడం, భారతీయ, అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా వేవ్స్ బజార్, పురోగతిలో ఉన్న శిక్షణా కేంద్రాలు, వ్యూయింగ్ రూమ్స్, సినీ మార్కెట్లు, అంతర్జాతీయ సహ నిర్మాణాలను సులభతరం చేస కార్యక్రమాలు ఉన్నాయి. ఈ వేదికలు భారతీయ చిత్రనిర్మాతలకు ప్రాజెక్టు అభివృద్ధి మద్దతు, నెట్వర్కింగ్ అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్ అందుబాటును అందిస్తున్నాయి.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలతో మహారాష్ట్ర దేశంలోనే ప్రముఖ చలనచిత్ర నిర్మాణ కేంద్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ముంబైలోని గోరేగావ్‌లో దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి ఉంది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ), ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) వంటి సంస్థలు ఈ రంగానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని, సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నాయి. వీటితో పాటు ప్రైవేటు రంగానికి చెందిన విస్తృతమైన నిర్మాణ, నిర్మాణానంతర సౌకర్యాల నెట్‌వర్క్ ముంబై, పూణే, నాసిక్ వ్యాప్తంగా పనిచేస్తోంది.
చలనచిత్ర రంగానికి సంబంధించిన సమస్యలు, అంశాలను లోతుగా పరిశీలించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ఉన్నత స్థాయి అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అందించే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో మరింత మెరుగైన విధానపరమైన చర్యలు రూపొందిస్తారు.
లోక్‌సభలో డాక్టర్ అమోల్ రామ్‌సింగ్ కోల్హే అడిగిన నక్షత్ర గుర్తు లేని ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2287992)
आगंतुक पटल : 3