ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఆపరేషన్ వజ్ర’… 12 కోట్ల 'ఫైటర్ డ్రగ్'గా పిలిచే ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్

మాత్రల అక్రమ రవాణాను భగ్నం చేసిన కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (సీబీఎన్)

ఢిల్లీలోని ఒక గోదాంలో ఉంచిన మాత్రల స్వాధీనం

బెంగళూరు, కొచ్చి‌లలో ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేసిన అధికారులు

प्रविष्टि तिथि: 20 JUL 2026 8:31PM by PIB Hyderabad

సుమారు 30 మెట్రిక్ టన్నుల (30,000 కిలోలు) బరువున్న 12 కోట్ల (120 మిలియన్ల) అధిక సాంద్రత గల ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్ (250ఎంజీ) మాత్రల అక్రమ రవాణాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) భగ్నం చేసింది. ఈ కేసులో బెంగళూరు నుంచి ఒకరిని, కొచ్చి నుంచి ఇద్దరిని… మొత్తం ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది.

 

ప్రాథమిక విచారణ ప్రకారం.. ‘గినియా-బిసావు’కు పంపుతున్నట్లు చెప్పినప్పటికీ ఈ సరుకును వాస్తవానికి ‘లిబియా’కు మళ్లించే ప్రణాళికలో నిందితులు ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీలోని ఒక గోదాం నుంచి ఈ మొత్తం సరుకును స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇది అంతర్జాతీయ అక్రమ రవాణా మార్గాల్లోకి తరలిపోకుండా అధికారులు అడ్డుకున్నారు.

 

‘ఆపరేషన్ వజ్ర' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను గ్వాలియర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ప్రివెంటివ్ టీమ్‌లు 2026 జూలై 10 నుంచి 20 వరకు బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిలలో నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బెంగళూరు, డీఆర్ఐ కొచ్చి, ఇతర ఏజెన్సీలు ఎంతో ప్రభావవంతంగా, సమర్థవంతంగా సమన్వయం చేసుకున్నాయి.

 

గినియా-బిసావుకు చేరాల్సిన 12 కోట్ల (120 మిలియన్ల) ట్రమడాల్ మాత్రలను లిబియాకు మళ్లించాలన్న ప్రణాళికల్లో ఉన్నట్లు నిఘా సమాచారాన్ని సేకరించారు. సీబీఎన్ సమర్థవంతమైన రిస్క్-ఆధారిత ఎగుమతి నియంత్రణ వ్యవస్థ కింద తనిఖీ చేసినప్పుడు అనేక సందేహాస్పద అంశాలు బయటపడ్డాయి. దీనితో లోతైన విచారణ, ఏజెన్సీల సమన్వయం వేగవంతమైంది. అనంతరం గినియా-బిసావుకు చెందిన ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ (ఐఎన్‌సీబీ) అధికారులతో కలిసి సీబీఎన్ జరిపిన విచారణలో చెప్పిన గమ్యస్థానం తప్పని తేలింది. తద్వారా ఈ సరుకును అక్రమంగా మళ్లించే కుట్ర కోణం బహిర్గతం అయింది.

తనిఖీల్లో తేలిన అంశాల ఆధారంగా సీబీఎన్ బెంగళూరులో సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టింది. ఎన్‌డీపీఎస్ చట్టం- 1985లోని సంబంధిత నిబంధనల ప్రకారం బెంగళూరుకు చెందిన లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (ఎల్‌ఎల్‌పీ) కింద నమోదైన సంస్థ డైరెక్టర్‌ను అరెస్టు చేసింది. తదుపరి విచారణలో వీళ్ల సూత్రధారులు కేరళ నుంచి పనిచేస్తున్నట్లు తేలింది. చట్టం నుంచి తప్పించుకోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిరంతర ఇంటెలిజెన్స్ సమాచారంతో కొచ్చిలో మిగిలిన ఇద్దరు కీలక సూత్రధారులను కూడా అధికారులు పట్టుకున్నారు. నిందితులు ముగ్గురినీ ఎన్‌డీపీఎస్ చట్టం- 1985 కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది.

 

సీబీఎన్ ఇండియా అప్రమత్తత ఫలితంగా తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న యుద్ధ ప్రాంతాల్లోకి భారీ స్థాయిలో అక్రమ సింథటిక్ ఓపియాడ్ డ్రగ్స్ ప్రవేశించకుండా అడ్డుకోగలిగారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ సరఫరా వ్యవస్థ భద్రత కోసం జాతీయ ఏజెన్సీల మధ్య సహకారం, అంతర్జాతీయ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల మధ్య రిస్క్ ఆధారిత ప్రొఫైలింగ్, నిరంతర ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్ చాటిచెప్పింది.

 

'ఆపరేషన్ వజ్ర' విజయవంతంగా నిర్వహించడం అనేది అంతర్జాతీయ సరిహద్దులు దాటి జరిగే వ్యవస్థీకృత డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంలో ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు, విభిన్న ఏజెన్సీల మధ్య సమన్వయం, అంతర్జాతీయ సహకారానికి ఉన్న శక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది. ఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద భారతదేశానికి ఉన్న బలమైన నియంత్రణ వ్యవస్థను ఇది చాటిచెబుతోంది. 

 

భారత ప్రభుత్వ స్వప్నమైన 'నషా ముక్త్ భారత్' సాధనలో భాగంగా ఔషధాల సురక్షిత వినియోగాన్ని ప్రోత్సహించడంలో దేశ చట్టపరమైన నియంత్రణ వ్యవస్థను పరిరక్షించడానికి, అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠాలను పూర్తిగా అంతమొందించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది.

****


(रिलीज़ आईडी: 2286845) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil