రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

భారత్‌-మాల్డోవా వాణిజ్య సదస్సులో రాష్ట్రపతి ప్రసంగం


“మాల్డోవా కంపెనీలకు వాణిజ్యం-పెట్టుబడుల దిశగా భారత్‌ అత్యుత్తమ వ్యాపారావకాశాలను కల్పిస్తుంది”

प्रविष्टि तिथि: 20 JUL 2026 7:07PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, మోల్డోవా అధ్యక్షుడు గౌరవనీయ మైయా సాండూ ఈ రోజు చిసినౌలో నిర్వహించిన భారత-మాల్డోవా వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు.

 

భారత్‌-మాల్డోవా దౌత్య సంబంధాలు 1992లో మొదలైన నాటినుంచీ రెండు దేశాల మధ్య ఆత్మీయ, స్నేహ బంధం మరింత పటిస్టమవుతూ వచ్చిందని రాష్ట్రపతి తన ప్రారంభోపన్యాసంలో గుర్తుచేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, ప్రగతి, అంతర్జాతీయ సహకారం తదితరాలపై సమష్టి నిబద్ధత ప్రాతిపదికగా ఈ భాగస్వామ్యం వర్ధిలుతున్నదని ఆమె పేర్కొన్నారు.

 

భారత్‌ ‘వికసిత భారత్-2047' స్వప్న సాకారం వైపు పురోగమిస్తున్న నేపథ్యంలో విశ్వాసం, ఉమ్మడి సౌభాగ్యం ఆధారిత భాగస్వామ్యాలను ఆకాంక్షిస్తున్నాని రాష్ట్రపతి అన్నారు. వ్యవస్థాపన, డిజిటల్ పరివర్తన, తయారీ రంగంలో నాణ్యత, యువ-నిపుణ శ్రామికశక్తి గల భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని తెలిపారు. మరోవైపు మోల్డోవా కూడా సంస్కరణాధారిత దృక్పథం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, ప్రతిభగల మానవ వనరులతో ముందడుగు వేస్తున్నదని చెప్పారు. అలాగే, ఐరోపా విపణులతో మాల్డోవా అనుసంధానం ఇనుమడిస్తోందని, భారతీయ వాణిజ్య సంస్థలకూ ఇది ప్రధాన గమ్యంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

 

డిజిటల్ సాంకేతికతలు, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, సాంకేతికార్థిక ప్రగతి, సార్వజనీన మౌలిక సదుపాయాలు, భౌతిక మౌలిక వసతుల కల్పన, పునరుత్పాదక ఇంధనం, అధునాతన తయారీ, వ్యవసాయం, ఆహార తయారీ, ఔషధాలు, జీవసాంకేతికత, ఆరోగ్య సంరక్షణ వంటి విభిన్న రంగాల్లో సహకారానికి అపార అవకాశాలున్నాయని రాష్ట్రపతి ఏకరవు పెట్టారు. సౌరశక్తి, బ్యాటరీ నిల్వ, స్మార్ట్ గ్రిడ్‌లు, గ్రీన్ హైడ్రోజన్, ఇతర కాలుష్య రహిత సాంకేతికతలు సహా పునరుత్పాదక ఇంధన రంగంలో మోల్డోవా అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించేందుకు భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

వాణిజ్యం-పెట్టుబడుల దిశగా మోల్డోవా కంపెనీలకు భారత్‌ అత్యుత్తమ అవకాశాలు కల్పిస్తుందని రాష్ట్రపతి అన్నారు. పారదర్శకత, అనుసరణీయ విధానాలు, పెట్టుబడిదారు హిత వ్యాపార వాతావరణ సృష్టికి భారత్‌ కట్టుబడి ఉందని చెప్పారు. తదనుగుణంగా అవకాశాల అన్వేషణ కోసం భారత్‌ రావాల్సిందిగా మోల్డోవా వ్యాపార సంస్థలకు ఆమె ఆహ్వానం పలికారు.

 

అదే క్రమంలో మోల్డోవాలో గల వ్యాపార అవకాశాలను అన్వేషించాల్సిందిగా భారత వాణిజ్య సంస్థలకూ రాష్ట్రపతి సూచించారు. శాశ్వత ఆర్థిక భాగస్వామ్యాల దిశగా భారత వాణిజ్యవేత్తల వ్యాపార స్ఫూర్తి, దార్శనికత, నిబద్ధతలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు. ఈ వాణిజ్య సదస్సులో చర్చల ద్వారా కొత్త భాగస్వామ్యాలకు, వినూత్న సహకారానికి పునాది పడుతుందని, రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం ఉన్నత శిఖరాలకు చేరగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

వ్యవసాయం, ఆహార తయారీ, సమాచార సాంకేతికత, ఔషధ, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధనం, విద్య, లాజిస్టిక్స్, డిజిటల్ సాంకేతికతలు సహా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే రెండు దేశాల ప్రసిద్ధ వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

 

*****


(रिलीज़ आईडी: 2286843) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam