సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం అంగీకారపత్రంపై సంతకం చేసిన వేవ్స్ ఫిల్మ్ బజార్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ 2025 ప్రాజెక్టు ‘యాయావర్- ది మైగ్రేటింగ్ బర్డ్’
స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు... అభివృద్ధి, నిధులు, నిర్మాణం, అంతర్జాతీయ ప్రచారం కోసం ఫిన్‌లాండ్ సంస్థతో భాగస్వామ్యం
प्रविष्टि तिथि:
22 JUL 2026 1:05PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) నిర్వహించిన వేవ్స్ ఫిల్మ్ బజార్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ 2025కి ఎంపికైన ‘యాయావర్-ది మైగ్రేటింగ్ బర్డ్’ ప్రాజెక్టు, అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం ఉద్దేశ్య పూర్వక లేఖపై (లెటర్ ఆఫ్ ఇంటెంట్) పై సంతకం చేసినట్లు వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రకటించింది.
ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు, సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, నిధులు సమకూర్చడానికి, నిర్మించి , ప్రచారం చేయడానికి భారత్‌కు చెందిన ఐరోలర్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిన్లాండ్కు చెందిన నోర్స్ కీ ప్రొడక్షన్స్ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రకారం ఐరోలర్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన నిర్మాతగా వ్యవహరిస్తూ నిధుల సమీకరణ, నిర్మాణ ప్రణాళిక, ఎగ్జిక్యూషన్ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. అలాగే నోర్స్ కీ ప్రొడక్షన్స్ ఫిన్‌లాండ్‌లో ప్రొడక్షన్ అనంతర పనులకు నాయకత్వం వహిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ఆడియెన్స్ చేరువయ్యేలా చూడటం, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సినిమా ప్రచారానికి సహకరిస్తుంది.
భారతీయ కథారచయితల నైపుణ్యాన్ని పెంపొందిస్తూ ప్రపంచ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో ‘వేవ్స్ ఫిల్మ్ బజార్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్' చూపుతున్న ప్రభావానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. స్క్రిప్ట్ అభివృద్ధి చేయడంతో సరిపెట్టుకోకుండా, ఆయా కథలను నిర్మాణం వైపు తీసుకెళ్లడం, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేలా ప్రోత్సహించడంలో ఈ ల్యాబ్ చూపుతున్న నిబద్ధతను ఈ ప్రాజెక్టు విజయం స్పష్టం చేస్తోంది.
ఈ సందర్బంగా ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్ మాట్లాడుతూ.. ‘‘భారతీయ సృజనాత్మక కథకులకు సరైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించడంతో పాటు ప్రపంచ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ ప్రారంభించాం. ల్యాబ్ రచన విభాగం నుంచి మొదలైన ఒక ప్రాజెక్టు అంతర్జాతీయ భాగస్వామ్యం వైపు వెళ్లడం ఈ కార్యక్రమం సాధించిన అసలైన విజయం’’ అని హర్షం వ్యక్తం చేశారు.
చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత డాక్టర్ దర్శన్ అశ్విన్ త్రివేది మాట్లాడుతూ...‘‘ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. భారత్‌కు చెందిన ఐరోలర్, ఫిన్లాండ్కు చెందిన నోర్స్ కీ సంస్థలతో కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
ఇంత గొప్ప విజయం సాధించిన డాక్టర్ దర్శన్ అశ్విన్ త్రివేదితో పాటు నిర్మాణ భాగస్వాములకు వేవ్స్ ఫిల్మ్ బజార్ శుభాకాంక్షలు తెలిపింది. ‘‘యాయావర్-ది మైగ్రేటింగ్ బర్డ్’’ చిత్రం ప్రపంచ వేదిక వైపు ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తోన్నట్లు పేర్కొంది.
వేవ్స్ ఫిల్మ్ బజార్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ 2026 ఎంట్రీల కోసం త్వరలోనే దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వేవ్స్ ఫిల్మ్ బజార్, ఎన్ఎఫ్‌డీసీ అధికారిక వేదికలపై వెల్లడిస్తారు.
వేవ్స్ ఫిల్మ్ బజార్ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్ గురించి:
2007లో ప్రారంభమైన స్క్రీన్ రైటర్స్ ల్యాబ్... ఎన్ఎఫ్‌డీసీ వేవ్స్ ఫిల్మ్ బజార్ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రతిష్ఠాత్మక ప్రతిభా అభివృద్ధి కార్యక్రమం. ఎంపిక చేసిన రచయితలు భారతీయ, అంతర్జాతీయ ప్రముఖ మార్గదర్శకుల పర్యవేక్షణలో తమ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్‌లను తీర్చిదిద్దుకుంటారు. బహుళ దశల్లో సాగే శిక్షణ పూర్తయ్యాక, ఫిల్మ్ బజార్ వేదికగా తమ ప్రాజెక్టును ప్రదర్శిస్తారు.ఈ ల్యాబ్‌లో రూపుదిద్దుకున్న ప్రముఖ సినిమాల్లో ద లంచ్ బాక్స్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, దమ్ లగా కే హైషా, టిట్లీ, ఎ డెత్ ఇన్ ద గుంజ్, ఉల్లో్ఝుక్కు వంటివి ఉన్నాయి.
వేవ్స్ ఫిల్మ్ బజార్ గురించి:
ఎన్ఎఫ్‌డీసీ నిర్వహించే వేవ్స్ ఫిల్మ్ బజార్ దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్ర మార్కెట్. ప్రతి సంవత్సరం గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకలతో పాటు దీనిని నిర్వహిస్తారు. కొత్త ప్రాజెక్టులను, కొత్త ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలు, ఫైనాన్షియర్లు, సేల్స్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లు, కొనుగోలుదారులు ఇక్కడ ఒకే వేదికపైకి వస్తారు. గత ఏడాది సాధించిన విజయం స్ఫూర్తితో 20వ ఎడిషన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ నవంబర్ 20 నుంచి 24, 2026 వరకు జరగనుంది.
ఎన్ఎఫ్‌డీసీ గురించి:
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ చలచనిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) 1975లో ప్రారంభమైంది. భారతీయ సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు, నిర్మాణ రంగానికి సహకారం, ఫిల్మ్ ఫెసిలిటేషన్ కార్యక్రమాలతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, వేవ్స్ ఫిల్మ్ బజార్‌లను ఎన్ఎఫ్‌డీసీ స్వయంగా నిర్వహిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2287981)
आगंतुक पटल : 6